క్యూ4పై ఆర్థికవేత్తల అంచనా
మే 31న అధికారిక గణాంకాలు
న్యూఢిల్లీ: భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 6.1–6.7 శాతం పరిధిలో వృద్ధి చెందుతుందని పలువురు ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. నాల్గవ త్రైమాసికానికి (జనవరి–మార్చి 2024) అలాగే మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీపీ తొలి అధికారిక గణాంకాలు మే 31న ప్రభుత్వం విడుదల చేయనున్న నేపథ్యంలో తాజా అంచనాలు వెలువడుతున్నాయి. ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.6–7.8 శాతం శ్రేణిలో ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ 2023–24 జూన్ త్రైమాసికంలో 8.2 శాతం, సెపె్టంబర్ త్రైమాసికంలో 8.1 శాతం, డిసెంబర్ త్రైమాసికంలో 8.4 శాతం పురోగతి సాధించింది.
కీలక రంగాల పటిష్ట వృద్ధి
కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఉపాస్న భరద్వాజ్ ఎకానమీ పరిస్థితులపై మాట్లాడుతూ, కీలక రంగాలకు సంబంధించి హై ఫ్రీక్వెన్సీ డేటా విస్తృత ప్రాతిపదికన బలమైన వృద్ధిని సూచిస్తోందని తెలిపారు. అలాగే నాల్గవ త్రైమాసికంలో వాణిజ్యం, హోటళ్ల రంగం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ‘‘తయారీ రంగం కార్యకలాపాలు కూడా బాగున్నాయి. నిర్మాణ ఆధారిత, పెట్టుబడి విభాగాల నుంచి మెరుగైన ఫలితాలు రావాలి. అయితే వ్యవసాయ రంగం వృద్ధి వెనుకబడి ఉండవచ్చు. నాల్గవ త్రైమాసికంలో 6.1 శాతం జీడీపీ వృద్ధిని మేము ఆశిస్తున్నాము. పూర్తి సంవత్సరం సంఖ్య 7.6 శాతానికి దగ్గరగా ఉంటుందని అనుకుంటున్నాం’’ అని భరద్వాజ్ చెప్పారు. కాగా, క్యూ4లో 6.5 శాతం, ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం వృద్ధిని అంచనావేస్తున్నట్లు ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇక ఇండియా రేటింగ్స్ క్యూ4 అంచనా 6.2 శాతంగా ఉంది. దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా క్యూ4లో 6.7 శాతం, ఆర్థిక సంవత్సరం 7.8 శాతం వృద్ధి అంచనాలను వెలువరిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా ఆర్థిక సంవత్సరానికి 7 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment