
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన ఉద్దీపన ప్యాకేజీలో ప్రతిపాదనలకు కేంద్ర క్యాబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ. 20,000 కోట్ల రుణాలు అందించడం, ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) ద్వారా రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులపరమైన తోడ్పాటునివ్వడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. రూ. 20,000 కోట్ల స్కీమ్‌తో 2 లక్షల ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రతిపాదనల ప్రకారం రూ. 10,000 కోట్ల కార్పస్‌తో ఎఫ్‌వోఎఫ్ ఏర్పాటు చేస్తారు. అనుబంధంగా ఉండే చిన్న ఫండ్స్ ద్వారా ఇది ఎంఎస్‌ఎంఈలకు రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులపరమైన తోడ్పాటు అందిస్తుందని గడ్కరీ చెప్పారు. చిన్న సంస్థలు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యే అవకాశం దక్కించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని వివరించారు.
ఎంఎస్‌ఎంఈ నిర్వచనంలో సవరణలు ..
ఎంఎస్‌ఎంఈల నిర్వచనాన్ని కూడా కేంద్రం సవరించింది. మధ్య స్థాయి సంస్థల టర్నోవర్ పరిమితిని గతంలో ప్రకటించిన రూ. 100 కోట్ల స్థాయి నుంచి రూ. 250 కోట్లకు పెంచింది. వీధి వ్యాపారులకు రూ. 10,000 దాకా నిర్వహణ మూలధనం ఇచ్చేందుకు ఉద్దేశించిన ’పీఎం స్వనిధి’ స్కీముకు కూడా క్యాబినెట్ ఓకే చెప్పింది. ఇది 50 లక్షల మంది చిల్లర వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. ఏడాది వ్యవధి లో నెలవారీ వాయిదాల్లో ఈ రుణమొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో చెల్లింపులు జరిపేవారికి 7% వడ్డీ సబ్సిడీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమవుతుంది. ముందస్తుగా చెల్లించినా పెనాల్టీలు ఉండవు.
చాంపియన్స్ ప్లాట్‌ఫాం ఆవిష్కరణ..
సంక్షోభంలో ఉన్న ఎంఎస్‌ఎంఈలు సమస్యలను అధిగమించి, జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పాటునిచ్చేలా champions.gov.in పేరిట టెక్నాలజీ పోర్టల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆర్థికాంశాలు, ముడివస్తువులు, కార్మికులు, నియంత్రణ సంస్థల అనుమతులు తదితర సమస్యల పరిష్కార వ్యవస్థగా ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. అలాగే కొత్త వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తోడ్పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment