
బోలెడు లాభాలు..
వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడం పట్ల పరిశ్రమ వర్గాలు, పన్ను నిపుణులు హర్షం వ్యక్తం చేశారు.
♦ నల్లధనానికి కళ్లెం.. సమర్థ పన్నుల వ్యవస్థ
♦ జీడీపీ వృద్ధి పెరుగుతుంది
♦ 2017 ఏప్రిల్ నుంచి అమలు సవాలే
♦ పన్ను రేటు అధికంగా ఉండకూడదు
♦ పరిశ్రమ వర్గాల అభిప్రాయం
న్యూఢిల్లీ : వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడం పట్ల పరిశ్రమ వర్గాలు, పన్ను నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. జీడీపీపై సానుకూల ప్రభావం ఉంటుందని, ఆర్థిక రంగ వృద్ధికి ఎంతో తోడ్పడుతుందని, వస్తు, సేవల వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, నల్లధనానికి కళ్లెం వేస్తుందని అభిప్రాయపడ్డారు. సమర్థవంతమైన పన్నుల వ్యవస్థ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే, 2017 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడమన్నది సవాల్ అని అబిప్రాయపడ్డాయి. జీఎస్‌టీతో అంతర్జాతీయ మార్కెట్లో తయారీ పరంగా భారత్ మరింత పోటీపడగలుగుతుందని కేపీఎంజీ పరోక్ష పన్నుల హెడ్ సచిన్ మీనన్ చెప్పారు. 2017 ఏప్రిల్ నుంచి జీఎస్‌టీ అమలు కష్టమేగానీ, అసాధ్యం కాదని పీడబ్ల్యూసీ (ఇండియా) పార్ట్‌నర్ అనితా రస్తోగి అన్నారు. జూన్ లేదా జూలై నుంచి అయితే సులభంగానే అమలు చేయొచ్చన్నారు. పలువురి అభిప్రాయాలివీ...
ఉత్పాదకత పెరుగుతుంది
1991 తర్వాత అతి పెద్ద సంస్కరణ ఇదే. భారత్‌ను విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారుస్తుం ది. ప్రస్తుతం ఎన్నో ముక్కలుగా ఉన్న దేశీ మార్కెట్ ఒకటిగా అవతరిస్తుండడంతో తయారీ అనేది మరింత పోటీదాయకంగా మారుతుంది. జీడీపీతో తక్కువగా ఉన్న పన్ను నిష్పత్తి పెరుగుతుంది. ఉత్పాదకత, పారదర్శకతను పెంచుతుంది. అయితే, 18-22ు పన్నురేటు అన్నది చాలా ఎక్కువ. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. - అశోక్ హిందూజా, (హిందుజా గ్రూప్)
నిజమైన నల్లధన చట్టం... జీఎస్‌టీ
ప్రతీ లావాదేవీ సమాచారాన్ని జీఎస్‌టీ విభాగానికి తెలియజేయడం తప్పనిసరి. ఉత్పత్తి దగ్గర్నుంచి వినియోగమైన చోటు వరకు అన్ని లావాదేవీలనూ జీఎస్‌టీ విభాగం పరిశీలిస్తుంది. దీంతో గొలుసుకట్టు లావాదేవీల ముసుగులో నల్లధనం సమకూర్చుకునే అవకాశం ఉండదు. వాస్తవికంగా చూస్తే జీఎస్‌టీ నిజమైన నల్లధన చట్టం. - సచిన్ మీనన్, కేపీఎంజీ ఇండెరైక్ట్ ట్యాక్స్ హెడ్
మరిన్ని పెట్టుబడులతో జీడీపీ వృద్ధి
దేశ పన్నుల వ్యవస్థలో పెద్ద సంస్కరణ. వస్తు, సేవలపై ఉన్న ఎన్నో రకాల పన్నుల భారాన్ని తొలగిస్తుంది. కేంద్ర, రాష్ట్రాల పరిధిలో ఉన్న ఎన్నో రకాల పన్నులను ఏకం చేసి, దేశాన్ని ఏకైక మార్కెట్‌గా మారుస్తుంది. మరింత పారదర్శకతను, రానున్న సంవత్సరాల్లో దేశంలోకి మరిన్ని పెట్టుబడులను తీసుకొస్తుంది. - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్