నిర్మలా సీతారామన్‌కు కత్తి మీద సామే! | Nirmala Sitharaman Confronted By Many Challenges | Sakshi
Sakshi News home page

నిర్మలా సీతారామన్‌కు కత్తి మీద సామే!

Published Tue, Jun 4 2019 3:49 PM | Last Updated on Tue, Jun 4 2019 3:52 PM

Nirmala Sitharaman Confronted By Many Challenges - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ సానుకూల పరిస్థితుల మధ్య 2014లో నరేంద్ర మోదీ మొదటిసారి ప్రధాని అయ్యారు. నాడు అంతర్జాతీయంగా వాణిజ్య పరిస్థితులు సవ్యంగా ఉండడంతోపాటు అంతర్జాతీయ చమురు ధరలు కూడా తక్కువగా ఉన్నాయి. అందుకని నాడు భారత్‌ ‘స్వీట్‌ స్పాట్‌’లో ఉందని భారత ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్‌ సుబ్రమణియన్‌ వ్యాఖ్యానించారు. అందుకనే దేశంలో పెద్ద నోట్ల రద్దుకు మోదీ సాహసించారు. దానివల్ల ఆశించిన ఫలితాలు రాకపోగా, రెండంకెలు దాటుతుందనుకున్న జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు కేవలం 5.8 శాతానికే పరిమితం అయింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కొత్తగా వస్తాయని ఆశిస్తే పెద్ద నోట్లను రద్దు చేసిన ఏడాదిలోగా దాదాపు కోటి ఉద్యోగాలు పోయాయి. ఆ మరుసటి సంవత్సరానికి నిరుద్యోగ సమస్య 6.1 శాతంతో 49 సంవత్సరాల గరిష్టానికి చేరుకుంది. పన్ను వసూళ్లలో ఐదేళ్లలో ఏనాడు బడ్జెట్‌ అంచనాలు భర్తీ కాలేదు.

ఇప్పుడు నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాన మంత్రి బాధ్యతలు స్వీకరించే నాటికి అటు అంతర్జాతీయ సానుకూల పరిస్థితులు మారిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైఖరి, వాణిజ్య ఆంక్షల కారణంగా అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వంలో మొదటి సారి ఆర్థిక మంత్రి బాధ్యతలు నిర్వహిస్తోన్న నిర్మలా సీతారామన్‌కు చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను సరిదిద్డడం కత్తిమీద సామే. దేశ జీడీపీ వృద్ధి రేటును రెండంకెల్లోకి తీసుకెళతామని అరుణ్‌ జైట్లీ తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే సవాల్‌ చేసి, నెరవేర్చలేకపోయారు. ఇప్పుడు రెండంకెల వృద్ధి రేటును సాధించడం సీతారామన్‌కు కూడా సుదూర స్వప్నమే.

దేశవ్యాప్తంగా జీఎస్టీని అమలు చేయడంలో ఇప్పటికీ ఎంతో గందరగోళం నెలకొని ఉంది. ముందు దాన్ని సరిదిద్దడంతోపాటు అంచనాల మేరకు జీఎస్టీని రాబట్టడం సీతారామన్‌ తక్షణ కర్తవ్యం. కొత్త ఉద్యోగాల కోసం కొత్త పరిశ్రమల కోసం, విదేశీ పెట్టుబడుల కోసం కృషి చేయడం అవసరం. పీఎం–కిసాన్‌ పథకం కింద రైతులకు ఏడాదికి ఆరువేల రూపాయల నగదు సాయం చేయడంతోపాటు వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనడం ఎంతైన అవసరం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement