వెనక్కురాని నోట్లు...రూ.50 వేల కోట్లే! | Bank of America statement on demonetization | Sakshi
Sakshi News home page

వెనక్కురాని నోట్లు...రూ.50 వేల కోట్లే!

Published Thu, Jan 5 2017 12:54 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

వెనక్కురాని నోట్లు...రూ.50 వేల కోట్లే! - Sakshi

వెనక్కురాని నోట్లు...రూ.50 వేల కోట్లే!

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అంచనా
ముంబై: పెద్ద నోట్ల రద్దుతో ఆ నోట్లన్నీ బ్యాంకుల నుంచి బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి చేరుతాయి. అలా చేరని మొత్తం విలువను మిగులుగా భావించడం జరుగుతుంది. సంబంధిత మొత్తం విలువను వినియోగం నిమిత్తం ప్రభుత్వానికి ఆర్‌బీఐ బదలాయిస్తుంది. డీమోనిటైజేషన్‌ ప్రారంభ కాలంలో ఇలా వచ్చే మొత్తం భారీగానే లక్షల కోట్లలో ఉంటుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే అంతా కలసి ఈ తరహా నిధులు దాదాపు రూ.50,000 కోట్లే ఉంటాయని తాజాగా అంతర్జాతీయ గ్లోబల్‌ ఆర్థిక సేవల దిగ్గజం– బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా– మెరిలించ్‌ (బీఓఎఫ్‌ఏ–ఎంఎల్‌) అంచనా వేస్తోంది. ఇది తమ తొలి అంచనాలు రూ.95,000 కోట్లకన్నా దాదాపు సగానికి సగం తక్కువని కూడా పేర్కొంది.

మరో లక్ష కోట్లు ఇలా...
ఇక ఆదాయ స్వచ్చంధ వెల్లడి పథకాలు, నల్ల కుబేరులపై దాడులు, వారిపై పన్నులు అంతా కలిసి 2017 బడ్జెట్‌కు రూ.500, రూ.1000 పాత నోట్ల రద్దు ముందు, తర్వాత పరిణామాల వల్ల కలిసి వచ్చేది మొత్తంగా మరో దాదాపు రూ.1,00,000 కోట్లని, దీనితోసహా డీమోనిటైజేషన్‌ వల్ల బడ్జెట్‌కు లాభించేది రూ.1,50,000 కోట్లుగా ఉంటుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొంది. తాము ఈ మొత్తాన్ని రూ.2,00,000 కోట్లని తొలుత అంచనా వేసినట్లు నేడు విడుదల చేసిన ఒక నోట్‌లో వివరించింది. మొత్తం రూ.15.55 లక్షల కోట్లలో రూ. 14 లక్షల కోట్లు డిసెంబర్‌ 19 నాటికే బ్యాంకింగ్‌కు చేరిపోయాయని తొలుత వచ్చిన వార్తల నేపథ్యంలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా తాజా నోట్‌ను విడుదల చేసింది.

‘‘ప్రత్యేక డివిడెండ్‌’’తో లాభమే!
బ్యాంకులకు తిరిగి చేరని పెద్ద నోట్ల మార్పిడికి సంబంధించి ‘చెల్లింపు బాధ్యతను’ఆర్‌బీఐ రద్దు చేసుకునే వీలును కల్పిస్తూ, కేంద్రం ఆర్డినెన్స్‌ను కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఆర్‌బీఐ ‘ప్రత్యేక డివిడెండ్‌’కేంద్రానికి బదలాయించడానికి వీలు కలుగుతుంది. ఈ ‘‘ప్రత్యేక డివిడెండ్‌’’ను సామాజిక పథకాలపై వెచ్చించడానికి కేంద్రానికి వీలు కలుగుతుందని కూడా బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా తన నోట్‌లో వివరించింది.

ద్రవ్యలోటు కట్టడి సాధ్యమే!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 3.5 శాతం ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయం– వ్యయం మధ్య వ్యత్యాసం. దీనిని ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తిలో కొంత శాతంగా ఉండాలని నిర్దేశిస్తారు) కట్టడి సాధ్యమేనని కూడా ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ వివరించింది. స్వచ్చంధ ఆదాయ వెల్లడి పథకం ద్వారా ఒనగూరే మొత్తం బ్యాంకింగ్‌కు తాజా మూలధన కల్పన, ఏడవ ఆర్థిక సంఘం చెల్లింపులకు సరిపోయే వీలుందని అంచనావేసింది.

నోట్ల రద్దుతో ఆర్థిక రంగం కుదేలు
ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన అమెరికా ఆర్థికవేత్త హంకే

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త స్టీవ్‌ హెచ్‌ హంకే పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ‘‘నగదుపై యుద్ధంతో భారత ఆర్థిక రంగం ఊహించినట్టుగానే కుచించుకుపోతుందన్నారు. నగదుపై పోరు మొదలు పెట్టడం ద్వారా ప్రధాని మోదీ అధికారికంగా భారత ఆర్థిక రంగాన్ని దిగువ వైపు నడిపించారు’’ అంటూ హంకే ట్వీట్‌ చేశారు. హంకే జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీలో అప్లైడ్‌ ఎకనమిస్ట్‌గా పనిచేస్తున్నారు. డీమోనిటైజేషన్‌ వల్ల తయారీ రంగం ఎక్కువగా దెబ్బతింటుందని... ఆర్థిక రంగంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని హంకే తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

డీమోనిటైజేషన్‌ ఫలితంగా 2017లో భారత్‌ వృద్ధి పరంగా టాప్‌ ప్లేస్‌ నుంచి దిగజారుతుందన్నారు. బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం ఆర్థిక రంగం క్షీణతను అడ్డుకుని, ఇన్వెస్ట్‌మెంట్లను పెంచేందుకేనని హంకే పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌ 8న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో డిసెంబర్‌లో తయారీ రంగం పనితీరు పడిపోయింది. తయారీ రంగ కార్యకలాపాలను ప్రతిబింబించే నికాయ్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్ఛెజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) నవంబర్‌లో 52.3గా ఉండగా, డిసెంబర్‌లో 49.6శాతానికి క్షీణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement