భారీ ఐపీఓ బాటలో వొడాఫోన్!
రూ.13,200-16,500 కోట్ల రేంజ్‌లో
హాంకాంగ్: భారత్‌లో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రావడానికి వొడాఫోన్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించడానికి సిటిగ్రూప్, గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్, యూబీఎస్ గ్రూప్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ వంటి దిగ్గజ సంస్థలను వొడాఫోన్ గ్రూప్ ఆహ్వానించిందని సమాచారం. ఐపీఓ వ్యవహారాలను చూడడానికి రెండు వారాల్లో ఆరు సంస్థలను ఎంపిక చేయనున్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఆరు సంస్థలను ఈ ఐపీఓ విలువ 200 కోట్ల డాలర్ల నుంచి 250 కోట్ల డాలర్ల(రూ.13,200 కోట్ల నుంచి రూ.16,500 కోట్లు) రేంజ్‌లో ఉంటుందని ఆ వర్గాల అంచనా. 2010లో ప్రభుత్వ రంగ కోల్ ఇండియా కంపెనీ ఐపీఓ ద్వారా 350 కోట్ల డాలర్లు సమీకరించింది. దాని తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ కానున్నది. విశ్లేషకుల అంచనా ప్రకారం వొడాఫోన్ ఇండియా విలువ 2,000 కోట్ల డాలర్లు(రూ.1,32,000 కోట్లు) ఉంటుందని అంచనా.