
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది(2023–24) 6.5 శాతం వృద్ధిని సాధించగలదని ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తాజాగా అంచనా వేశారు. ఈ దశాబ్దం అనిశ్చితికి నిదర్శనంగా నిలవనున్నదని వ్యాఖ్యానించారు. ఒకవేళ కార్పొరేట్ రంగం పెట్టుబడులను ఆలస్యంచేస్తే ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి సాకారంకావని అభిప్రాయపడ్డారు. ఆర్థిక శాఖ విషయానికివస్తే జీడీపీ వృద్ధి, ఆదాయ పురోగతి తదితరాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు.
సగటున 6.5 శాతం ఆర్థికాభివృద్ధిని ఆశిస్తున్న నేపథ్యంలో మరింత పురోగతి అందుకోవడం ద్వారా ఆశ్చర్యాలకు తెరతీసే అవకాశమున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో వివరించారు. కాగా.. గతేడాది(2022–23)లో దేశ ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం పుంజుకోగా.. మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 6.5 శాతం జీడీపీ వృద్ధిని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. ఈ బాటలో అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సైతం 6.3 శాతం వృద్ధిని మదింపు చేశాయి. అయితే ఈ ఏడాది క్యూ2లో జీడీపీ 7.6 శాతం బలపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నాగేశ్వరన్ అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment