న్యూఢిల్లీ: కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాలలో జీడీపీ నీరసించినప్పటికీ మూడో క్వార్టర్(అక్టోబర్- డిసెంబర్) నుంచి వృద్ధి బాట పట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. జీడీపీ వృద్ధిపై ఆర్‌బీఐ తాజాగా అంచనాకు వచ్చినట్లు తెలియజేశారు. ఇటీవల కనిపిస్తున్న డిమాండ్ తాత్కాలికమైనదికాదని..ఇకపైనా పటిష్టంగా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇందుకు నిదర్శనంగా వెల్తువెత్తిన జీఎస్‌టీ వసూళ్లు, గత నెలలో 12 శాతం పెరిగిన విద్యుత్ వినియోగం, రోజుకి 20 శాతం వృద్ధి చూపుతున్న రైల్వే సరుకు రవాణా, కొత్త రికార్డులను సాధిస్తున్న స్టాక్ మార్కెట్లు తదితరాలను ప్రస్తావించారు. విదేశీ మారక నిల్వలు సైతం రికార్డ్ స్థాయిలో 560 బిలియన్ డాలర్లను తాకినట్లు తెలియజేశారు. గత 11 రోజులుగా పటిష్ట రికవరీ కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఆర్థిక పురోగతికి దన్నునిచ్చేందుకు సహాయక ప్యాకేజీలో భాగంగా ఆత్మనిర్భర్-3ను ప్రకటించారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్థిక మంత్రి సీతారామన్ ఇంకా ఏమన్నారంటే..
హైలైట్స్
- ఎరువుల సబ్సిడీ కింద రైతులకు రూ. 65,000 కోట్ల కేటాయింపు.
- జాతీయ మౌలిక సదుపాయాల పెట్టుబడి నిధి(ఎన్‌ఐఐఎఫ్)కి రూ. 6,000 ఈక్విటీ పెట్టుబడులు. తద్వారా 2025కల్లా ఎన్‌ఐఐఎఫ్ రూ. 1.1 లక్షల కోట్లను సమీకరించగలుగుతుంది. తద్వారా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు నిధులను సమకూర్చగలుగుతుంది.
- గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి రూ. 10,000 కోట్ల అదనపు కేటాయింపులు.
- రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌కు బూస్ట్- డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు పన్ను సంబంధిత ఉపశమన చర్యలు- సెక్షన్ 43సీఏలో సవరణలు!
- ఆత్మనిర్భర్ తయారీ పథకంలో భాగంగా 10 చాంపియన్ రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను అందించనున్నారు.
- ఈ పథకం విలువ రూ. 1,45,980 కోట్లు.
- అడ్వాన్స్ సెల్ కెమిస్ట్రీ బ్యాటరీకు రూ. 18,100 కోట్లు
- ఎలక్ట్రానిక్, టెక్నాలజీ ప్రొడక్టులు రూ. 5,000 కోట్లు
- ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు రూ. 57,042 కోట్లు
- ఫార్మాస్యూటిక్స్, ఔషధాలు రూ. 15,000 కోట్లు
- టెలికం, నెట్‌వర్కింగ్ ప్రొడక్టులు రూ. 12,195 కోట్లు
- టెక్స్‌టైల్ ప్రొడక్టులు రూ. 10,683 కోట్లు
- అధిక సామర్థ్యంగల సోలార్ పీవీ మాడ్యూల్స్ రూ. 4,500 కోట్లు
- వైట్ గూడ్స్(ఏసీలు, లెడ్) రూ. 6,328 కోట్లు
- స్పెషాలిటీ స్టీల్ రూ. 6,322 కోట్లు
- స్వావలంబన పథకంలో భాగంగా 12 రకాల చర్యలను ప్రకటించారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పేరుతో పథకాన్ని ప్రకటించారు. కోవిడ్-19 కారణంగా మార్చి- సెప్టెంబర్ మధ్య కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి కొత్తగా ఉద్యోగ కల్పనకు చర్యలు. రూ. 15,000 కంటే తక్కువ వేతనాలు ఆర్జించేవారికి ఈ పథకం వర్తించనుంది. 2020 అక్టోబర్ 1 నుంచీ రెండేళ్లపాటు ఈ పథకం అమలులో ఉంటుంది.
- ఈఎల్‌సీజీ పథకంకింద రూ. 2.05 లక్షల కోట్లను కేటాయించాం. 61 లక్షల రుణగ్రహీతలకు రూ. 1.52 లక్షల కోట్ల రుణాలు విడుదలయ్యాయి.
- 21 రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలమేరకు రూ. 1681 కోట్లను పీఎం మత్స్యసంపద పథకానికి కేటాయించాం.
- పాక్షిక క్రెడిట్ గ్యారంటీ పథకంలో భాగంగా రూ. 26,889 కోట్ల పీఎస్‌యూ బ్యాంకుల పోర్ట్‌ఫోలియోలను కొనుగోలు చేసేందుకు అనుమతించాం.
- ప్రత్యేక లిక్విడిటీ పథకంలో భాగంగా ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీలకు రూ. 7,227 కోట్లు విడుదలయ్యాయి.
- 39.7 లక్షల మంది అసెసీలకు రూ. 1,32,800 కోట్లను ఆదాయపన్ను రిఫండ్స్‌గా చెల్లించాం.
Comments
Please login to add a commentAdd a comment