
ఇండోర్ : మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ నాయకుల సహకారం తీసుకున్నానని లోక్‌సభ మాజీ స్పీకర్, ప్రముఖ బీజేపీ నాయకురాలు సుమిత్రామహాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో గతేడాది వరకు బీజేపీ ప్రభుత్వం ఉంది. 15 ఏళ్లు తామే అధికారంలో ఉన్నా, పార్టీ క్రమశిక్షణకు లోబడి కొన్ని సమస్యలను బహిరంగంగా ప్రస్తావించలేదని ఆమె వెల్లడించారు. ఇండోర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం విపక్ష కాంగ్రెస్ నాయకులను సమస్యలను ప్రస్తావించమని కోరానని తెలిపారు. అనంతరం వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించమని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరేదానినని వ్యాఖ్యానించారు.
సుమిత్రా మహాజన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి తులసీరామ్ సిలావత్ సోమవారం స్పందిస్తూ.. సుమిత్రా మహాజన్ ఎప్పుడూ ఇండోర్ అభివృద్ధి గురించి ఆలోచించేవారని ప్రశంసించారు. ఆమె చేసిన వ్యాఖ్యలను స్పూర్తిగా తీసుకోవాలని, పార్టీల క్రమశిక్షణను ఉల్లంఘించే నాయకులు ఆమెను చూసి నేర్చుకోవాలని సూచించారు. కాగా, ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచిన సుమిత్రా మహాజన్ లోక్‌సభ స్పీకర్‌గా కూడా పనిచేశారు. బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిబంధన కారణంగా ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment