రేసు గుర్రాల్లా యూనికార్న్‌లు | Around 18 unicorns to hit street with 11-12 bilion doller In IPOs in 2 years | Sakshi
Sakshi News home page

రేసు గుర్రాల్లా యూనికార్న్‌లు

Published Fri, Sep 3 2021 2:01 AM | Last Updated on Fri, Sep 3 2021 2:01 AM

Around 18 unicorns to hit street with 11-12 bilion doller In IPOs in 2 years - Sakshi

ముంబై: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇటీవల స్టార్టప్‌లు దూకుడు చూపుతున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటూ పలు విభాగాలలో కంపెనీలు ఆవిర్భవిస్తున్నాయి. వెరసి దేశీయంగా స్టార్టప్‌ల హవా నెలకొంది. ఇప్పటికే బిలియన్‌ డాలర్ల (రూ. 7,300 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్‌లు 60కు చేరాయి. వీటిని యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశీ స్టాక్‌ మార్కెట్లు బుల్‌ ట్రెండ్‌లో సాగుతున్నాయి. దీంతో ప్రైమరీ మార్కెట్‌ ఎన్నడూలేని విధంగా కళకళలాడుతోంది. ఈ బాటలో స్టార్టప్‌ యూనికార్న్‌లు సైతం పబ్లిక్‌ ఇష్యూల బాటపడుతున్నాయి. రానున్న రెండేళ్లలో 18 పెద్ద స్టార్టప్‌లు ఐపీవోలకు రానున్నట్లు వాల్‌స్ట్రీట్‌ బ్రోకింగ్‌ దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా(బీవో ఎఫ్‌ఏ) ఒక నివేదికలో పేర్కొంది.

12 బిలియన్‌ డాలర్లు...
ఈ ఏడాదిలోనే దేశీయంగా 20 స్టార్టప్‌లు కొత్తగా యూనికార్న్‌ హోదాను అందుకున్నాయి. ఫలితంగా వీటి సంఖ్య 60ను తాకింది. స్టార్టప్‌లలో కొద్ది నెలలుగా భారీ స్థాయిలో పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరికల్లా వీటి సంఖ్య 100 మార్క్‌ను చేరవచ్చని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్లోబల్‌ దిగ్గజం క్రెడిట్‌ స్వీస్‌ సైతం ఈ మార్చిలో ఇదే తరహా అంచనాలు వెలువరించడం గమనార్హం!  రానున్న 24 నెలల్లో పబ్లిక్‌ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించేందుకు దిగ్గజాలు బైజూస్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్, ఓలా, ఓయో తదితరాలు ప్రణాళికలు వేశాయి. అంతేకాకుండా పాలసీబజార్, పెప్పర్‌ఫ్రై, ఇన్‌మోబి, గ్రోఫర్స్, మొబిక్విక్, నైకా, ఫ్రెష్‌వర్క్స్, పైన్‌ల్యాబ్స్, ఫార్మ్‌ఈజీ, డెలివరీ, డ్రూమ్, ట్రాక్సన్‌ సైతం ఇదే బాటలో నడవనున్నాయి. తద్వారా సుమారు 18 కంపెనీలు 12 బిలియన్‌ డాలర్లు(రూ. 88,000 కోట్లు) వరకూ సమీకరించే యోచనలో ఉన్నట్లు బీవోఎఫ్‌ఏ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ ఎండీ గౌరవ్‌ సింఘాల్‌ తెలియజేశారు.

భారీ ఇష్యూలు..
ఇప్పటికే సెబీ వద్ద పలు స్టార్టప్‌ దిగ్గజాలు ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. వీటిలో పేటీఎం(రూ. 16,600 కోట్లు), ఓలా(రూ. 11,000 కోట్లు), పాలసీబజార్‌ (రూ. 6,000 కోట్లు), నైకా(రూ. 4,000 కోట్లు), మొబిక్విక్‌(రూ. 1,900 కోట్లు) ఉన్నాయి. ఇటీవల రూ. 6,300 కోట్లు సమీకరించిన జొమాటో స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన విషయం విదితమే. దేశీయంగా యూనికార్న్‌లు ఐపీవోలు చేపట్టడం ద్వారా సంప్రదాయ కుటుంబ బిజినెస్‌ల ట్రెండ్‌లో మార్పులను తీసుకువచ్చే వీలున్నట్లు సింఘాల్‌ అభిప్రాయపడ్డారు. దేశీ స్టాక్‌ మార్కెట్ల క్యాపిటలైజేషన్‌(విలువ)లో ఇంటర్నెట్‌ ఆధారిత కంపెనీల వాటా 1 శాతానికంటే తక్కువేనని పేర్కొన్నారు. యూఎస్‌ మార్కెట్‌లో 40 శాతం మార్కెట్‌ వాటాను ఇవి ఆక్రమిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీ ఈక్విటీ మార్కెట్ల విలువ రూ. 250 లక్షల కోట్లను తాకిన సంగతి తెలిసిందే. రానున్న ఐదేళ్ల కాలంలో యూనికార్న్‌ల సంఖ్య రెట్టింపుకావచ్చని అంచనా వేశారు. ఈ ఏడాది యూనికార్న్‌ హోదాకు చేరిన కంపెనీలలో షేర్‌చాట్, గ్రో, గప్‌షుప్, మీషో, ఫార్మ్‌ఈజీ, బ్లాక్‌బక్, డ్రూమ్, ఆఫ్‌బిజినెస్, క్రెడ్, మోగ్లిక్స్, జెటా, మైండ్‌టికిల్, బ్రౌజర్‌స్టాక్, ఆప్‌గ్రేడ్‌ తదితరాలున్నాయి.

త్వరలో మరో 32...
ఫ్యూచర్‌ యూనికార్న్‌ జాబితాలో చేరగల మరో 32 కంపెనీలను హురున్‌ ఇండియా తాజాగా ప్రస్తావించింది. ఇవి ఇప్పటికే 50 కోట్ల డాలర్ల విలువను అందుకున్నట్లు తెలియజేసింది. ఈ బాటలో 20 కోట్ల డాలర్ల విలువను సాధించిన మరో 54 సంస్థలు సైతం జోరు మీదున్నట్లు పేర్కొంది. భవిష్యత్‌లో యూనికార్న్‌లుగా ఆవిర్భవించగల కంపెనీల విలువను 36 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేసింది. దేశీయంగా 60 కోట్లమంది ఇంటర్నెట్‌ యూజర్లున్నట్లు తెలియజేసింది. 2025కల్లా ఈ సంఖ్య 90 కోట్లను తాకనున్నట్లు వివరించింది. ప్రస్తుతం అత్యధిక యూనికార్న్‌లున్న దేశాల జాబితాలో అమెరికా(396), చైనా(277) తదుపరి మూడో ర్యాంకులో భారత్‌ నిలుస్తున్నట్లు పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement