
వృద్ధిరేటును ఎక్కువ చూపించలేదు
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు
సాక్షి, అమరావతి: వృద్ధి రేటును ఎక్కువగా చూపించలేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. కావాలని ఎక్కువ చూపించామంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. యనమల మంగళవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక వృద్ధిలో ఎలాంటి వివాదాలు ఉండవని, ఒక మెథడాలజీ ప్రకారం దీని లెక్కింపు జరుగుతుందన్నారు.
2014–15లో 8.5 శాతం, 2015–16లో 10.95 శాతం, 2016–17 అడ్వాన్స్‌డ్ అంచనాల ప్రకారం 12.61 శాతం వృద్ధి రేటు సాధించామని తెలిపారు. పర్ క్యాపిటా ఇన్‌కం 2014–15లో రూ.93,699, 2015–16లో రూ.1,08,163, 2016–17 అడ్వాన్స్‌డ్ అంచనాల ప్రకారం రూ.1,22,376 ఉందని వెల్లడించారు. జీఎస్‌డీపీ 2014–15లో రూ.5,26,470 కోట్లు, 2015–16లో రూ.6,09,934 కోట్లు, 2016–17లో 6,99,307 కోట్లు ఉందన్నారు.