మోష్గన్
తాలిబన్ల భయంతో ఆ దేశం నుంచి పారిపోవడానికి సాధారణ ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి. చాప కింద నీరులా విస్తరిస్తున్న తాలిబన్ల ప్రాబల్యాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే కొందరు మహిళలు పసిగట్టారు. వారికి భవిష్యత్ చిత్రపటం కనిపించింది. ఆ చిత్రంలో ఆయుధాలు, అణిచివేత తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించలేదు. అందుకే ప్రమాదాన్ని ఊహించి దిల్లీకి వచ్చేశారు. దిల్లీ వారి కన్నీళ్లను తుడిచి, వారికో దారి చూపిన తల్లి అయింది.
24 సంవత్సరాల మోష్గన్ మాతృభూమి అఫ్ఘాన్‌ను వదిలి వస్తున్నప్పుడు ఏంచేసి బతకాలో తెలియదు. బతకాలంటే అఫ్ఘాన్‌ను వదిలివెళ్లాలనేది మాత్రమే తెలుసు. దిల్లీకి వచ్చిన తరువాత నిస్సహాయంగా దిక్కులు చూడాల్సిన దీనస్థితి రాలేదు.
దిల్లీ కేంద్రంగా పనిచేసే ‘సీలైవాలి’ అనే సామాజిక స్వచ్ఛంద సంస్థ మోష్గన్‌ను ఆదుకుంది. బతకడానికి ఒక దారి చూపింది. ‘సీలైవాలి’ కేంద్రంలో ఆటబొమ్మలు, గృహఅలంకరణ వస్తువులు తయారుచేస్తుంటుంది మోష్గన్.
‘పరిస్థితిని ముందే ఊహించి ఇక్కడ భద్రంగా ఉన్నందుకు సంతోషించాలో, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ప్రమాదం అంచున ఉన్నందుకు బాధపడాలో తెలియడం లేదు. ఈ దేశం మమ్మల్ని కన్నతల్లిలా ఆదుకొని ఆదరిస్తోంది’ అంటుంది మోష్గన్.
45 సంవత్సరాల రజియా, 23 సంవత్సరాల షబానా... మోష్గన్‌లా భవిష్యత్‌ను పసిగట్టి దిల్లీకి వచ్చినవారే. వీరు కూడా ‘సీలైవాలి’లో పనిచేస్తున్నారు. బొమ్మలు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారు.
‘మనసులో భయం తప్ప, చేతిలో తెలిసిన విద్య అంటూ ప్రత్యేకంగా లేదు. అలాంటి నేను శిక్షణలో బొమ్మలు, ఇతర వస్తువుల తయారీ నేర్చుకున్నాను. నాకు పరాయి దేశంలో ఉన్నట్లుగా లేదు. మాతృభూమిలోనే ఉన్నట్లుగా ఉంది’ అంటుంది రజియా.
‘దిల్లీకి వచ్చే ముందు చాలామంది వారించారు. చావోబతుకో ఇక్కడే అన్నారు. ఎవరూ పరిచయం లేని, ఎప్పుడూ చూడని దేశంలో ఇబ్బందులు పడతావు అని హెచ్చరించారు. అయినా మొండిధైర్యంతో వచ్చాను. ఎలాంటి ఇబ్బందులు పడలేదు. విశాల ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. మరోవైపు అక్కడ మా వాళ్ల పరిస్థితి చూస్తే బాధగా ఉంది’ అంటుంది షబాన.
మోష్గన్, రజియా, షబానా... ఇంకా చాలామంది ఆఫ్గాన్ మహిళలకు ‘దిల్లీ’ అనేది దేశరాజధాని కాదు వారి చల్లనితల్లి.
Comments
Please login to add a commentAdd a comment