
ఒడి దుడుకులు తప్పవు..!
న్యూఢిల్లీ: మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించే బలమైన అంశాలేవీ లేని నేపథ్యంలో ఈ వారం ప్రధాన ఇండెక్స్‌లు హెచ్చుతగ్గులను చవిచూస్తాయని స్టాక్ నిపుణులు అంచనా వేశారు. నవంబర్ నెల డెరివేటివ్ కాంట్రాక్ట్‌లు గురువారం(28న) ముగియనుండటంతో ఇన్వెస్టర్లు తమ పొజిషన్లలో మార్పులు చేపట్టే అవకాశమున్నదని, వెరసి మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతాయని పేర్కొన్నారు. ఇదికాకుండా శుక్రవారం(29న) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2013-14) రెండో క్వార్టర్‌కు జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. ఈ రెండూ మినహాయిస్తే ఇతర ప్రధాన అంశాలేవీ లేనందున, విదేశీ సంకేతాలు కూడా సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు విశ్లేషించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీల ఉపసంహరణ లేదా కొనసాగింపు సంకేతాలకు అనుగుణంగా మార్కెట్లు స్పందిస్తాయని తెలిపారు.
విదేశీ పెట్టుబడులు
ఇటీవల కొంతకాలంగా దేశీయ స్టాక్స్‌లో పెట్టుబడులను కొనసాగిస్తూ వచ్చిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) గత వారం చివర్లో ఉన్నట్టుండి వెనుకంజ వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు కూడా కీలకంగా నిలవనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికలపైనా ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని చెప్పారు. ఈ అన్ని అంశాలూ స్వల్పకాలిక ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని అభిప్రాయపడ్డారు.
29న క్యూ2 జీడీపీ వృద్ధి గణాంకాలు..
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) ప్రధాన సూచీ నిఫ్టీకి 5,970 పాయింట్ల స్థాయి కీలకంగా నిలవనుందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు నిధీ సరస్వత్ అంచనా వేశారు. ఈ స్థాయికంటే దిగువన అమ్మకాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. జూలై-సెప్టెంబర్(క్యూ2)లో దేశ ఆర్థిక వ్యవస్థ 4.5% స్థాయిలో వృద్ధి సాధిస్తుందని అంచనాలున్నాయి. ఇది తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో నమోదైన 4.4%తో పోలిస్తే కాస్త అధికమే. కాగా, ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలపై కొనసాగుతున్న అనిశ్చితి, ఎఫ్‌ఐఐల పెట్టుబడులు నెమ్మదించడం వంటి అంశాలతో గత వారం మార్కెట్లు నీరసించాయి. సెన్సెక్స్ దాదాపు 1% క్షీణించి 20,217 వద్ద, నిఫ్టీ 6,000 దిగువన 5,995 వద్ద స్థిరపడింది.
స్వల్ప దిద్దుబాటు
ఫెడరల్ రిజర్వ్‌కు కొత్త చైర్మన్‌గా ఎంపికైన జానట్ యెలెన్ సహాయక ప్యాకేజీలు మరికొంతకాలం కొనసాగుతాయంటూ వ్యాఖ్యానించిన కారణంగా గత వారం మొదట్లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పుంజుకున్న విషయం విదితమే. ఈ బాటలో లాభపడ్డ దేశీయ మార్కెట్లలో కొంతమేర దిద్దుబాటు జరిగిందని కొటక్ వెల్త్ మేనేజ్‌మెంట్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫ్యామిలీ ఆఫీస్ హెచ్ రాజేష్ అయ్యర్ పేర్కొన్నారు. ఇకపై మార్కెట్లను విదేశీ సంకేతాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికలు నడిపిస్తాయని తె లిపారు.
ఎఫ్‌ఐఐల ఇన్వెస్ట్‌మెంట్స్ రూ. 7,500 కోట్లు
ఈ నెలలో ఇప్పటివరకూ దేశీ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) సుమారు రూ. 7,525 కోట్లు(120 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. దీంతో ఈ ఏడాది జనవరి మొదలు ఇప్పటివరకూ ఎఫ్‌ఐఐల పెట్టుబడులు రూ. 96,460 కోట్లను(17.4 బిలియన్ డాలర్లు) తాకాయి. సానుకూల రుతుపవనాల కారణంగా ఆర్థిక వ్యవస్థ రిక వరీపై ఏర్పడ్డ విశ్వాసంతో ఎఫ్‌ఐఐలు పెట్టుబడులను కొనసాగిస్తున్నారని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. సెబీ విడుదల చేసిన తాజా గణాంకాలివి. అయితే అక్టోబర్ 3 తరువాత తొలిసారి గత వారం చివర్లో రూ. 40 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం.