
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వంలో రెండో సారి మంత్రి అయిన నితిన్ గడ్కరీ తన మంత్రిత్వ శాఖలైన జాతీయ రహదారులు, సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు సంబం ధించి బృహత్ ప్రణాళికలను ప్రకటించారు. రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఖాదీ, ఎంఎస్‌ఎంఈ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించడం ద్వారా స్థూల జాతీయోత్పత్తిని (జీడీపీ)ని పెంచుతామన్నారు. 22 హరిత ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంతోపాటు రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులు చేపట్టనున్నారు. అర్ధంతరంగా నిలిచిపోయిన రహదారి ప్రాజెక్టులను వచ్చే వంద రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గడ్కరీ వివరించారు. విద్యుత్ గ్రిడ్ తరహాలో రహదారుల గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
వచ్చే సమావేశాల్లో మోటారు వాహనాల బిల్లు
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మోటారు వాహనాల సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు మంత్రి గడ్కరీ చెప్పారు.2017లో లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉందని, అయితే గత ఫిబ్రవరిలో లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడటంతో బిల్లు మురిగిపోయిందని అన్నారు. కొత్త మంత్రి వర్గం ఆమోదం లభించిన వెంటనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment