అరకొర ఆర్థిక పరిస్థితులు బాల్యాన్ని సర్దుకు పొమ్మన్నాయి. ఏమీ తెలియని పసిమనసు కూడా పరిస్థితులకు తలొంచక తప్పలేదు. తన వయసుతో పాటు కుటుంబ ఆర్థికభారం పెరిగిపోతుంటే చూడలేకపోయింది. డిగ్రీలోనే సంపాదనకు నడుం బిగించి, 28 ఏళ్లకే సక్సెస్‌పుల్ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది ప్రాచీ భాటియా.
ఘజియాబాద్‌కు చెందిన ప్రాచీ భాటియా దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. తండ్రి జర్నలిస్టు, తల్లి గృహిణి. తండ్రికొచ్చే కొద్దిపాటి ఆదాయమే కుటుంబానికి ఆధారం. ఆ ఆదాయం ఏమూలకూ సరిపోయేది కాదు. ప్రాచీ స్కూలు ఫీజులు కట్టడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడూ స్కూల్లో అందరికంటే ఆలస్యంగా ఫీజు చెల్లించేవారు. ఇంతటి గడ్డు పరిస్థితుల్లో సైతం ఇంటర్మీడియట్ పూర్తిచేసిన ప్రాచీ ... తనకెంతో ఇష్టమైన డిజైనింగ్ డిగ్రీ చేయాలనుకుంది. అనుకున్నట్టుగానే ఢిల్లీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్‌టీ) లో సీటు సంపాదించింది. కానీ అక్కడ హాస్టల్ ఫీజు, ఇతర ఖర్చులకు డబ్బులు లేక ఎన్‌ఐఎఫ్‌టీలో చేరలేదు. గురుగామ్‌లోని జీడీ గోయెంకా యూనివర్శిటీలో చేరింది.
► సంపాదిస్తూనే కాలేజీ టాపర్
అతి కష్టంమీద డిగ్రీలో చేరిన ప్రాచీ.. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క చిన్న వ్యాపారం ప్రారంభించింది. కుటుంబానికి ఆర్థి కంగా సాయపడేందుకు.. గిఫ్ట్స్ తయారు చేసి విక్రయించేది. ఫొటో ఆల్బమ్స్, ఫొటో ప్రింటెడ్ ల్యాంప్స్, హ్యాండ్‌మేడ్ కార్డ్స్, రోజెస్ వంటివి తయారు చేసి ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసేది. ఇలా విక్రయిస్తూ నెలకు ఐదువేల రూపాయల దాకా సంపాదించేది. వాటిలో కొంత ఇంట్లో ఇచ్చి మిగతావి దాచుకునేది. ఆర్ట్స్, క్రాఫ్ట్స్ మీద ఆసక్తి ఉండడంతో సర్టిఫికెట్ కోర్సులు చేసేది. మరోపక్క డిగ్రీ చదువుతూ వచ్చే స్కాలర్‌షిప్‌తో తన ఎడ్యుకేషన్ లోన్ కట్టేది. ఇవన్నీ చేస్తూ కూడా డిగ్రీలో కాలేజ్ టాపర్‌గా నిలిచింది ప్రాచీ.
► ఎంప్లాయీ నుంచి ఎంట్రప్రెన్యూర్‌గా
డిగ్రీ పూర్తవగానే ప్రాచీ గురుగామ్‌లోని ఓ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో అసిస్టెంట్ డిజైనర్‌గా చేరింది. కొన్నాళ్లు పనిచేశాక.. మరో బహుళ జాతి కంపెనీలో డిజైనర్‌గా ఉద్యోగావకాశం వచ్చింది. అందులోచేరిన కొద్దిరోజులకే ‘‘ఒకరి కింద నేనెందుకు పనిచేయాలి? నేనే ఏదైనా కొత్తగా ప్రారంభించవచ్చు కదా!’’ అనుకుని వెంటనే ఉద్యోగం వదిలేసింది. అప్పటిదాకా చేసిన ఉద్యోగ అనుభవ పాఠాలతో 24 ఏళ్ల వయసులో సొంతంగా ‘చౌఖట్’ పేరిట హోండెకార్ బ్రాండ్‌ను స్థాపించింది. అప్పటివరకు దాచుకున్న లక్ష రూపాయలను పెట్టుబడిగా పెట్టి.. ఇంటి అలంకరణలో ఉపయోగించే∙ఉత్పత్తులను పేపర్ మీద డిజైన్ చేసి, మొరాదాబాద్, జైపూర్, నోయిడాలలోని కళాకారులతో రకరకాల కళాఖండాలను తయారు చేయించేది.
తయారైన ఉత్పత్తులను ఫోటోషూట్ చేసి తన సొంత వెబ్‌సైట్‌లో పెట్టి విక్రయించడం మొదలు పెట్టింది. విక్రయాలు కాస్త మందకొడిగా ఉండడంతో.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రకటనలు ఇచ్చింది. వీటిద్వారా చౌఖట్‌కు గుర్తింపు రావడంతో వ్యాపారం ఊపందుకుంది. దీంతో తన మార్కెటింగ్ బడ్జెట్ నెలకు యాభైవేలకు చేరింది. తొలిఏడాది మూడు లక్షలు, రెండో ఏడాది పదకొండు లక్షలు. దురదృష్టవశాత్తూ మూడో ఏడాది కరోనా కారణంగా ఆశించినంత ఆదాయం రాలేదు. దాంతో ప్రాచీ తన ఐడియాలతో వ్యాపారం పుంజుకునేలా చేయడంతో... గతేడాది (నాలుగో సంవత్సరం) ఒక్కసారిగా 35.5 లక్షలకు చేరింది. ఐదు వందల నుంచి ఇరవై వేల రూపాయల ధరల్లో ఉన్న 70 రకాల ఛౌఖట్ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఆర్డర్లు వస్తున్నాయి. తను డిజైన్ చేసిన వస్తువులను స్కూటీ మీద మోసుకెళ్లిన ప్రాచీ ఇటీవలే తన సొంత డబ్బులతో కారు కొనుక్కుంది.
► రాయి శిల్పంగా మారినట్టు..
‘‘నేను నడిచిన దారిలో అనేక బెదిరింపులు, వయసు వివక్షలు వంటి అనేక ఇబ్బందులు, సమస్యలు, ఒత్తిళ్లు ఎదురయ్యేవి. అయితే ఉలి దెబ్బలకు రాయి శిల్పంగా మారినట్లు వీటన్నింటిని భరిస్తూనే ఈ స్థాయికి వచ్చాను. భవిష్యత్‌లో చౌఖట్ టర్నోవర్‌ను నాలుగు వందల కోట్లకు తీసుకెళ్లాలి. ఇంటి అలంకరణ వస్తువులు కావాలంటే కస్టమర్లు నా చౌఖట్‌ను ఎంచుకునే స్థాయికి ఎదుగుతాను’’ అని ప్రాచీ సగర్వంగా చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment