కరోనాపై టెన్షన్‌.. టెన్షన్‌ అమ్మ..బాబోయ్‌! | People Getting Tension By Seeing Corona Cases In Telangana | Sakshi
Sakshi News home page

కరోనాపై టెన్షన్‌.. టెన్షన్‌ అమ్మ..బాబోయ్‌!

Published Mon, Apr 6 2020 3:28 AM | Last Updated on Mon, Apr 6 2020 7:19 AM

People Getting Tension By Seeing Corona Cases In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రమంతా ఇప్పుడు కరోనా గుప్పిట ‘బందీ’ అయిపోయింది. యావత్తు తెలంగాణ సమాజం వైరస్‌ తమను కబళిస్తుందేమోననే భయంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతోంది. కరోనా కట్టడికి ‘లాక్‌డౌనే’ మందు, ప్రజలంతా ఇంటిపట్టున ఉండటమే శ్రేయస్కరమని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా ప్రజల్లో మాత్రం ఆందోళన తగ్గట్లేదు. గ్రామాలతో పోలిస్తే ముఖ్యంగా హైదరాబాద్, పట్టణాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్, పట్టణ ప్రాంతాల్లో 75 శాతం ప్రజలు ఇళ్లకే పరిమితమవగా సామాజిక స్పృహ, బాధ్యత మరిచిన 25 శాతం మంది మాత్రం రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతూ ‘లాక్‌డౌన్‌’ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. కానీ బలాదూర్‌గా తిరిగే వాళ్లు బిందాస్‌గా ఉంటే ఎంతో బాధ్యతతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు వైరస్‌ విస్తృతిపై మథనపడుతున్నారు.

అందరిలో ‘మర్కజ్‌’ టెన్షన్‌...
ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారం క్రితం మీడియా సమావేశం నిర్వహించి ఏప్రిల్‌ 4తో విదేశాల నుంచి వచ్చిన వారి క్వారంటైన్‌ గడువు పూర్తవుతుందని, కొత్త పాజిటివ్‌ కేసులు రాకుంటే ఇక రాష్ట్రం కరోనా కోరల నుంచి విముక్తి పొందినట్లేనని పేర్కొనడంతో రాష్ట్ర ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే తెలంగాణపై ‘మర్కజ్‌’పిడుగు పడింది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనల్లో వందల మంది తెలంగాణవాసులు పాల్గొని రాష్ట్రానికి తిరిగి చేరుకోవడం, వారిలో కరోనా పాజిటివ్‌ కేసులు పెద్ద సంఖ్యలో బయటపడటం పరిస్థితిని ఒక్కసారిగా తలకిందులు చేసింది. పైగా వారిలో కొందరు అజ్ఞాతంలోకి వెళ్లారన్న వార్తలు వెలుగులోకి రావడంతో జనంలో విపరీతమైన ఆందోళన మొదలైంది. ఇప్పుడిదే వారిని మానసిక ఒత్తిడిలోకి నెట్టేసింది.

సాధారణంగా ఎవరైనా ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటే వారి మానసిక పరిస్థితిలో కొంత మార్పు రావడం సహజం. అలాంటిది మొత్తం 21 రోజులు ‘లాక్‌డౌన్‌’లో ఉండాల్సి రావడం, ఎక్కువ మందితో నేరుగా మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో ప్రజల మానసిక స్థితి అనూహ్యంగా మారిపోయింది. సానుకూల దృక్పథం ఉన్నప్పుడు పరిస్థితి పెద్ద ఇబ్బందిగా ఉండకపోయినా మర్కజ్‌ వ్యవహారంతో రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పేలా ఉండటం ప్రజల్లో వ్యతిరేక ఆలోచనలకు కారణమైంది. ఇప్పుడిదే వారిని తీవ్ర మానసిక వేదనకు గురి చేసి ఒత్తిడికి లోనయ్యేలా చేస్తోంది. ఇది మంచి పరిణామం కాదని, వెంటనే వారు వీలైనంత మేర ఆలోచనలను పక్కకు మళ్లించాలని మానసిక విశ్లేషకులు సూచిస్తున్నారు. అలాంటి వారు క్రమంగా సానుకూల ధోరణికి వచ్చేలా చూసుకోవాలని, లేకుంటే సున్నిత మనస్కుల్లో ఈ అంశం విపరీత పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

సోషల్‌ మీడియా వికృత పోకడలతో...
కరోనాకు సంబంధించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున అసత్యాలు ప్రచారమవుతున్నాయి. ఎవరికి తోచింది వారు డంప్‌ చేస్తున్నారు. ఇలాంటి అసత్యాలు ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. వెనెజువెలాలో కరెన్సీ మారిన వేళ కొందరు పాత కరెన్సీని రోడ్లపై వెదజల్లిన ఏడాది క్రితం నాటి ఫొటోలను సర్యు్కలేట్‌ చేసి ఇటలీలో డబ్బున్నా కరోనాను జయించలేకపోతున్నామన్న మానసిక వైరాగ్యంతో జనం రోడ్లపై విసిరారని ప్రచారం చేశారు. ఫలానా చోట కరోనా పాజిటివ్‌ వ్యక్తి పారిపోయాడని, జనంలో కలిసిపోయాడని లాంటి తప్పుడు వార్తలతో భయం సృష్టిస్తుననారు. వాస్తవ పరిస్థితి కంటే ఈ తప్పుడు వార్తలే ఆందోళనను పెంచుతున్నాయి.

మతాల మధ్య స్పర్ధలకు కారణం...
ఇటీవల ‘మర్కజ్‌’ వ్యవహారంతో ఒక్కసారిగా సోషల్‌ మీడియా మతాల మధ్య చిచ్చుకు ఎక్కువగా కారణమవుతోంది. ‘మర్కజ్‌’ వ్యవహారాన్ని సమర్థిస్తూ కొందరు పోస్టులు పెడుతుంటే వ్యతిరేకిస్తూ మరికొందరు పెడుతున్నారు. దీంతో పోటాపోటీ వీడియోలు పరిస్థితిని ఆందోళనకరంగా మారుస్తున్నాయి. కొందరు కావాలనే వైరస్‌ వ్యాప్తి చెందేలా చేస్తున్నారన్న వీడియోలు భయం పుట్టిస్తున్నాయి. పాత వీడియోలు కూడా ఇప్పటివే అన్నట్టుగా దర్శనమిస్తున్నాయి. ఓ ప్రార్థనా మందిరంలో కొందరు యువకులు ప్లేట్లు, గ్లాసులు, చెంచాలను ఎంగిలిచేసి పంపుతున్న వీడియో ఇటీవల బాగా వైరల్‌ అయింది. చార్మినార్‌ వద్ద ఓ వర్గానికి చెందిన వారు ప్రార్థనల వేళ పోలీసులపై దురుసుగా వ్యవహరించారని, అది నేడే జరిగిందంటూ ప్రచారంలో ఉంది. కానీ అది కొన్ని నెలల క్రితం నాటిది. ఇలాంటి తప్పుడు వీడియోలు, సమాచారాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ జనాన్ని మరింత మానసిక ఆందోళనకు గురి చేస్తున్నాయి.

రాత్రి నిద్రలో ఉన్న నాకు మూడింటికి ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల అంశం నన్నెంతో కలవరపెట్టింది. మనకూ ఇటలీ పరిస్థితి తలెత్తుతుందా అని మదిలో ఆందోళన రేగింది. వైరస్‌ను మనం కట్టడి చేయగలమా లేదా అనే ఆలోచనతో మళ్లీ నిద్రపట్టలేదు. గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపించింది. – ఇది సిద్దిపేటకు చెందిన శశి మాట

ఢిల్లీలోని నిజాముద్దీన్‌కు వెళ్లిన వారంతా వైద్యులను సంప్రదించి పద్ధతిగా రెండు వారాలు స్వీయ గృహనిర్బంధంలో ఉంటే మళ్లీ పరిస్థితి అదుపులోకి వచ్చేదేమో. కానీ వారిలో చాలా మంది చిరునామాలు దొరకటం లేదట. వారు ఇంకా జనంలోనే ఉంటే ఎన్ని వందల వేల మందికి వైరస్‌ సోకుతుందో ఏమిటో? నిన్నంతా నాకిదే ఆలోచన. – దిల్‌సుఖ్‌నగర్‌ రామకృష్ణాపురానికి చెందిన ప్రకాశం ఆవేదన ఇది.

నిపుణుల మాట ఇది
► ఎక్కువసేపు కుటుంబంతో కలిసుండే అవకాశం ఉన్నందున గతంలోని సంతోషకర జ్ఞాపకాలను గుర్తుచేసుకొని మాట్లాడుకో వాలి. నాటి ఫొటోలు, వీడియోలు చూడా లి. వాట్సాప్‌ ద్వారా దగ్గరి బంధువులు, స్నేహితుల పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల ఫొటోలు, వీడియోలు పరస్పరం షేర్‌ చేసుకుంటూ స్మృతులను నెమరు వేసుకోవాలి.
► ఇళ్లలోని పెండింగ్‌ పనులను చక్కబెట్టుకోవాలి. పెరటి పనుల్లో నిమగ్నం కావాలి. అవకాశం ఉన్నవారు మిద్దెపై కుండీల్లో మొక్కలు పెంచే పని కల్పించుకోవాలి.
► పుస్తక పఠనం ఒత్తిడిని దూరం చేస్తుంది. మంచి పుస్తకాలను చదివి, వాటి సారాం శాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. పిల్లలకు కథలు చెప్పే అలవాటు ఇప్పటికే దూరమైంది. మళ్లీ వారిని కథలలోకి దింపేందుకు ఇదో చక్కని అవకాశం. అందుబాటులో పుస్తకాలు లేకుంటే ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు.
► ఆంగ్లం సహా ఇతర భాషలు నేర్చుకునే వెసులుబాటును అందిపుచ్చుకోవాలి. 
► ఆధ్యాత్మికత వైపు మళ్లాలనుకుంటే టీవీ, యూట్యూబ్‌ల్లో ప్రవచనాలు చూడవచ్చు. 
► బొమ్మలు గీయడం పెద్ద మానసిక ప్రశాం తతనిచ్చే ప్రక్రియ. వచ్చినట్టు  బొమ్మలు గీసి స్నేహితులకు షేర్‌ చేయొచ్చు. సంగీత వాయిద్యాలను నేర్చుకోవడం, పాటలు పాడటం కూడా చేయొచ్చు.
► పిల్లలతో కలిసి చెస్, క్యారమ్స్‌ లాంటి ఇండోర్‌ గేమ్స్‌ ఆడటం మరవొద్దు.
► యోగా, మెడిటేషన్‌ చేయాలి.
► రోజంతా అదేపనిగా టీవీలకు అతుక్కుపోవద్దు. ఎక్కువ సేపు వార్తలు చూడకుండా ఉండటం మంచిది. వీలైనంత ఎక్కువగా మానసిక ఉల్లాసం, విజ్ఞానం అందించే చానళ్లను చూడటం ద్వారా మనసును తేలికపరుచుకోవాలి.

అంతకుమించి..
కరోనా నేపథ్యంలో జ్యోతి వెలిగించాలనే ప్రధాని పిలుపు మేరకు ఆదివారం అంతా దీపాలు వెలిగించారు. జ్యోతి వెలిగిస్తే కరోనా తగ్గదు. కానీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది దోహదపడుతుంది. కరోనా విషయం లో మనకు మంచే జరుగుతుందన్న నమ్మకాన్ని కల్పించేందుకు ఈ సందర్భం ఉపయోగపడొచ్చు. జ్యోతి ప్రజ్వలన మనల్ని మోటివేట్‌ చేసేందుకు ఉపయోగపడుతుంది. అయితే కరోనాపై విజయం సాధించాలంటే ఇలాంటి సింబాలిజమ్‌ కంటే కావాల్సిన చర్యలను ప్రభుత్వాలు చేపట్టాలి. – ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌

లాక్‌డౌన్‌ పాటిస్తే చాలు...
కరోనా కట్టడి అంశాన్ని ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి. డాక్టర్లు, పోలీసులు వారి పనుల్లో ఉన్నారు. మనం చేయాల్సింది ఇళ్లు దాటకుండా ఉండటమే. దీన్ని మాత్రమే మనసులో ఉంచుకుంటే ఒత్తిడి ఉండదు. వైరస్‌ను మాయం చేసే శక్తి మనకు లేనప్పుడు దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకోవద్దు. మనం ఇళ్లను చక్కబెట్టుకోవడం వరకే మన ఆలోచనలను పరిమితం చేయాలి. అప్పుడు టెన్షన్‌ పోతుంది. 
– జయసింహ, మానసిక విశ్లేషకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement