
మహిళా విక్రేతల సంఖ్య పెంచుతాం
స్నాప్‌డీల్ ప్రకటన
న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్ తన ప్లాట్‌ఫామ్‌పై ఉత్పత్తులను విక్రయించే మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌ల సంఖ్యను పెంచుకోవటంపై కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది చివరికల్లా మొత్తం విక్రేతల సంఖ్యలో సగం మహిళలే ఉండేలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం మొత్తం వర్తకల సంఖ్య 60,000 అని, దీంట్లో మహిళల సంఖ్య 30 శాతంగా ఉందని స్నాప్‌డీల్ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీఈఓ కూడా అయిన కునాల్ బహల్ చెప్పారు. ఈ ఏడాది వీరి సంఖ్య పెంచుకోవడంపైననే ఎక్కువగా దృష్టి సారిస్తామన్నారు.
ఈ ఆన్‌లైన్ మాధ్యమం కారణంగా మహిళలు ఇంటి వద్దనుంచే పనిచేయవచ్చని, పనిగంటలు కూడా సౌకర్యవంతంగా ఉంటాయని వివరించారు. ఆభరణాలు, దుస్తులు, హోమ్ డెకరేషన్, ఫర్నీషింగ్ విభాగాల్లో మహిళా పారిశ్రామికవేత్తలున్నారని కునాల్ బహల్ ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం 500 విభిన్నమైన కేటగిరిల్లో 50 లక్షల ఉత్పత్తులను ఆఫర్ చేస్తున్నామని, 4 కోట్ల మంది వినియోగదారులకు చేరువయ్యామని పేర్కొన్నారు. మరో దేశీయ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, అంతర్జాతీయ దిగ్గజం అమెజాన్‌డాట్‌ఇన్‌కు స్నాప్‌డీల్ గట్టి పోటీనిస్తోంది.