క్యూ2 జీడీపీ వృద్ధి 5.3 శాతం
⇒ వ్యవసాయం, తయారీ రంగాల పేలవ పనితీరు
⇒ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ రేటు 5.7 శాతం
⇒ 2013 ఇదే కాలంతో పోల్చితే (5.2 శాతం) కొంచెం బెటర్
⇒ రేట్ల కోత తప్పదని ఆర్‌బీఐపై ఒత్తిడి!
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2014-15, జూలై-సెప్టెంబర్) 5.3 శాతంగా నమోదయ్యింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పోల్చితే (5.7 శాతం) ఈ రేటు తగ్గింది. అయితే గడచిన ఆర్థిక సంవత్సరం క్యూ2 కన్నా (5.2 శాతం) స్వల్ప పురోగతి కనిపించింది. మొత్తం జీడీపీలో దాదాపు 28 శాతం వాటా కలిగిన వ్యవసాయం, తయారీ రంగాల పేలవ పనితీరు తాజా సమీక్షా కాలం క్యూ2పై ప్రభావితం చూపినట్లు శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి.
గడచిన రెండు ఆర్థిక సంవత్సరాలుగా జీడీపీ వృద్ధి రేటు ఐదుశాతం కన్నా దిగువన కొనసాగిన సంగతి తెలిసిందే. 2013-14 క్యూ2 కాలంలో వృద్ధి రేటుతో 2014-15 క్యూ2 కాలంలో వృద్ధి రేటును పరిశీలిస్తే...
⇒ వ్యవసాయం, అటవీ, మత్స్య పరిశ్రమ: వృద్ధి రేటు 5.0 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గింది. (విలువ రూ.1,50,822 కోట్ల నుంచి రూ.1,55,712 కోట్లకు)
⇒ గనులు, తవ్వకాలు: గడచిన ఆర్థిక సంవత్సరం క్యూ2లో అసలు వృద్ధి నమోదుకాలేదు. అయితే తాజా క్యూ2లో వృద్ధి 1.9 శాతం. (విలువ రూ.24,484 కోట్ల నుంచి రూ.24,944 కోట్లకు)
⇒ తయారీ: వృద్ధి రేటు 1.3 శాతం నుంచి 0.1 శాతానికి పడిపోయింది. (విలువ రూ. 2,10,211 కోట్ల నుంచి రూ.2,10,459 కోట్లకు)
విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా: వృద్ధి 7.8 శాతం నుంచి 8.7 శాతానికి పెరుగుదల (విలువ రూ. 27,369 కోట్ల నుంచి రూ. 29,758 కోట్లకు)
⇒ నిర్మాణం: వృద్ధి రేటు 4.4 శాతం నుంచి 4.6 శాతానికి పెరుగుదల (విలువ రూ.1,02,378 కోట్ల నుంచి రూ.1,07,121 కోట్లకు) వాణిజ్యం, హోటెల్స్, రవాణా, కమ్యూనికేషన్లు: వృద్ధి 3.6 శాతం నుంచి 3.8 శాతానికి అప్(విలువ 3,70,210 కోట్ల నుంచి రూ. 3,84,203 కోట్లకు)
⇒ ఫైనాన్సింగ్, రియల్టీ, బిజినెస్ సేవలు: వృద్ధి 12.1 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గుదల (విలువ 2,89,762 కోట్ల నుంచి రూ. 3,17,396 కోట్లకు).
⇒ కమ్యూనిటీ, సామాజిక, వ్యక్తిగత సేవలు: వృద్ధి 3.6 శాతం నుంచి 9.6 శాతానికి అప్ (విలువ 1,91,205 కోట్ల నుంచి రూ. 2,09,640 కోట్లకు)
⇒ పస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే- వృద్ధి రేటు 5.4-5.9% శ్రేణిలో నమోదవుతుందని భావిస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.
వడ్డీరేట్లు తగ్గించాలి: పరిశ్రమలు
క్యూ1తో పోల్చితే క్యూ2లో వృద్ధి తగ్గిన నేపథ్యంలో వృద్ధికి ఊతం ఇవ్వడానికి డిసెంబర్ 2వ తేదీ ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే కీలక పాలసీ రేటు-రెపోను తగ్గించాలని(ప్రస్తుతం 8%) పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి.