వేస్ట్ & బెస్ట్
వేస్ట్ బాటిల్స్, విరిగిపోయిన వాటర్‌పైప్స్, పనికిరాని టైర్స్, చెడిపోయిన సీడీస్... ఇవన్నీ చేరేది డస్ట్‌బిన్‌కి. కానీ ఆ చెత్తను సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారు గచ్చిబౌలికి చెందిన నివేదిత. వాటితో గృహాలంకరణ వస్తువులు, ఇంటీరియర్ పీసెస్‌తోపాటు కూరగాయల సాగు చేస్తూ వ్యర్థాలకు కొత్త అర్థమిస్తున్నారు. టైంపాస్‌గా మొదలైన ఈ ఇంట్రెస్టింగ్ హాబీ కెరీర్‌గా మారిన వైనం గురించి నివేదిత చెబుతున్న ముచ్చట్లు ఆమె మాటల్లోనే... ..:: శిరీష చల్లపల్లి
స్కూల్‌డేస్‌నుంచే నాకు పెయింటింగ్, గార్డెనింగ్ అంటే బాగా ఇష్టం. స్కూల్లో క్లీన్ అండ్‌గ్రీన్, మొక్కలునాటడం వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేదాన్ని. అది కాస్తా అనుకోకుండా పెద్దయ్యాక హాబీగా మారిపోయింది. ఆ హాబీకి క్రియేటివిటీ జోడిస్తే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనుకున్నాను. వేస్ట్‌బాటిల్స్, డామేజ్ మగ్గులు, క్రాక్డ్ పాట్స్, ఆయిల్ టిన్నులు, స్కూల్ షూస్, పాత స్కూల్‌బ్యాగ్స్, ఎలక్ట్రిక్ బల్బ్‌లు... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సృష్టిలో పనికి రానివంటూ ఉండవేమో అనిపిస్తుంది. మొదట పనికిరాని వస్తువులను ఎమ్సీల్‌తో అతికించి అందమైన బొమ్మలుగా తీర్చిదిద్దేదాన్ని. డబ్బాలపైన ముగ్గులు, హిస్టారికల్ అండ్ క్లాసికల్ బొమ్మలు వేసి డెకరేట్ చేసేదాన్ని. ఇంటికి వచ్చినవాళ్లు వాటిని చూసి వావ్ అనేవారు. అది అస్సలు పనికిరాని వస్తువులతో తయారు చేశానన్న విషయాన్ని గుర్తించలేకపోయేవారు.
ఆరోగ్యం... ఆదా...
వారానికోసారి మార్కెట్‌కు వెళ్లి, రసాయనాలతో పండించే హైబ్రీడ్ కూరగాయలు కొని తెచ్చి ఫ్రిజ్‌లో నిల్వ చేసి తినడంకంటే నేచురల్‌గా పండించిన కూరగాయలు ఆరోగ్యానికి మేలు. ఖర్చూ తగ్గుతుంది. అందుకే టైర్లు, పాత షూస్, మగ్గుల్లో మట్టి పోసి మొక్కలు నాటి అన్ని రకాల పంటలను ఇంటిపట్టునే పండిస్తున్నాను. టమాట, మిరపకాయలు, వంకాయ, కొత్తిమీర, అన్ని రకాల ఆకు కూరలు, రంగురంగుల పూలు, పండ్లు ఇలా కొన్ని వందల చెట్లు ఉన్నాయి. టీ చేసిన తరువాత మిగిలే టీపౌడర్, గుడ్డు పెంకులు, ఆకు కూరలు, కూరగాయలు, పండ్ల తొక్కలు వంటివన్నీ కలిపి కంపోస్ట్ తయారు చేసి... ఎరువులా ఉపయోగిస్తున్నాను. ప్రతిరోజూ ఉదయాన్ని లేచి నా గార్డెన్ అంతా ఒక లుక్ వేస్తే కళ్లకు ఇంపు, మనసుకు ఆనందం. అంతేనా రోజంతా సంతోషంగా ఉంటుంది.
హాబీ టు కెరీర్...
ఇంటికి వచ్చి చూసిన చుట్టాలు, ఫ్రెండ్స్ మాకూ నేర్పించమనేవారు. అలా లేడీస్‌క్లబ్స్, ఫ్లాట్స్‌లో ఉండే ఫ్రెండ్స్‌కి నేర్పించడం మొదలుపెట్టాను. తరువాత కిటీ
పార్టీస్‌కి విస్తరించాను. ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్స్‌కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను. టైంపాస్‌గా మొదలైన హాబీ ఇప్పుడు కెరీర్‌గా మారడం మానసిక ఉల్లాసాన్నిస్తోంది.