ఈ కటకం ఉంటే.. స్మార్ట్‌ఫోన్లన్నీ సూక్ష్మదర్శినులే!
చొక్కా గుండీ అంత సైజులో ఉన్న ఈ మైక్రోఫోన్ లెన్స్(కటకం)ను యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పూర్వ విద్యార్థి థామస్ లార్సన్ గతేడాది తయారు చేశారు. దీనిని స్మార్ట్‌ఫోన్ల కెమెరా లెన్స్‌లపై ఉంచితే చాలు.. వస్తువులను 15 రెట్లు ఎక్కువ చేసి చూపుతుంది. అయితే ఏ స్మార్ట్‌ఫోన్‌ను, ట్యాబ్లెట్‌ను అయినా శక్తిమంతమైన సూక్ష్మదర్శినిగా మార్చేలా ఈ లెన్స్‌ను ఎన్నో రెట్లు శక్తిమంతంగా అభివృద్ధిపరుస్తున్నట్లు తాజాగా లార్సన్ వెల్లడించారు. సాధారణ మైక్రోస్కోపులు వస్తువులను 50-400 రెట్లు జూమ్ చేసి చూపుతుంటాయి.
వస్తువులను కనీసం 150 రెట్లు పెద్దగా చూపించేలా తాము ఈ లెన్స్‌ను అభివృద్ధిపరుస్తున్నామని, దీనితో వివిధ వ్యాధులను నిర్ధారించడంతోపాటు అనేక వస్తువులను పరిశీలించొచ్చని, విద్యార్థులకు తక్కువ ధరకే వినూత్న మైక్రోస్కోపు చేతికి అందుతుందని లార్సన్ అంటున్నారు. దీనిని వివిధ కెమెరాల లెన్స్‌పై ఎలాంటి పరికరాలు, జిగుర్ల అవసరం లేకుండానే నేరుగా అతికించొచ్చట. స్మార్ట్‌ఫోన్ల కెమెరాలకు అటాచ్ అయ్యి వాటిని మైక్రోస్కోపులుగా మార్చేసే ఇతర లెన్స్‌లు కూడా ఇప్పటికే అందుబాటులో ఉన్నా.. వాటి సైజు, ధరలు కూడా చాలా ఎక్కువ. వాటితో పోల్చితే చాలా చవకగా రూ.1,800లకే దొరికే ఈ కొత్త మైక్రోఫోన్ లెన్స్ రెండు, మూడు నెలల్లోనే మార్కెట్లోకి విడుదల కానుంది.