నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అంటే సేవింగ్స్ అకౌంట్ ఉంది. అందరూ తమ డబ్బును ఈ ఖాతాలోనే ఉంచుకుంటారు. లావాదేవీలు నిర్వహిస్తారు. కానీ ఇందులో ఉంచే డబ్బుపై సాధారణంగా పెద్దగా వడ్డీ రాదు. అయితే ఇలాంటి మామూలు సేవింగ్స్ అకౌంట్‌పైనా 7.25 శాతం వరకు వడ్డీని పొందవచ్చని మీకు తెలుసా? సేవింగ్స్ ఖాతాపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్న కొన్ని బ్యాంకుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవింగ్స్ ఖాతాలో రూ.10 కోట్ల లోపు ఉన్న బ్యాలెన్స్‌పై 2.70 శాతం వడ్డీ ఇస్తోంది. రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో డబ్బును ఉంచినట్లయితే, రూ. 50 లక్షల లోపు బ్యాలెన్స్‌పై 3 శాతం వడ్డీ లభిస్తుంది. రూ. 50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే 3.5 శాతం వడ్డీ ఇస్తారు.
ఐసీఐసీఐ బ్యాంక్
ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచే బ్యాలెన్స్ రూ. 50 లక్షల కంటే తక్కువగా ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది. అదే 50 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉంటే 3.5 శాతం వడ్డీ లభిస్తుంది.
ఇదీ చదవండి: కార్మికశాఖ కీలక నిర్ణయం.. పీఎఫ్‌పై మరింత ప్రయోజనం
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) పొదుపు ఖాతాలో రూ. 10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉంటే దానిపై 2.70 శాతం వడ్డీ ఇస్తారు. బ్యాలెన్స్ రూ.10 లక్షల నుంచి రూ.100 కోట్ల మధ్య ఉంటే 2.75 శాతం, రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్
ఐడీఎఫ్‌సీ బ్యాంక్ (IDFC FIRST Bank) సేవింగ్ అకౌంట్ డిపాజిట్లపై అన్ని బ్యాంక్‌ల కంటే అధికంగా వడ్డీ ఇస్తోంది. ఖాతాలో రూ. 5 లక్షల లోపు బ్యాలెన్స్‌పై 3 శాతం వడ్డీని అందిస్తోంది. అదే రూ. 5 లక్షల నుండి రూ. 100 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉంటే, మీరు దానిపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీని ఇస్తోంది. రూ. 100-200 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌పై 4.50 శాతం వడ్డీ ఇస్తోంది.
ఈ వడ్డీని ఎలా నిర్ణయిస్తారు?
సాధారణంగా పొదుపు ఖాతా వడ్డీ రేటును త్రైమాసికానికి ఒకసారి లెక్కించి జమ చేస్తారు. ఈ వడ్డీ రేటును రోజువారీ బ్యాలెన్స్ అంటే రోజంతా చేసిన డిపాజిట్లలో ఉపసంహరణలు పోగా మిగిలిన మొత్తం ఆధారంగా నిర్ణయిస్తారు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లతో పోల్చినప్పుడు పొదుపు ఖాతాకు ఎలాంటి మెచ్యూరిటీ వ్యవధి ఉండదు. ఎందుకంటే ఈ రకమైన ఖాతాను సాధారణ పొదుపు, లావాదేవీల కోసం ఉపయోగిస్తారు. పెనాల్టీలు లేదా రుసుము లేకుండా ఈ ఖాతాలో ఎప్పుడైనా నగదు డిపాజిట్ చేయవచ్చు. ఉపసంహరించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment