ది గ్రేట్ రాబరీ
ఆ నేడు 16 నవంబర్, 1976
ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంక్ దోపిడీ చేసిన దొంగలకు వందేళ్ల శిక్షను విధించింది ఈ రోజే! ఏడుమంది ఉన్న దొంగల గ్యాంగ్ ఒకటి 1975లో లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికాకు కన్నం వేసి ఎనభైలక్షల పౌండ్స్‌ను బ్యాగ్‌లో సర్దుకుంది. ఈ ఏడుగురులో ఒకడు .. ఆ బ్యాంక్ ఆనుపానులన్నీ తెలిసిన స్టాట్ బక్‌లీ! బక్‌లీ అదే బ్యాంక్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. ఆ పనితో వచ్చే పదీపరక సరిపోక.. ఏకంగా బ్యాంక్ లాకర్స్ సీక్రెట్ కోడ్‌కే కీ తిప్పాలనే ప్లాన్ వేశాడు. అప్పటికే రాబరీలో అనుభవం ఉన్న తన స్నేహితులను కలిశాడు. బ్యాంక్‌ను బద్దలు కొట్టి బ్రహ్మాండంగా బయటపడ్డారు కూడా.
తర్వాతే చిక్కొచ్చింది పంచుకునే లెక్కల దగ్గర. బ్యాంక్‌కి సంబంధించిన ప్లస్, మైనస్ పాయింట్స్ అన్నీ చెప్పి రాబరీ ప్లాన్‌ను ఈజీ చేసింది తనే కాబట్టి తనకు వాటా ఎక్కువ కావాలని వాదించాడు. మిగిలిన వాళ్లు ససేమిరా అన్నారు. దాంతో తనకు ఒక పెన్నీ కూడా ఎక్కువరాని మనీ మిగిలిన వాళ్లకూ దక్కడానికి వీల్లేదని బక్‌లీ వెళ్లి ఎంచక్కా పోలీసులకు అప్రూవర్‌గా మారిపోయాడు. కొసమెరుపు ఏంటంటే ఏడుగురు దొంగల్లో ఎక్కువ శిక్ష పడింది బక్‌లీకే. ఈ బృందానికంతటికీ వందేళ్ల శిక్షతోపాటు యాభై లక్షల పౌండ్ల జరిమానానూ విధించాడు జడ్జి అలెన్‌కింగ్ హామిల్టన్.