నేహ నియాలంగ్, దలాడే ఫుడ్స్‌లో తయారుచేసిన జామ్స్
Neha Nialang Success Story In Telugu: ఇంట్లో ఆడపిల్ల ఉందంటే అమ్మకు ఇంటిపనుల్లో చేదోడువాదోడుగా ఉంటుంది. ఓ నాలుగురోజులు ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా పిల్ల చూసుకుంటుందన్న భరోసా కూడా కల్పిస్తారు కొందరమ్మాయిలు. నేహ నియాలంగ్ భరోసాతోనే ఆగిపోకుండా, తనకు తెలిసిన వంటల తయారీతో ఏకంగా వ్యాపారాన్ని ప్రారంభించింది. చిన్నప్పటినుంచి ఇంటి, వంట పనుల్లో చూరుకుగా పాల్గొనే నేహ ఇంట్లో వాళ్ల కోసం సరికొత్త వంటలు వండడమేగాక, వాటిని బయట మార్కెట్లో విక్రయిస్తూ.. 23 ఏళ్లకే ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగి, మేఘాలయ రుచులను ఇతర ప్రాంత వాసులకు అందిస్తోంది.
మేఘాలయలోని జోవైకు చెందిన నేహానియాలంగ్ అందరి అమ్మాయిల్లానే ఇంట్లో పనులను ఇలా చూసి అలా పట్టేసింది. అయితే మేఘాలయలో అనేక కుటుంబాలు ఒక దగ్గర కలిసి నచ్చిన వంటకాలు వండుకుని కలసి తినే సంప్రదాయం ఉంది. దీంతో అడపాదడపా జరిగే గెట్ టు గెదర్‌లలో వండే వంటకాలను నేహ ఆసక్తిగా నేర్చుకునేది. ఇలా నేర్చుకుంటూనే పదహారేళ్లు వచ్చేటప్పటికీ ఇంట్లో అందరికీ వండిపెట్టే స్థాయికి ఎదిగింది. ఇంట్లో తరచూ వంటచేస్తూ ఉండడం వల్ల ఏం ఉన్నాయి ఏం లేవు అనేది జాగ్రత్తగా గమనించేది.
సరుకులు నిండుకుంటే వెంటనే మార్కెట్‌కు వెళ్లి తెచ్చేది. అయితే కొన్నిసార్లు ఇంట్లో ఎక్కువగా వాడే జామ్ వంటివి దొరికేవి కావు. కానీ అవి లేకపోతే ఇంట్లో నడవదు. చపాతీ, రోస్టెడ్ బ్రెడ్‌లోకి జామ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. జామ్ దొరకనప్పుడు.. జామ్‌ను ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది తనకు. దీంతో ఇంట్లో ఉన్న పండ్లతో జామ్‌లు తయారు చేయడం మొదలు పెట్టింది. ఈ జామ్‌లు ఇంట్లో వాళ్లకు నచ్చడంతో రకరకాల జామ్‌లు తయారుచేసేది. నేహ తయారు చేసిన జామ్‌ల రుచి నచ్చిన కుటుంబసభ్యులు.. అమ్మకం మొదలు పెడితే ఇవి బాగా అమ్ముడవుతాయి’’ అని చెప్పేవాళ్లు. నేహ మాత్రం ఆ మాటలకు నవ్వేదేగానీ, సీరియస్‌గా తీసుకునేది కాదు.
వృథా కానివ్వద్దని..
లాక్ డౌన్ సమయంలో చాలా రకాల పండ్లు వృథా అయ్యేవి. ప్రభుత్వ నిబంధన ప్రకారం నిర్దేశిత సమయాల్లోనే పండ్లు కూరగాయలు విక్రయించాలి. ఆ సమయంలోపు అమ్మకపోతే, అప్పటికే బాగా పండిన పండ్లు మగ్గిపోయి వృథా అయిపోయేవి. మార్కెట్‌కు వెళ్లిన ప్రతిసారి నేహ ఈ విషయాన్ని గమనిస్తుండేది. ఒకసారి ఓ రైతు పండ్లను పారబోయడం చూసింది. ఎందుకు పారబోస్తున్నావని అడిగితే..‘‘మార్కెట్ సమయం అయిపోయింది. ఇవి ఇలా ఉంటే రేపటికి ఇంకా మగ్గిపోతాయి.
ఎలాగూ అమ్ముడు కావు. ఈ గంపను అద్దెకు తీసుకొచ్చాను. ఈరోజే యజమానికి ఇచ్చేయాలి’’ అని చెప్పాడు. అతని మాటలు నేహ మనసుని తట్టిలేపాయి. ‘ఎంతో చెమటోడ్చి పండిన పంట నేలపాలవుతోంది. ఈ పండ్లే వారి జీవనాధారంం అవి ఎటూగాకుండా పోతున్నాయి’ అనిపించింది తనకు. వీటిని వృథాగా పోనివ్వకుండా వీటితో ఏదైనా తయారు చేయాలనుకుంది. అనుకుందే తడవుగా మార్కెట్లో దొరికే పండ్లను కొని జామ్‌లు తయారు చేయడం మొదలు పెట్టింది. పండ్లు భారీగా లభ్యమవుతుండడంతో పెద్ద మొత్తంలో జామ్‌లు తయారు చేసేది.
దలాడే ఫుడ్స్..
నేహ తయారుచేసిన జామ్‌లు ముందుగా స్థానికంగా విక్రయించింది. వాటికి మంచి స్పందన లభించడంతో ‘దలాడే ఫుడ్స్’ ప్రారంభించి భారీ స్థాయిలో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో విక్రయిస్తుండేది. దలాడే అనేది మేఘాలయలో మాట్లాడే ఖాసీ భాష పదం. దలాడే అంటే ‘మనంతట మనమే’ అని అర్థం. రైతులు ఉత్పత్తి చేసిన దేనిని కూడా వ్యర్థంగా పోనివ్వకుండా..పండ్ల నుంచి తేనె వరకు అన్నింటినీ దలాడే ద్వారా విక్రయిస్తోంది నేహ.
ఏడాది తర్వాత స్థానికంగా దొరికే తేనె, మేఘాలయలో ప్రముఖంగా లభించే లకడాంగ్ పసుపు, రుచికరమైన చట్నీలు, జీడిపప్పు బటర్, తేనెతో చేసిన మసాలాల వంటి వాటిని విక్రయిస్తోంది. ఎటువంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు వాడకుండా సహజసిద్ధమైన పద్ధతిలో మేఘాలయ రుచులను వివిధ ప్రాంతాలకు అందిస్తోంది.
‘‘కేవలం బీఎస్సీ బయోకెమిస్ట్రీ చదివిన నాకు ఈ వ్యాపారం కాస్త కష్టంగానే ఉంది. అందులోనూ వ్యాపారం అంటే మామూలు విషయం కాదు. ఈ రంగంలో అనుభవం ఉన్న కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి వంట మీద ఆవగాహనతోనే ఈ రంగంలోకి దిగాను. అందుకే ఒక్కొక్క అంశాన్ని జాగ్రత్తగా నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాను. మహిళా పారిశ్రామిక వేత్తలకు సాధికారత అందించే కార్యక్రమాల్లో పాల్గొని తెలియని విషయాలు ఎన్నో నేర్చుకుంటున్నాను’’ అని నేహ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment