న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాలు విసురుతోన్న కోవిడ్–19 (కరోనా) వైరస్.. చైనా నుంచి మొదలుకుని అమెరికా స్టాక్ మార్కెట్ వరకు అన్ని దేశాల ప్రధాన సూచీలను కుప్పకూల్చేసింది. ఈ వైరస్ పేరు వింటేనే ప్రపంచ వ్యాప్తంగా బుల్స్ వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే దేశీ స్టాక్ మార్కెట్ గతవారంలో భారీ నష్టాలను చవిచూసింది. గడిచిన వారంలో సెన్సెక్స్ 2,873 పాయింట్లు (6.9 శాతం), నిఫ్టీ 879 పాయింట్లు (7.2 శాతం) నష్టపోయాయి. శుక్రవారం ఒక్కరోజులోనే బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,448 పాయింట్లు పతనమై 38,297 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 432 పాయింట్లు నష్టపోయి 11,202 పాయింట్ల వద్దకు పడిపోయింది. సెన్సెక్స్ చరిత్రలోనే ఇది రెండో అత్యంత భారీ పతనంగా నమోదైంది. ఇంతటి పతనానికి కారణమైన కరోనా వైరస్ పరిణామాలే ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ వారంలో సూచీలు కోలుకునేనా..?
కరోనా వైరస్ గురించి ఎప్పుడు ఇంకేం వినాల్సి వస్తుందో అనే అంశంపైనే మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్‌లో కోవిడ్–19 కారణంగా ఓ వ్యక్తి మృతి చెందినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చైనాలోని వూహాన్‌లో ఉద్భవించిన ఈ వైరస్.. చివరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నగా ఉన్న అమెరికాకు సైతం సోకడం మరింత కలవర పెడుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా పరిశ్రమలు మూత పడి ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలోకి జారిపోవచ్చనే భయాలు మార్కెట్ వర్గాల్లో పెరిగిపోతున్నాయి.
ప్రభుత్వాలు ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడం పట్ల ఎంత మేర విజయం సాధిస్తాయనే అంశం ఆధారంగానే మార్కెట్ కోలుకోవడం అనే అంశం ముడిపడి ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ఇక డిసెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్టానికి తగ్గిపోయింది. శుక్రవారం వెల్లడైన గణాంకాల ప్రకారం.. జీడీపీ 4.7 శాతంగా నమోదైంది. ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. దేశ ఆర్థిక వృద్ధి రేటు కొంతమేర ఆశాజనకంగానే ఉన్నా మార్కెట్ నిలదొక్కుకునేదని ఎమ్కే వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ జోసెఫ్ థామస్ విశ్లేషించారు. అంతర్జాతీయ అంశాలు, కరోనా వైరస్ పరిణామాలే ఈ వారంలో దేశీ సూచీలను నడిపిస్తాయని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్‌మోడీ అన్నారు.
గణాంకాల ప్రభావం...
మార్కిట్ తయారీ పీఎంఐ సోమవారం వెల్లడికానుండగా.. సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు బుధవారం వెలువడనున్నాయి. అమెరికా మార్కిట్ తయారీ పీఎంఐ సోమవారం విడుదలకానుంది. మరోవైపు శుక్రవారం వెల్లడైన జీడీపీ డేటా ప్రభావం సోమవారం తొలి ట్రేడింగ్ సెషన్‌పై ప్రభావం చూపనుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఆదివారం వెల్లడైన ఆటో రంగ ఫిబ్రవరి నెల అమ్మకాలు కూడా నిరాశాజనకంగానే ఉన్నాయి. దేశీ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ విక్రయాలు గత నెలలో 1.6% పడిపోయాయి.
ఫిబ్రవరిలో రూ. 6,554 కోట్ల పెట్టుబడి...
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) గతనెల్లో రూ. 6,554 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. ఫిబ్రవరి 3–28 కాలంలో ఈక్విటీ మార్కెట్లో రూ. 1,820 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 4,734 కోట్లను వీరు కుమ్మరించారు. మార్కెట్ గతవారం భారీ నష్టాలను చవిచూసినప్పటికీ.. వీరి పెట్టుబడులు ఈ స్థాయిలో నమోదు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment