స్కూలు ఫీజులను నియంత్రించాలి | School fees should be demolished, HSPDA demand | Sakshi
Sakshi News home page

స్కూలు ఫీజులను నియంత్రించాలి

Published Wed, Mar 30 2016 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

స్కూలు ఫీజులను నియంత్రించాలి

స్కూలు ఫీజులను నియంత్రించాలి

- ప్రభుత్వానికి హెచ్‌ఎస్‌పీఏ డిమాండ్
- సైబర్ టవర్స్ వద్ద మానవహారం...
- ప్లకార్డుల ప్రదర్శన

 
 హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల ఫీజుల విషయంలో తమిళనాడు, మహారాష్ట్రల తరహా నిబంధనలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు చేయాలని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌పీఏ) ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్గిపెట్టె నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ఎమ్మార్పీ ధరకు లభిస్తుంటే.. స్కూల్ ఫీజుల విషయంలో మాత్రం నిర్దిష్ట విధానాన్ని ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో చెబుతున్న చదువుకు.. అమెరికాలో మాదిరిగా ప్రైవేటు స్కూళ్లు ఫీజులు వసూలు చేస్తున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారని దుయ్యబట్టారు.
 
 మంగళవారం హైదరాబాద్ మాదాపూర్‌లోని సైబర్ టవర్స్ వద్ద హెచ్‌ఎస్‌పీఏ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు మానవహారం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సేవ్ వాటర్, సేవ్ ట్రీస్, సేవ్ పేరెంట్స్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతిని ధులు మాట్లాడుతూ స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయించిన రూ. లక్షల ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తి విద్యా కోర్సుల మాదిరిగా స్కూల్ ఫీజులు నియంత్రించడానికి ఏఎఫ్‌ఆర్‌సీని ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. గతేడాది హైదరాబాద్‌లో 12 స్కూళ్లలో తనిఖీలు చేసి అధికారులు రూపొం దించిన నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. జీఓ ఎంఎస్ నం 1 అమలయ్యే దాకా ఫీజులు పెంచకూడదన్నారు. ఈ కార్యక్రమంలో రీతేష్, అరవింద్, సుబ్రహ్మణ్యం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
 మాతో కలసి రండి
 స్కూళ్లు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండటంపై 2008 నుంచి హెచ్‌ఎస్‌పీఏ ద్వారా పోరాడుతున్నాం. వేళ్లూనుకుపోయిన ఈ విధానానికి చరమగీతం పాడేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, సామాన్యులు కూడా మాతో కలసి రావాలి.     
 - విక్రాంత్, హెచ్‌ఎస్‌పీఏ అధ్యక్షుడు
 
 విద్యతో వ్యాపారం..
 ప్రతి ఏడాది ప్రైవేటు పాఠశాలల ఫీజులను విచ్చలవిడిగా యాజమాన్యాలు పెంచుతున్నాయి. సేవ పేరుతో పుట్టుకొస్తున్న పాఠశాలలు.. యథేచ్ఛగా విద్యను వ్యాపారం చేస్తున్నాయి.     
 - శివ మకుటం, హెచ్‌ఎస్‌పీఏ అధికార ప్రతినిధి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement