
ప్రతీ ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలోని ప్రతీ ఇంట్లో ఒక మహిళా కంప్యూటర్ లిటరేట్, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 80 లక్షలమంది డ్వాక్రా మహిళలకు డిజిటల్ లిటరసీ దిశగా శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. మూడునెలల వ్యవధిలో వీరందర్నీ డిజిటల్ అక్షరాస్యులుగా చేస్తామని ప్రకటించారు.
‘గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి ప్రాజెక్టు’(ఏపీఆర్‌ఐజీపి)పై గురువారమిక్కడ వర్క్‌షాప్ నిర్వహించారు. ఇందులో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదరికం నిర్మూలనతోపాటు సమ్మిళిత వృద్ధి కూడా అవసరమేనని, ఈ దిశగా మహిళా స్వయంసహాయక సంఘాలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ సంస్థలను మహిళా స్వయంసహాయక సంఘాలకు చేరువ చేయడం ద్వారా గ్రామీణాభివృద్ధి సాధించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఇందుకోసం సెర్ప్ నేతృత్వంలో రూ.660 కోట్లతో గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి ప్రాజెక్టును చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 80 లక్షలమంది డ్వాక్రా మహిళలకు కంప్యూటర్ పరిజ్ఞానంలో శిక్షణ అందించే కార్యక్రమానికి ఈ సదస్సులో శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు. నిధులకు ఎప్పుడూ కొరతలేదని, చేస్తున్న పనిలో నైపుణ్యత సాధించడమే ఇప్పుడు కావాల్సిందన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళా స్వయంసహాయక సంఘాలను ఆర్థికంగా సమున్నతుల్ని చేసి గ్రామీణ సమ్మిళిత వృద్ధికి ఊతమిచ్చేందుకు, సంఘాల వ్యవసాయోత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించేందుకు సంబంధించి 16 వ్యాపార సంస్థలు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు(ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి. వాల్‌మార్ట్, ఐటీసీ, ఓలమ్‌ఆగ్రో, మహీంద్ర అండ్ మహీంద్ర, శ్రేష్ట వంటి వ్యాపార దిగ్గజాలు డ్వాక్రా సంఘాలతో కలసి పనిచేయడానికి ముందుకొచ్చాయి.