బాబు సమస్య ఏడీహెచ్డీ కావచ్చు!
హోమియో కౌన్సెలింగ్
మా బాబు వయసు ఎనిమిదేళ్లు. ఒక చోట కుదురుగా ఉండడు. ఏకాగ్రత తక్కువ. దాదాపు ప్రతిరోజూ స్కూల్ నుంచి ఎవరో ఒక టీచర్ మావాడి ప్రవర్తన గురించి కంప్లయింట్ చేస్తుంటారు. మా వాడి ప్రవర్తనకు కారణం ఏమిటి? హోమియోలో వాడి సమస్యకు ఏదైనా చికిత్స ఉందా? – పరంధామయ్య, నల్లగొండ
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్డీ) అనే సమస్య ఉందని అనిపిస్తోంది. ఈ సమస్య ఉన్న పిల్లలకు సాధారణంగా ఏమీ గుర్తుండదు. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బారిన పడుతుంటారు. కొంతమంది పిల్లల్లో వారు పెరుగుతున్న కొద్దీ సమస్య తగ్గుతుంది. ఏడీహెచ్డీ అనేది సాధారణంగా ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల్లో వస్తుంది. ఏడీహెచ్డీతో బాధపడే పిల్లలు సాధారణ పిల్లల్లా ఉండరు.
సమస్యకు కారణాలు: ∙జన్యుపరమైన కారణాలు ∙తల్లిదండ్రులు ఎవరిలో ఒకరికి ఈ సమస్య ఉండటం ∙తక్కువ బరువుతో ఉండే పిల్లల్లోనూ, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సమస్య రావచ్చు.
లక్షణాలు: ∙మతిమరపు, తలనొప్పి ∙ఆందోళన, వికారం, నిద్రలేమి, చిరాకు ∙మానసిక స్థితి చక్కగా లేకపోవడం ∙ఒక చోట స్థిమితంగా ఉండలేకపోవడం ∙ఇతరులను ఇబ్బంది పెట్టడం.
నిర్ధారణ: రక్తపరీక్షలు, సీటీ స్కాన్, ఎమ్మారై
చికిత్స: హోమియోలో ఏడీహెచ్డీ సమస్యకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి వ్యక్తమయ్యే తీరు, లక్షణాలను విశ్లేషించి మందులు ఇవ్వాలి. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ సమస్యకు హోమియోలో స్ట్రామోనియమ్, చైనా, అకోనైట్, బెల్లడోనా, మెడోరినమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి
హైదరాబాద్