కనిక; వర్మీ కంపోస్ట్ తయారీలో...
అస్సాంకు చెందిన కనిక భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కనికకు భవిష్యత్ చీకటిగా కనిపించింది. తాను ఎలా బతకాలి? అనే ఆందోళన మొదలైంది. ధైర్యం ఉంటే అదే దారి చూపిస్తుంది అంటారు. డీలా పడకుండా ధైర్యంగా ఉండడం నేర్చుకుంది. అయిదు వందల రూపాయల పెట్టుబడితో వర్మికంపోస్ట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టిన కనిక ఇప్పుడు లక్షాధికారి అయింది...
పెళ్లయిన మూడు సంవత్సరాలకు అస్సాంలోని బోర్జాహర్ గ్రామానికి చెందిన కనికా తలుక్దార్‌కు బిడ్డ పుట్టింది. బిడ్డ మూడు నెలల వయసులో ఉన్నప్పుడు భర్త అనారోగ్యంతో చనిపోవడం కనికను విషాదసాగరంలోకి నెట్టింది. కళ్ల ముందు పసిపాపే కనిపిస్తుంది. భవిష్యత్ మాత్రం మసకబారిపోయింది. ఆ సమయంలో వర్మికంపోస్ట్ రూపంలో ఒక వెలుగు కిరణం కనిపించింది.
కొన్ని సంవత్సరాల క్రితం కృషి విజ్ఞాన కేంద్ర(కేవీకే) నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో వర్మికంపోస్ట్, చేపల పెంపకం, కోళ్ల పెంపకం...మొదలైన వాటి గురించి తెలుసుకుంది కనిక. వర్క్‌షాప్ తాలూకు విషయాలు గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు వర్మికంపోస్ట్ తయారీ సులభం అనిపించింది. ఎందుకంటే ఆవు పేడలాంటి ముడిసరుకులు సేకరించడానికి తాను పెద్దగా కష్టపడనక్కర్లేదు.
ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా తన చుట్టుపక్కల అందుబాటులో ఉన్న వనరులతోనే వర్మికంపోస్ట్ తయారుచేయవచ్చు. 2019లో నార్త్ ఈస్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్ రెండు నెలల ఓరియెంటేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం కనికకు ఎంతో ఉపకరించింది. శిక్షణలో భాగంగా వర్మివాష్‌ను తయారు చేయడం నేర్చుకుంది. ఇది వర్మికంపోస్ట్ నుంచి తయారుచేసే ద్రవసారం. సాధారణ వర్మికంపోస్ట్ కంటే ఎక్కువ నత్రజని, భాస్వరం..మొదలైనవి ఇందులో ఉంటాయి.
అయిదు వందల రూపాయల పెట్టుబడితో వ్యాపారంలోకి అడుగు పెట్టింది కనిక. కృషి విజ్ఞాన కేంద్ర ఉచితంగా వానపాములను అందించింది. ‘జై వర్మికంపోస్ట్’ బ్రాండ్‌తో వర్మికంపోస్ట్, వర్మివాష్ అమ్మకానికి రెడీ అయింది. తయారీ సంగతి సరే, మరి కొనేవారు ఎవరు? రసాయన ఎరువులకు అలవాటు పడిన రైతులకు వర్మికంపోస్ట్ నచ్చుతుందా?
అందుకే తన ఉత్పత్తికి తానే ప్రచారకర్తగా మారింది.
వర్మికంపోస్ట్ వాడకం వల్ల నేలకు జరిగే మేలు ఏమిటో ఊరూరా తిరుగుతూ ప్రచారం చేసింది. ఆమె శ్రమ వృథా పోలేదు. వ్యాపారం అడుగుల స్థాయి నుంచి పరుగుల స్థాయికి చేరుకుంది. పేడ కోసం మొదట రెండు ఆవులను కొన్న కనిక ఆ తరువాత నాలుగు ఆవులను ఒకేసారి కొనగలిగే స్థాయికి చేరింది. ఒకప్పుడు ‘జై’ కంపెనీ ఒక సంవత్సరంలో 800 కిలోల వర్మికంపోస్ట్‌ను ఉత్పత్తి చేసేది. ప్రస్తుతం అది నెలకు 35 టన్నుల స్థాయికి చేరుకుంది.
అస్సాం అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌తో పాటు మేఘాలయా, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌లో ఎన్నో నర్సరీలు జై ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయి. వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినా అద్భుత విజయం సాధించిన కనిక ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. విద్యార్థుల కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
(అస్సాం) ప్రతి నెల కనికతో అవగాహన తరగతులు నిర్వహిస్తోంది.
‘ఇది కలలో కూడా ఊహించని విజయం. ఎలా బతకాలో అని భయపడిన నేను ఎంతోమందికి ఉపాధి కల్పించగలుగుతున్నాను. ఎలా బతకాలో తెలియక ఒకప్పుడు ధైర్యం కోల్పోయిన నేను ఇప్పుడు ఎంతోమందికి ధైర్యం చెబుతున్నాను. ఈ విశాలమైన ప్రపంచంలో మన కోసం ఎన్నో అవకాశాలు ఉంటాయి. వాటిలో ఒకటి అందిపుచ్చుకున్నా మన జీవితమే మారిపోతుంది’ అంటుంది నలభై అయిదు సంవత్సరాల కనికా తలుక్దార్.
Comments
Please login to add a commentAdd a comment