జీడీపీ- రుణ వృద్ధి రేట్ల మధ్య బంధం బలహీనం!: ఆర్బీఐ
ముంబై: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కన్నా... బ్యాంకింగ్ రుణ వృద్ధి రేటు దాదాపు రెట్టింపు ఉండడం చరిత్రాత్మకంగా కీలక అంశం. అయితే ఈ పరస్పర సంబంధం క్రమంగా బలహీనపడుతూ వస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా పేర్కొన్నారు. ఆర్థిక మందగమనం, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)ల వంటి ప్రత్యామ్నాయ రుణ మంజూరు సంస్థల విస్తరణ వంటివి దీనికి కారణాలుగా పేర్కొన్నారు.
కంపెనీలు కమర్షియల్ పేపర్లు, బాండ్ల వంటి సాధనాల ద్వారా రుణ సమీకరణలకు మొగ్గుచూపడం కూడా ఇందుకు కారణంగా ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. గడచిన ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 7.6% ఉంటే, బ్యాంకింగ్ వృద్ధి రేటు గత కొద్ది నెలలుగా 8.5-9.5% శ్రేణిలో తిరుగుతున్న సంగతి తెలిసిందే.