ఒకసారి టర్నోవర్‌ కోట్లలో.. ఒకసారి పుస్తెలతాడు కూడా తాకట్టులో..! | Inspirational Story Of Saka Sailaja Who Runs Rojas Industries | Sakshi

ఒకసారి టర్నోవర్‌ కోట్లలో.. ఒకసారి పుస్తెలతాడు కూడా తాకట్టులో..!

May 31 2022 11:29 PM | Updated on May 31 2022 11:29 PM

Inspirational Story Of Saka Sailaja Who Runs Rojas Industries - Sakshi

ఏమీ లేని చోట కూడా వనరుల కల్పనకు కృషి చేయవచ్చు అని నిరూపించారు సాకా శైలజ. బీడీ కార్మికులను బ్యూటీషియన్లుగా తీర్చిదిద్దారు. వెయ్యి రూపాయల అద్దె కట్టడానికి లేని రోజుల నుంచి కోటి రూపాయల టర్నోవర్‌ చేరేవరకు కృషి చేస్తూనే ఉన్నారు. తెలంగాణలోని కరీంనగర్‌లో రోజాస్‌ ఇండస్ట్రీ పేరుతో సినోవ్‌ బ్యూటీ ప్రొడక్ట్స్‌ తయారుచేస్తున్న సాకా శైలజ జీవన ప్రయాణం ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఒక పాఠం.

పూర్తిగా మహిళా ఉద్యోగులు మాత్రమే పని చేసే సంస్థను నడుపుతున్నారు శైలజ. ఆర్గానిక్‌ బ్యూటీ ప్రొడక్ట్స్, కెమికల్‌ హౌస్‌ క్లీనర్స్‌ను తయారుచేసే కంపెనీయే కాదు, బ్యూటిషియన్‌ కోర్సులనూ ఇస్తున్నారు. ఇరవై ఏళ్లలో 30 వేల మంది మగువలను బ్యూటీషియన్లుగా తీర్చిద్దారు. పాతికేళ్ల వయసులో మొదలుపెట్టిన వ్యాపారం 
గురించి శైలజ వివరిస్తూ.. 

అడవిలో ఇంగ్లిషు పాఠాలు
‘‘నాకు పంతొమ్మిదేళ్ల వయసులో పెళ్లయ్యింది. మా వారికి టీచర్‌గా ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పోస్టింగ్‌. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి, డిగ్రీ చేసిన నేను పెళ్లవగానే ఓ అటవీ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. ఖాళీ టైమ్‌లో అక్కడి పిల్లలను చేరదీసి, ఇంగ్లిష్‌ నేర్పించేదాన్ని. దానినే ట్యూషన్‌గా మార్చుకున్నాను. అలా ఆర్నెళ్లు తిరిగేసరికి మా వారికన్నా రెట్టింపు ఆదాయాన్ని సంపాదించేదాన్ని. తర్వాత పిల్లలు పుట్టడం, వారి పెంపకంలో హైదరాబాద్‌ వచ్చినప్పుడు బ్యూటిషియన్‌ కోర్సు నేర్చుకున్నాను. మా వారికి సిరిసిల్ల ట్రాన్స్‌ఫర్‌ అయితే, అక్కడ బ్యూటీపార్లర్‌ ఏర్పాటుకు ప్రయత్నించా. చాలా మంది విమర్శించారు ఊళ్లో బ్యూటీపార్లరా అని. ఇల్లు కూడా ఎవరూ అద్దెకు ఇవ్వలేదు. దళిత్‌ అనే వివక్ష కూడా చాలా చోట్ల ఎదుర్కొన్నాను. చివరకు అద్దె వరకు ఆదాయం వచ్చినా చాలని ఒక రూమ్‌లో పార్లర్‌ ప్రారంభించాను.  

ఉచితంగా శిక్షణ
పార్లర్‌లో పనిచేయడానికి వచ్చిన అమ్మాయిలు ఇంటి వద్ద బీడీలు చుడతామని చెప్పారు. అలా వచ్చే ఆదాయం వారికేం సరిపోతుందని, బ్యూటిషియన్‌ పని నేర్పించాను. అలా మరికొంత మంది అమ్మాయిలు చేరారు. వారికీ ఉచితంగా శిక్షణ ఇచ్చాను. హైదరాబాద్‌లోని బ్యూటీ సెలూన్‌ వారితో మాట్లాడి వారికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాను. ఆ తర్వాత కరీంనగర్‌కు ట్రాన్స్‌ఫర్‌. ఇక్కడా మరో బ్రాంచ్‌ ప్రారంభించి, బ్యూటీపార్లర్‌ నడుపుతూ, మహిళలకు శిక్షణ ఇస్తూ వచ్చాను. అలా బ్యూటీ కోర్సులో చేరే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. 

ఉత్పత్తుల తయారీ
ఒక డాక్టర్‌ని కలిసినప్పుడు, ‘మీ వర్క్‌లో ఎలాంటి ప్రొడక్ట్స్‌ అవసరమో మీకు బాగా తెలుసు కాబట్టి వాటిని మీరే తయారుచేయవచ్చు కదా’ అన్నారు. అప్పుడు ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ తయారుచేసి, బ్యాంక్‌కు వెళ్లాను. అది కోటి రూపాయల ప్రాజెక్ట్‌. నేనెప్పుడూ చూడని అంకె అది. కానీ, ప్రయత్నించాను. నెల రోజులకు బ్యాంక్‌ లోన్‌ వచ్చింది. అప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్‌ ఫ్యాక్టరీ ప్రారంభించాను. 

మార్కెట్‌ పెద్ద టాస్క్‌
ఉత్పత్తుల తయారీ చాలా బాగుంది. మా పార్లర్స్‌లోనే వాటిని ఉపయోగిస్తున్నాం. బయట కూడా మార్కెట్‌ చేయాలి అని సెర్చ్‌ చేస్తున్నప్పుడు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌లో స్లాట్‌ ఓకే అయ్యింది. అక్కడ నా ప్రొడక్ట్స్‌ పెట్టినప్పుడు, ఫారినర్స్‌ చూసి ఆర్డర్‌ ఇచ్చారు. మా యూనిట్‌కి వచ్చి, చూసి, ప్రతీది తెలుసుకున్నారు. ప్రతి యేడాది కోటి రూపాయల మార్కెట్‌ చేస్తున్నాను. 

కరోనా వేసిన వేటు
ఈ యేడాది మార్చ్‌ వరకు 70 లక్షల టర్నోవర్‌ చేశాను. మార్కెట్‌ పెరగడానికి కరోనా ఓ అడ్డంకి అయ్యింది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా మూసి వేశారు. కానీ, నేను ఆగకుండా నడిపించాను. కరోనా టైమ్‌లోనే చైనా బార్డర్‌లో ఉన్న ప్రాంతానికి ఆరు రోజుల ఆలశ్యంగా ప్రొడక్ట్‌ డెలివరీ అయ్యింది. లేట్‌ అయ్యిందనే కారణంతో ప్రొడక్ట్‌ని రిజక్ట్‌ చేశారు. దానిని వెళ్లి తీసుకురాలేక వదిలేయాల్సి వచ్చింది. కరోనా సీజన్‌లో నా దగ్గర డబ్బు లేదు. దీంతో బంగారం తాకట్టు పెట్టాను. అదే సమయంలో రా మెటీరియల్‌ సప్లయ్‌ చేసే అతని ఆరోగ్యం బాగోలేక, డబ్బు వెంటనే కావాలన్నారు. ఆ సమయంలో వేరే దారిలేదు. నా మెడలో పుస్తెలతాడు, గాజులు, చెవి కమ్మలు తీసి మా అబ్బాయితో బ్యాంక్‌కు పంపించాను. బిజినెస్‌లో చాలా సవాళ్లు ఉంటాయి, డీలా పడిపోకూడదు. నా సంస్థ ఎప్పుడూ మంచి ఆదాయాన్ని ఇచ్చేదే. ఎంతో మందికి జీవితాన్ని ఇస్తుంది. నాకున్న లక్ష్యం ముందు మిగతా సమస్యలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. 

బ్యాలెన్స్‌ ఒక సవాల్‌
ఇటీవల మా వారికి గుండెపోటు వచ్చింది. ఇదే సమయంలో కంపెనీ స్థలం ఓనర్‌ ఆ భూమిని వేరొకరికి అమ్మారు. దీంతో ఎటూ తేల్చుకోలేక, లాయర్‌ సలహా తీసుకున్నాను. మా వారి ఆరోగ్యం, పిల్లలు, కంపెనీ.. దేనినీ వదులుకోలేను. అలాగే, సమస్య అంటూ ఇంటికి వచ్చే అమ్మాయిలకు కౌన్సెలింగ్, సాయం ఎలాగూ ఉంటుంది. వ్యాపారంలో ఒత్తిడి కూడా తీవ్రంగా ఉంటుంది. దానిని అధిగమిస్తేనే విజయం. వర్కింగ్‌ క్యాపిటల్‌ పెరిగితే ఐదు కోట్ల బిజినెస్‌ చేయాలన్నది ఈ యేడాది ప్లానింగ్‌. బ్యూటిషియన్‌ స్కూల్‌తో పాటు, ప్రొడక్ట్స్‌ తయారీలోనూ అంతా మహిళలే. ఒక్కోసారి ఇంతమందికి ఉపాధి కల్పించాం కదా అని గర్వంగా ఉంటుంది. నా దగ్గర పనిచేసే మహిళలు కూడా సొంతంగా చిన్న చిన్న యూనిట్స్‌ పెట్టుకునేలా ప్లాన్‌ చేస్తున్నాను’’ అని వివరించారు శైలజ. – నిర్మలారెడ్డి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement