దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఇక, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. వరుసగా మూడోసారి కూడా మోదీ సారథ్యంలోని బీజేపీయే పగ్గాలు చేపడుతుందని అంచనాలు వినిపిస్తున్న వేళ ఓట్ల లెక్కింపుతో అసలైన ఫలితాలు ఇవాళ రానున్నాయి. అయితే, ఎన్నికలు ముగింపు దశలో ఉండగానే జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) గత శుక్రవారం వెలువరించిన దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ఆసక్తికరమైన చర్చ రేపుతున్నాయి.
జీడీపీ వృద్ధి దాదాపు 7.8 శాతం ఉండవచ్చని తొలుత అందరూ భావించినా, వాస్తవంలో అది 8.2 శాతానికి చేరింది. అంతకు ముందు ఏడాది (2022–23) సాధించిన 7 శాతంతో పోలిస్తే ఇది గణనీయమైన మెరుగుదల. పైగా, వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థ 7 శాతం, అంతకు మించి పెరిగిందన్న మాట. దీంతో ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తోందని నిపుణుల మాట. ఇది విశేషమే... కాదనలేం. కానీ, ఈ ఏడాది కూడా ఇదే పురోగతిని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? అలాగే, దేశాన్ని వేధిస్తున్న నిరుద్యోగం తదితర సమస్యల మాటేమిటి?
నిజానికి, దేశ వాస్తవిక జీడీపీ ఇటు అధికారిక, అటు ప్రైవేట్ అంచనాలన్నిటినీ అధిగమించి ఆశ్చర్యపరిచింది. కోవిడ్ దెబ్బ కొట్టిన తర్వాత, అందులోనూ ప్రపంచమంతా నత్తనడక నడుస్తున్నప్పుడు వృద్ధిలో ఈ రకమైన గణాంకాలు వచ్చాయంటే, అనేక ఆటుపోట్లను భారతీయ గృహవ్యవస్థ, వ్యాపారాలు తట్టుకొని దృఢంగా నిలబడడమే కారణం. అలాగే, ప్రధానంగా నిర్మాణ, వస్తూత్పత్తి రంగాల పుణ్యమా అని కూడా గడచిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థికవ్యవస్థ అనుకున్న దాని కన్నా మెరుగైన వృద్ధిని సాధించినట్టు విశ్లేషణ.
ప్రైవేట్ పెట్టుబడులు వేగం పుంజుకోకున్నా, ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ పెట్టుబడులు ఆర్థిక వృద్ధిలో సింహభాగానికి కారణమని చెబుతున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. మొత్తం మీద వచ్చే సర్కారుకు ఈ అంకెలు, ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ బదలాయించిన మిగులు నిధుల లాంటివి కొంత సౌకర్యాన్నిచ్చే అంశాలు. అక్కడ నుంచి సమతూకం నిండిన ఆర్థికాభివృద్ధి వైపు ఎలా నడిపించాలన్నది కీలకమైన అంశం.
గమనిస్తే... ఆర్థిక వృద్ధిలో మెరుగుదల ఏడేళ్ళ పాటు నిదానంగా సాగింది. దానికి కొత్త ఊపునిచ్చేందుకు మోదీ సర్కార్ ఏటా రైల్వే, రోడ్లు, పట్టణ రవాణా, వాటర్‌వర్క్స్, రక్షణ ఉత్పత్తులపై ఏటా రూ. 11 లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు రావాలి. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం కొంత భిన్నంగా ఉన్నాయి. దేశంలో నిరుద్యోగ సమస్య ఇప్పటికీ ప్రబలంగా కనిపిస్తోంది. దానికి తోడు ఆర్థిక వ్యత్యాసం, ద్రవ్యోల్బణం సామాన్యుల్ని వేధిస్తున్నాయి. ఉదాహరణకు భవన నిర్మాణ రంగంలో నూటికి 80 మంది ఉండే నైపుణ్య రహిత కార్మికుల సగటు రోజు వారీ కూలీ సైతం అనేక రాష్ట్రాల్లో జాతీయ సగటు కూలీ కన్నా తక్కువే ఉందని విశ్లేషణలు తేల్చాయి.
మహిళా శ్రామికుల కూలీలైతే మరీ కనాకష్టం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే... మన దేశ తలసరి ఆదాయం, మరో మాటలో నికర జాతీయ ఆదాయం 2014–15లో రూ.72,805 ఉండేది. అది కేవలం 3.83 శాతం వార్షిక చక్రవృద్ధి రేటుతో 2022–23లో రూ.98,374కు చేరింది. వాస్తవిక ద్రవ్యోల్బణ ప్రభావాన్ని గనక పరిగణనలోకి తీసుకుంటే, ఈ వృద్ధి రేటు అసలైతే ఇంకా తక్కువే ఉంటుంది. అది అటుంచితే – విద్య, ఆరోగ్యం, ప్రజారవాణా, కాలుష్యం వగైరా అంశాల్లో సగటు జనాభా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. సరికదా ఇంకా దిగజారాయి. అదే విషాదం.
ఇంకా చెప్పాలంటే, ప్రపంచంలోని అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరణ అనే నినాదంలో గర్వించడానికి తగిన అంశాలు కొన్నే కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల తలసరి ఆదాయం జాబితాలో 2018లో మనం 153వ స్థానంలో ఉండేవాళ్ళం. అప్పటితో పోలిస్తే, మనం మెరుగుపడి 144వ స్థానానికి చేరాం. కానీ, ఇప్పటికీ మనం అడుగునే ఉన్నామని మర్చిపోలేం. సాధించిన కొద్దిపాటి మెరుగుదల దేశ ప్రజల్ని దారిద్య్రం నుంచి బయటపడేయడానికి చాలదు. నాణ్యమైన జీవన ప్రమాణాలకూ సరిపోదు. 2029 నాటికి గానీ మన దేశం తలసరి ఆదాయంలో ఉజ్బెకిస్తాన్, పాపువా న్యూ గినియా, అంగోలా లాంటి దేశాలను అధిగమించలేదని గుర్తించాలి. కాబట్టి, కొత్త ప్రభుత్వానికి తన ముందున్న సవాలేమిటో స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
భారత జనాభాలో ఇప్పటికీ అధిక శాతం గ్రామీణ, బస్తీ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. వారి కష్టనష్టాలు, జీవన పరిస్థితులు స్టాక్ మార్కెట్ల విజృంభణను చూసి చప్పట్లు కొట్టే వర్గాలకు పెద్దగా తెలియవు. తాజా ఎన్నికల దయతో నిరుద్యోగం, ఆర్థిక అసమతౌల్యం, ద్రవ్యోల్బణం లాంటివి మళ్ళీ కనీసం చర్చకైనా వచ్చాయి. ‘గ్రామీణ ప్రాంతాల్లోని దురవస్థల’ ప్రస్తావన జరిగింది. అందుకే, గడచిన నాలుగు త్రైమాసికాలను కలిపి తీసిన ఆఖరి లెక్కలు పైకి సంతోషం రేపుతున్నా, క్షేత్రస్థాయిలోని ఇలాంటి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోతే కష్టమే.
ఇప్పటి లెక్కలతో తృప్తిపడి, ఉదాసీనంగా వ్యవహరించకుండా సవాళ్ళను ఎదుర్కొంటూ ముందడుగు వేయాలి. అందుకోసం ఆర్థిక విధానాలను నిర్ణయించే ప్రభుత్వ యంత్రాంగం దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించాలి. ప్రజల నైపుణ్యాలను పెంచి, వారిని మరింత ఉద్యోగార్హులుగా తీర్చిదిద్దడంపై దృష్టిపెట్టాలి. అందుకు తగ్గ సంస్కరణలు చేపట్టాలి. అప్పుడే ఏటికేడు ఈ వృద్ధి అంకెలు స్థిరపడతాయి. సామాన్యుల జీవితాలు నిలబడతాయి. లేదంటే ‘వికసిత భారత్’ మాటల్లో, లెక్కల్లోనే మిగిలిపోతుంది.
సంబరాలు... సవాళ్ళు...
Published Tue, Jun 4 2024 5:09 AM | Last Updated on Tue, Jun 4 2024 5:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment