రేటు కోత ద్వారానే రికవరీ: బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గింపు ద్వారానే తక్షణ భారత్ ఆర్థిక రికవరీ సాధ్యమవుతుందని గ్లోబల్ ఫైనాన్షియల్ దిగ్గజం- బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్‌ఏ-ఎంఎల్) తన తాజా నివేదికలో పేర్కొంది. వస్తువులు సేవల పన్ను (జీఎస్‌టీ), భూ సేకరణ సంస్కరణలు అమలయితే భారత్ ఆర్థికాభివృద్ధి జోరందుకుంటుందని ఇండియా మార్కెట్లు భావిస్తున్నాయని, అయితే వీటన్నింటికన్నా ముందు రెపో రేటు మరింత తగ్గింపు కీలకమని తాజా నివేదికలో విశ్లేషించింది.
ఆగస్టు 4వ తేదీ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ మరోదఫా పావుశాతం రేటు కోత నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని బీఓఎఫ్‌ఏ-ఎంఎల్ వెల్లడించింది. 2016 ప్రారంభంలో మరోదఫా పావుశాతం కోత ఉండవచ్చని కూడా అభిప్రాయపడింది.