న్యూఢిల్లీ: భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, డీమోనిటైజేషన్ (నోట్ల రద్దు) తాలూకు ప్రభావం ఆర్థిక రంగంపై లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభకు చెప్పారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎదురైన ప్రశ్నలకు ఆమె స్పందించారు. తయారీ రంగంలో కొంత క్షీణత ఉందని, అయితే, ఇది నోట్ల రద్దు వల్ల కాదన్నారు. ప్రభుత్వ ఎజెండాలో ఆర్థిక వృద్ధి ఎంతో ప్రాధాన్య అంశంగా ఉందని చెప్పారు.
జీడీపీ వృద్ధి పెంపు కోసం ఎన్నో రంగాల్లో సంస్కరణలను చేపట్టడం జరుగుతోందన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మోస్తరుగా ఉండడానికి వ్యవసాయం, అనుబంధ రంగాలు, వాణిజ్యం, హోటల్, రవాణా, స్టోరేజ్, కమ్యూనికేషన్, ప్రసార సేవల రంగాల్లో వృద్ధి తక్కువగా ఉండడమేనని చెప్పారు. ‘‘ముఖ్యంగా కొన్ని రంగాల్లో తక్కువ వృద్ధి ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, నైపుణ్య సేవల్లో ఈ పరిస్థితి నెలకొంది’’ అని మంత్రి వివరించారు.
గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు పడిపోయిందని, పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలను కూడా అమల్లో పెట్టినట్టు చెప్పారు. ఈ విషయంలో సభ్యుని ఆందోళనను అర్థం చేసుకోగలనన్నారు. అయినా కానీ, ఇప్పటికీ భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉన్నట్టు చెప్పారు. అమెరికా వృద్ధి రేటు 2016–2019 మధ్య 1.6 శాతం నుంచి 2.3 శాతం మధ్య ఉంటే, చైనా వృద్ధి 6.7 శాతం నుంచి 6.3 శాతానికి పడిపోయిందని, కానీ, దేశ వృద్ధి రేటు 7 శాతానికి పైనే ఉన్నట్టు చెప్పారు.
రైతులందరికీ ఆదాయం...
కిసాన్ సమ్మాన్ యోజన, పెన్షన్ యోజన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మోదీ సర్కారు రెండో విడత పాలనలో చేపట్టిన కీలక సంస్కరణ... పీఎం కిసాన్ యోజన కింద రైతులందరికీ రూ.6,000 చొప్పున ఆదాయం అందించనున్నట్టు చెప్పారు. గతంలో ఇది రెండు హెక్టార్ల రైతులకే పరిమితం చేశారు. దీనికి తోడు చిన్న, సన్నకారు రైతులు, చిన్న వర్తకులకు స్వచ్ఛంద పెన్షన్ పథకాన్ని కూడా తీసుకొచ్చినట్టు మంత్రి చెప్పారు. వృద్ధి విషయమై మరింత దృష్టి పెట్టేందుకు ప్రధాని అద్యక్షతన ఐదుగురు సభ్యులతో పెట్టుబడులు, వృద్ధిపై కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జీఎస్టీ, ఎఫ్‌డీఐ నిబంధనలు సరళతరం సహా పూర్వపు ఐదేళ్ల కాలంలో చేపట్టిన సంస్కరణలను కూడా మంత్రి గుర్తు చేశారు.
నోట్ల రద్దుతో సానుకూల ఫలితాలు
రూ.500, రూ.1,000 నోట్ల డీమోనిటైజేషన్ వల్ల సానుకూల ఫలితాలు ఉన్నట్టు మంత్రి చెప్పారు. అక్రమ ధనం ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున నిధుల సాయంగా వెళ్లేదని, నోట్ల రద్దు తర్వాత ఉగ్రవాదుల వద్ద ఉన్న డబ్బంతా పనికిరాకుండా పోయిందన్నారు. అలాగే, డిజిటల్ లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున పెరిగాయన్నారు.
బ్యాంకు మోసాలు తగ్గాయి
బ్యాంకుల్లో రూ.లక్ష., అంతకుమించిన మోసాలు 2018–19లో 6,735 తగ్గినట్టు మంత్రి చెప్పారు. ఈ మోసాల వల్ల పడిన ప్రభావం రూ.2,836 కోట్లుగా ఉంటుందన్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2017–18లో 9,866 మోసం కేసులు (రూ.4,228 కోట్లు) నమోదైనట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment