Home decor items
-
ఆధునికత, హస్తకళా నైపుణ్యం మేళవింపుతో గౌరాంగ్ హోం ‘నీల్’ కలెక్షన్ ఎగ్జిబిషన్
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెక్స్టైల్ డిజైనర్ గౌరంగ్ సరికొత్త కలెక్షన్‌ను లాంచ్ చేశారు. జాతీయ అవార్డు ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా, సాంప్రదాయ భారతీయ వస్త్రాలు , హస్తకళలు, జమ్దానీ కళను పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా "గౌరంగ్ హోమ్"లోని "నీల్" పేరుతో తొలి కలెక్షన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇందులో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫర్నిచర్, ఫర్నీషింగ్లు , పింగాణీ వస్తువులు ప్రదర్శనకుంటాయి. నాణ్యత, టైమ్‌లెస్ డిజైన్‌కు ప్రాధాన్యతినిస్తూ, సాంప్రదాయ హస్తకళ లేటెస్ట్ ట్రెండ్ మిళితమై ఈ వస్తువులు కొలువు దీరతాయి."గౌరంగ్ హోమ్" ద్వారా ఇంటీరియర్ డిజైన్ సేవల్లోకి ప్రవేశిస్తూ, కాన్సెప్ట్-టు-ఫినిష్ స్టైల్లో ఇంటిని అందంగా తీర్చిదిద్దు కోవడంలో పాపులర్ డిజైన్ ఫిలాసఫీని ప్రతిబింబించేలా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో “గౌరంగ్ హోమ్” కలెక్షన్ ఎగ్జిబిషన్ అక్టోబరు 4న ప్రారంభం కానుంది. ఉదయం 10:30 నుండి సాయంత్రం 6:00 వరకు అందుబాటులో ఉంటుంది.'నీల్' కలెక్షన్లోని ప్రతి భాగం ఆ కళ గురించి మాత్రమే కాకుండా, దానిని తయారు చేసిన శిల్పి నైపుణ్యాన్ని తెలిపుతూ,ఈ కలెక్షన్ మీ ఇంటిని నిజంగా ప్రత్యేకంగా చేస్తుంది అంటారు గౌరాంగ్. ఇండియన్ ఇంటీరియర్స్ కోసం ఇదొక కొత్త అధ్యాయమన్నారు. నీల్ కలెక్షన్స్‌లో ఫర్నిషింగ్స్, బెడ్‌స్ప్రెడ్‌లు, కంఫర్టర్లు, దిండు కవర్లు , టేబుల్ లినైన్స్ సిగ్నేచర్ స్టైల్లో ఉంటాయి. ఇందులో జమ్దానీ నేత, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చికాన్, కసౌటి, సుజినీ కళాత్మకతతో ఇండిగో (నీలిరంగు)కలర్లో ఆకట్టుకుంటాయి.అందానికి, ఆరోగ్యానికి తగినట్టుగా శతాబ్దాల రాగి ,తగరంతో తయారు చేసిన శతాబ్దాల నాటి వస్తువలను సిరామిక్‌తో తయారు చేసిన క్రోకరి మరో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఇందులో పురాతన కుండల వినియోగానికి ప్రతీకగా, చేతితో తయారు చేసిన డిన్నర్వేర్ ఉంటుంది. ప్రతీ వస్తువును ప్రపంచవ్యాప్తంగా లభించే మట్టితో తయారు చేయడం విశేషం.ఈ వెంచర్ ద్వారా, తన ప్రసిద్ధ డిజైన్ ఫిలాసఫీని జీవితానికి తీసుకురావాలనేదే గౌరంగ్ లక్ష్యం. భారతదేశ చేనేత సంప్రదాయాలను పరిరక్షించడం, పర్యావరణ అనుకూల పదార్థాలు, సహజ రంగులు, సాంప్రదాయ పద్ధతులు,కళాకారుల నైపుణ్యాన్ని మెచ్చుకునేలా పర్యావరణ స్పృహ ఉన్న ఔత్సాహిక గృహాలంకరణ వినియోగదారులను ఆకట్టుకోనుంది. -
ఇంటి డెకరేషన్లో ఇవి పాటిస్తే... రాజసం ఉట్టిపడుతుంది
ఇల్లు రాజుల కోటలా తలపించాలన్నా.. మన సృజన కళగా కనిపించాలన్నా.. ఓల్డ్ స్టైల్ విండో ఫ్రేమ్స్‌ని ఫిక్స్ చేయాల్సిందే! గుజరాత్, రాజస్థాన్ కోట గోడలపై ఉండే కిటికీలను పోలిన ఈ ఫ్రేమ్స్, వాల్ హ్యాంగింగ్స్ ఇప్పుడు ఇంటి డెకార్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఫొటో ఫ్రేమ్ మోడల్ అందమైన ప్రకృతి దృశ్యాలు, ఇంట్లో వారి ఫొటోలు ఫ్రేమ్‌లో బంధించి గోడకు అలంకరించాలి. వాల్ విండో అయితే ఆ గదికి గంభీరమైన సొగసును ఇస్తుంది. వుడెన్ హ్యాంగింగ్ పాతకాలం నాటి విండో మోడల్స్‌లో కలపతో తయారైన హ్యాంగింగ్స్ కూడా లభిస్తున్నాయి. డిజైన్‌ను బట్టి ధరలు ఉంటున్నాయి. బ్రాస్ మెటీరియల్ వుడెన్ విండో ఫ్రేమ్స్ ప్రాచీన కళ ఉట్టిపడేలా చేస్తాయి. మందిరం స్టైల్లో.. పూజా మందిరం స్టైల్లో ఉండే విండ్ ఫ్రేమ్స్ కూడా గోడపైన కొలువుదీరుతున్నాయి. వీటిలో దేవతావిగ్రహాలు, లేదా దీపాలంకరణ.. ఆధ్యాత్మిక శోభను పెంచుతున్నాయి. కాగితాలతోనూ... వుడ్, ప్లాస్టిక్, ఐరన్ మెటీరియల్‌తోనే కాదు మందపాటి అట్ట ముక్కలతోనూ విండో వాల్ ఆర్ట్ పీసెస్‌ను తయారుచేయవచ్చు. క్రాఫ్ట్ తయారీలో ఇదీ భాగమైందిప్పుడు. -
Prachi Bhatia: జీవితాన్ని అలంకరించుకుంది
అరకొర ఆర్థిక పరిస్థితులు బాల్యాన్ని సర్దుకు పొమ్మన్నాయి. ఏమీ తెలియని పసిమనసు కూడా పరిస్థితులకు తలొంచక తప్పలేదు. తన వయసుతో పాటు కుటుంబ ఆర్థికభారం పెరిగిపోతుంటే చూడలేకపోయింది. డిగ్రీలోనే సంపాదనకు నడుం బిగించి, 28 ఏళ్లకే సక్సెస్‌పుల్ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది ప్రాచీ భాటియా. ఘజియాబాద్‌కు చెందిన ప్రాచీ భాటియా దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. తండ్రి జర్నలిస్టు, తల్లి గృహిణి. తండ్రికొచ్చే కొద్దిపాటి ఆదాయమే కుటుంబానికి ఆధారం. ఆ ఆదాయం ఏమూలకూ సరిపోయేది కాదు. ప్రాచీ స్కూలు ఫీజులు కట్టడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడూ స్కూల్లో అందరికంటే ఆలస్యంగా ఫీజు చెల్లించేవారు. ఇంతటి గడ్డు పరిస్థితుల్లో సైతం ఇంటర్మీడియట్ పూర్తిచేసిన ప్రాచీ ... తనకెంతో ఇష్టమైన డిజైనింగ్ డిగ్రీ చేయాలనుకుంది. అనుకున్నట్టుగానే ఢిల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్టీ) లో సీటు సంపాదించింది. కానీ అక్కడ హాస్టల్ ఫీజు, ఇతర ఖర్చులకు డబ్బులు లేక ఎన్ఐఎఫ్టీలో చేరలేదు. గురుగామ్‌లోని జీడీ గోయెంకా యూనివర్శిటీలో చేరింది. ► సంపాదిస్తూనే కాలేజీ టాపర్ అతి కష్టంమీద డిగ్రీలో చేరిన ప్రాచీ.. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క చిన్న వ్యాపారం ప్రారంభించింది. కుటుంబానికి ఆర్థి కంగా సాయపడేందుకు.. గిఫ్ట్స్ తయారు చేసి విక్రయించేది. ఫొటో ఆల్బమ్స్, ఫొటో ప్రింటెడ్ ల్యాంప్స్, హ్యాండ్‌మేడ్ కార్డ్స్, రోజెస్ వంటివి తయారు చేసి ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసేది. ఇలా విక్రయిస్తూ నెలకు ఐదువేల రూపాయల దాకా సంపాదించేది. వాటిలో కొంత ఇంట్లో ఇచ్చి మిగతావి దాచుకునేది. ఆర్ట్స్, క్రాఫ్ట్స్ మీద ఆసక్తి ఉండడంతో సర్టిఫికెట్ కోర్సులు చేసేది. మరోపక్క డిగ్రీ చదువుతూ వచ్చే స్కాలర్‌షిప్‌తో తన ఎడ్యుకేషన్ లోన్ కట్టేది. ఇవన్నీ చేస్తూ కూడా డిగ్రీలో కాలేజ్ టాపర్‌గా నిలిచింది ప్రాచీ. ► ఎంప్లాయీ నుంచి ఎంట్రప్రెన్యూర్‌గా డిగ్రీ పూర్తవగానే ప్రాచీ గురుగామ్‌లోని ఓ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో అసిస్టెంట్ డిజైనర్‌గా చేరింది. కొన్నాళ్లు పనిచేశాక.. మరో బహుళ జాతి కంపెనీలో డిజైనర్‌గా ఉద్యోగావకాశం వచ్చింది. అందులోచేరిన కొద్దిరోజులకే ‘‘ఒకరి కింద నేనెందుకు పనిచేయాలి? నేనే ఏదైనా కొత్తగా ప్రారంభించవచ్చు కదా!’’ అనుకుని వెంటనే ఉద్యోగం వదిలేసింది. అప్పటిదాకా చేసిన ఉద్యోగ అనుభవ పాఠాలతో 24 ఏళ్ల వయసులో సొంతంగా ‘చౌఖట్’ పేరిట హోండెకార్ బ్రాండ్‌ను స్థాపించింది. అప్పటివరకు దాచుకున్న లక్ష రూపాయలను పెట్టుబడిగా పెట్టి.. ఇంటి అలంకరణలో ఉపయోగించే∙ఉత్పత్తులను పేపర్ మీద డిజైన్ చేసి, మొరాదాబాద్, జైపూర్, నోయిడాలలోని కళాకారులతో రకరకాల కళాఖండాలను తయారు చేయించేది. తయారైన ఉత్పత్తులను ఫోటోషూట్ చేసి తన సొంత వెబ్సైట్లో పెట్టి విక్రయించడం మొదలు పెట్టింది. విక్రయాలు కాస్త మందకొడిగా ఉండడంతో.. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రకటనలు ఇచ్చింది. వీటిద్వారా చౌఖట్కు గుర్తింపు రావడంతో వ్యాపారం ఊపందుకుంది. దీంతో తన మార్కెటింగ్ బడ్జెట్ నెలకు యాభైవేలకు చేరింది. తొలిఏడాది మూడు లక్షలు, రెండో ఏడాది పదకొండు లక్షలు. దురదృష్టవశాత్తూ మూడో ఏడాది కరోనా కారణంగా ఆశించినంత ఆదాయం రాలేదు. దాంతో ప్రాచీ తన ఐడియాలతో వ్యాపారం పుంజుకునేలా చేయడంతో... గతేడాది (నాలుగో సంవత్సరం) ఒక్కసారిగా 35.5 లక్షలకు చేరింది. ఐదు వందల నుంచి ఇరవై వేల రూపాయల ధరల్లో ఉన్న 70 రకాల ఛౌఖట్ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఆర్డర్లు వస్తున్నాయి. తను డిజైన్ చేసిన వస్తువులను స్కూటీ మీద మోసుకెళ్లిన ప్రాచీ ఇటీవలే తన సొంత డబ్బులతో కారు కొనుక్కుంది. ► రాయి శిల్పంగా మారినట్టు.. ‘‘నేను నడిచిన దారిలో అనేక బెదిరింపులు, వయసు వివక్షలు వంటి అనేక ఇబ్బందులు, సమస్యలు, ఒత్తిళ్లు ఎదురయ్యేవి. అయితే ఉలి దెబ్బలకు రాయి శిల్పంగా మారినట్లు వీటన్నింటిని భరిస్తూనే ఈ స్థాయికి వచ్చాను. భవిష్యత్‌లో చౌఖట్ టర్నోవర్‌ను నాలుగు వందల కోట్లకు తీసుకెళ్లాలి. ఇంటి అలంకరణ వస్తువులు కావాలంటే కస్టమర్లు నా చౌఖట్ను ఎంచుకునే స్థాయికి ఎదుగుతాను’’ అని ప్రాచీ సగర్వంగా చెబుతోంది. -
నులక మంచం ట్రే, తోపుడి బండి ట్రే.. బడ్జెట్ ధరలోనే!
ఇంటి అలంకరణలో పాత ఒక వింత ఎలా అవుతుందో చూడాలంటే ఇంట్లో కాఫీ, టీ సర్వింగ్‌లో ఉపయోగించే ట్రే ను గమనిస్తే చాలు. కళాత్మకత ఇంటి గోడలు, పై కప్పు, ఫ్రేమ్స్, ప్లాంట్స్.. విషయంలోనే కాదు వాడుకునే వస్తువుల్లోనూ కనువిందు చేస్తోంది అనకుండా ఉండలేరు. కాదేదీ అలంకరణకు అనర్హం అనే పదం ఇప్పుడు మంచాలు, తోపుడుబండ్లు, ఆట వస్తువులకూ వచ్చేసింది. వీటిలో ప్రతీదాన్ని హోమ్ క్రియేషన్‌లో భాగం చేసుకోవచ్చు. నులక మంచం ట్రే పల్లెటూళ్లలో బామ్మల కాలం నాటి నవారు మంచాలు, నులక మంచాలు ఇప్పుడు నగరీకరణ విల్లాలలో సెంటర్ టేబుల్ మీద ఖుషీగా విందు చేసుకుంటున్నాయి. నాలుగు కప్పులు, ఆరు బిస్కెట్లు పట్టేటంత పరిమాణంలో బుజ్జి మంచాల ట్రేలు అబ్బురంగా కనిపిస్తున్నాయి. కళాభిలాషుల కోసం మార్కెట్లోకి వచ్చిన ఈ తరహా ట్రే లు ‘ఎంత బాగున్నాయో కదా!’ అనిపించేస్తున్నాయి. రూ. 700 నుంచి రూ.1,500 వరకు ఇవి లభిస్తున్నాయి. టేబుల్ పరిమాణం అంత నులక మంచాన్ని మూలల్లో అలంకరణగానూ వాడచ్చు. తోపుడి బండి ట్రే కూరగాయలు, పండ్లు లాంటివి తోపుడు బండ్ల మీద పెట్టుకొని అమ్ముతుంటారు బడుగు జీవులు. ఆ తోపుడు బండి మీద తినుబండారాలు పెట్టుకొని అతిథులకు కొత్తగా ఆహ్వానం పలుకుతున్నారు ఇంటి సభ్యులు. కలప, ఐరన్ జోడీతో తయారుచేసే ఈ తోపుడు బండి ట్రేలు క్రియేటివిటీ, క్వాలిటీని బట్టి రూ. 500 నుంచి వేలల్లో ధరలు పలుకుతున్నాయి. టేబుల్ ఎక్కిన టేబుల్ ఇది కొంచెం సింపుల్ అనిపించినా బెడ్ మీద కూర్చొని తినేవారికి టేబుల్ ట్రే మరింత సౌలభ్యంగా ఉంటుంది. కూచొని, పడుకుని ల్యాప్‌టాప్ వర్క్ చేసుకొనేవారికి ఇది అనువుగానూ ఉంటుంది. టేబుల్ మీద పెట్టినా అందుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. అందుకే టేబుల్ స్టైల్ ట్రే టేబుల్ ఎక్కి మరీ దర్జా పోతోంది. బెడ్ మీద హాయిగా వాలిపోతుంది. రూ.300 నుంచి నాణ్యతను బట్టి రూ.1000 ఆ పైన ధరలు ఉన్నాయి. ఆట వస్తువులూ ట్రే రూపంలో.. గాలిపటాల్లో వాడే థ్రెడ్ రోలర్, క్రికెట్ బ్యాట్, టేబుల్ టెన్నిస్ బ్యాట్ కూడా స్నాక్స్ అందించడానికి కొత్తగా ముస్తాబు అయ్యాయి. ఇంటి అతిథ్యంలోనూ తమదే పై చేయి అంటూ క్రియేటివ్‌గా టీపాయ్ మీదకు చేరాయి. ధరలు రూ.1000 నుంచి రూ.3,000 కు సెట్‌గా మార్కెట్లో లభిస్తున్నాయి. -
దిల్లీ... మా చల్లని తల్లీ!
తాలిబన్ల భయంతో ఆ దేశం నుంచి పారిపోవడానికి సాధారణ ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి. చాప కింద నీరులా విస్తరిస్తున్న తాలిబన్ల ప్రాబల్యాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే కొందరు మహిళలు పసిగట్టారు. వారికి భవిష్యత్ చిత్రపటం కనిపించింది. ఆ చిత్రంలో ఆయుధాలు, అణిచివేత తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించలేదు. అందుకే ప్రమాదాన్ని ఊహించి దిల్లీకి వచ్చేశారు. దిల్లీ వారి కన్నీళ్లను తుడిచి, వారికో దారి చూపిన తల్లి అయింది. 24 సంవత్సరాల మోష్గన్ మాతృభూమి అఫ్ఘాన్‌ను వదిలి వస్తున్నప్పుడు ఏంచేసి బతకాలో తెలియదు. బతకాలంటే అఫ్ఘాన్‌ను వదిలివెళ్లాలనేది మాత్రమే తెలుసు. దిల్లీకి వచ్చిన తరువాత నిస్సహాయంగా దిక్కులు చూడాల్సిన దీనస్థితి రాలేదు. దిల్లీ కేంద్రంగా పనిచేసే ‘సీలైవాలి’ అనే సామాజిక స్వచ్ఛంద సంస్థ మోష్గన్ను ఆదుకుంది. బతకడానికి ఒక దారి చూపింది. ‘సీలైవాలి’ కేంద్రంలో ఆటబొమ్మలు, గృహఅలంకరణ వస్తువులు తయారుచేస్తుంటుంది మోష్గన్. ‘పరిస్థితిని ముందే ఊహించి ఇక్కడ భద్రంగా ఉన్నందుకు సంతోషించాలో, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ప్రమాదం అంచున ఉన్నందుకు బాధపడాలో తెలియడం లేదు. ఈ దేశం మమ్మల్ని కన్నతల్లిలా ఆదుకొని ఆదరిస్తోంది’ అంటుంది మోష్గన్. 45 సంవత్సరాల రజియా, 23 సంవత్సరాల షబానా... మోష్గన్లా భవిష్యత్‌ను పసిగట్టి దిల్లీకి వచ్చినవారే. వీరు కూడా ‘సీలైవాలి’లో పనిచేస్తున్నారు. బొమ్మలు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ‘మనసులో భయం తప్ప, చేతిలో తెలిసిన విద్య అంటూ ప్రత్యేకంగా లేదు. అలాంటి నేను శిక్షణలో బొమ్మలు, ఇతర వస్తువుల తయారీ నేర్చుకున్నాను. నాకు పరాయి దేశంలో ఉన్నట్లుగా లేదు. మాతృభూమిలోనే ఉన్నట్లుగా ఉంది’ అంటుంది రజియా. ‘దిల్లీకి వచ్చే ముందు చాలామంది వారించారు. చావోబతుకో ఇక్కడే అన్నారు. ఎవరూ పరిచయం లేని, ఎప్పుడూ చూడని దేశంలో ఇబ్బందులు పడతావు అని హెచ్చరించారు. అయినా మొండిధైర్యంతో వచ్చాను. ఎలాంటి ఇబ్బందులు పడలేదు. విశాల ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. మరోవైపు అక్కడ మా వాళ్ల పరిస్థితి చూస్తే బాధగా ఉంది’ అంటుంది షబాన. మోష్గన్, రజియా, షబానా... ఇంకా చాలామంది ఆఫ్గాన్ మహిళలకు ‘దిల్లీ’ అనేది దేశరాజధాని కాదు వారి చల్లనితల్లి. -
వేస్ట్ & బెస్ట్
వేస్ట్ బాటిల్స్, విరిగిపోయిన వాటర్పైప్స్, పనికిరాని టైర్స్, చెడిపోయిన సీడీస్... ఇవన్నీ చేరేది డస్ట్‌బిన్‌కి. కానీ ఆ చెత్తను సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారు గచ్చిబౌలికి చెందిన నివేదిత. వాటితో గృహాలంకరణ వస్తువులు, ఇంటీరియర్ పీసెస్తోపాటు కూరగాయల సాగు చేస్తూ వ్యర్థాలకు కొత్త అర్థమిస్తున్నారు. టైంపాస్‌గా మొదలైన ఈ ఇంట్రెస్టింగ్ హాబీ కెరీర్‌గా మారిన వైనం గురించి నివేదిత చెబుతున్న ముచ్చట్లు ఆమె మాటల్లోనే... ..:: శిరీష చల్లపల్లి స్కూల్డేస్నుంచే నాకు పెయింటింగ్, గార్డెనింగ్ అంటే బాగా ఇష్టం. స్కూల్లో క్లీన్ అండ్‌గ్రీన్, మొక్కలునాటడం వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేదాన్ని. అది కాస్తా అనుకోకుండా పెద్దయ్యాక హాబీగా మారిపోయింది. ఆ హాబీకి క్రియేటివిటీ జోడిస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుందనుకున్నాను. వేస్ట్బాటిల్స్, డామేజ్ మగ్గులు, క్రాక్డ్ పాట్స్, ఆయిల్ టిన్నులు, స్కూల్ షూస్, పాత స్కూల్‌బ్యాగ్స్, ఎలక్ట్రిక్ బల్బ్‌లు... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సృష్టిలో పనికి రానివంటూ ఉండవేమో అనిపిస్తుంది. మొదట పనికిరాని వస్తువులను ఎమ్సీల్తో అతికించి అందమైన బొమ్మలుగా తీర్చిదిద్దేదాన్ని. డబ్బాలపైన ముగ్గులు, హిస్టారికల్ అండ్ క్లాసికల్ బొమ్మలు వేసి డెకరేట్ చేసేదాన్ని. ఇంటికి వచ్చినవాళ్లు వాటిని చూసి వావ్ అనేవారు. అది అస్సలు పనికిరాని వస్తువులతో తయారు చేశానన్న విషయాన్ని గుర్తించలేకపోయేవారు. ఆరోగ్యం... ఆదా... వారానికోసారి మార్కెట్‌కు వెళ్లి, రసాయనాలతో పండించే హైబ్రీడ్ కూరగాయలు కొని తెచ్చి ఫ్రిజ్‌లో నిల్వ చేసి తినడంకంటే నేచురల్‌గా పండించిన కూరగాయలు ఆరోగ్యానికి మేలు. ఖర్చూ తగ్గుతుంది. అందుకే టైర్లు, పాత షూస్, మగ్గుల్లో మట్టి పోసి మొక్కలు నాటి అన్ని రకాల పంటలను ఇంటిపట్టునే పండిస్తున్నాను. టమాట, మిరపకాయలు, వంకాయ, కొత్తిమీర, అన్ని రకాల ఆకు కూరలు, రంగురంగుల పూలు, పండ్లు ఇలా కొన్ని వందల చెట్లు ఉన్నాయి. టీ చేసిన తరువాత మిగిలే టీపౌడర్, గుడ్డు పెంకులు, ఆకు కూరలు, కూరగాయలు, పండ్ల తొక్కలు వంటివన్నీ కలిపి కంపోస్ట్ తయారు చేసి... ఎరువులా ఉపయోగిస్తున్నాను. ప్రతిరోజూ ఉదయాన్ని లేచి నా గార్డెన్ అంతా ఒక లుక్ వేస్తే కళ్లకు ఇంపు, మనసుకు ఆనందం. అంతేనా రోజంతా సంతోషంగా ఉంటుంది. హాబీ టు కెరీర్... ఇంటికి వచ్చి చూసిన చుట్టాలు, ఫ్రెండ్స్ మాకూ నేర్పించమనేవారు. అలా లేడీస్క్లబ్స్, ఫ్లాట్స్‌లో ఉండే ఫ్రెండ్స్‌కి నేర్పించడం మొదలుపెట్టాను. తరువాత కిటీ పార్టీస్‌కి విస్తరించాను. ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్స్‌కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను. టైంపాస్‌గా మొదలైన హాబీ ఇప్పుడు కెరీర్‌గా మారడం మానసిక ఉల్లాసాన్నిస్తోంది.