బ్యాంకులో తలెత్తిన సాంకేతిక లోపం ఖాతాదారుల గుండె ఆగిపోయినంత పనిచేసింది. ఉన్నట్టుండి అకౌంట్లలో జీరో బ్యాలెన్స్ చూపించడంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. వేలాది మంది బ్యాంక్ ఆఫ్ అమెరికా ఖాతాదారులకు ఈ పరిస్థితి ఎదురైంది.
బ్యాంక్ ఆఫ్ అమెరికా సేవల్లో బుధవారం మధ్యాహ్నం పెద్దఎత్తున అంతరాయం ఏర్పడింది. కస్టమర్లు తమ ఆన్‌లైన్ ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ ఖాతాలో బ్యాలెన్స్ కనిపించడం లేదంటూ గగ్గోలు పెట్టారు. కొందరి అకౌంట్లలో జీరో బ్యాలెన్స్ కనిపించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.
సాంకేతిక అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్‌లో దీనికి సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్, డల్లాస్, ఫీనిక్స్, హ్యూస్టన్, చికాగో వంటి ప్రధాన నగరాల నుండి సమస్య గురించి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. "ఖాతాలు తాత్కాలికంగా అందుబాటులో లేవు" అని కొంతమందికి, బ్యాంకింగ్ యాప్‌లోకి లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ''కనెక్షన్ ఎర్రర్'' అని చాలా మందికి పాప్ అప్ మెసేజ్ చూపించింది.
బ్యాంక్ ఆఫ్ అమెరికా అంతరాయంతో ప్రభావితమైన కస్టమర్‌లు తమకు తలెత్తిన ఇబ్బందులను ‘ఎక్స్’ (ట్విటర్), రెడ్డిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేశారు. బ్యాంకు యాజమాన్యంపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది కస్టమర్లు సమస్య ఎదురైనట్లు సీఎన్‌ఎన్ వార్త సంస్థకు ఇచ్చిన వివరణలో బ్యాంక్ ఆఫ్ అమెరికా అంగీకరించింది. సమస్యను పరిష్కరిస్తున్నామని, ఖాతాదారులకు క్షమాపణలు చెబుతున్నామని బ్యాంక్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment