న్యూఢిల్లీ: బడ్జెట్‌లో (2022–23 ఆర్థిక సంవత్సరం) మూలధన పెట్టుబడుల పెంపు ప్రణాళికలు దేశ తయారీ రంగాన్ని ఉత్తేజం చేస్తాయని, పెట్టుబడులు పెరుగుతాయని, పన్ను రాబడులు పుంజుకుంటాయని ఆర్థికశాఖ ప్రకటించింది. ఆయా అంశాలు ఎకానమీని ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా నడుపుతాయన్న భరోసాను వ్యక్తం చేసింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో 2022–23 ఆర్థిక సంవత్సరానికి క్యాపెక్స్ (మూలధన వ్యయ ం)ను 35.4% పెంచారు. దీనితో ఈ విలువ రూ. 7.5 లక్షల కోట్లకు పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో క్యాపెక్స్ రూ. 5.5 లక్షల కోట్లు. తాజా ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ అంచనాలపై ఆర్థిక శాఖ ఆవిష్కరించిన అవుట్‌లుక్‌లో ముఖ్యాంశాలు...
► గత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయాలు రికార్డు స్థాయిలో 34% పెరిగి రూ. 27.07 లక్ష ల కోట్లకు చేరుకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మహమ్మారి సవాళ్లను ఎదుర్కొని వేగవంతమైన పురోగతి సాధిస్తోందనడానికి ఇది గొప్ప సాక్ష్యం.
► భారత్‌ను ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నిబద్ధత కోసం పలు చర్యలు తీసుకుంటోంది. ఆయా అంశాలు దేశాన్ని పటిష్ట ఆర్థిక పురోగతి బాటన నిలుపుతున్నాయి.
► ఎకానమీ పటిష్ట బాటన నడుస్తోందని ఇటీవల భారీగా పెరిగిన పన్ను ఆదాయాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధన సాధ్యమేనని ఈ గణాంకాలు భరోసా ఇస్తున్నాయి. 2020–21లో స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.6.5 లక్షల కోట్లయితే, ఇది 2021–22లో రూ.8.6 లక్షల కోట్లకు పెరిగింది. గడచిన ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో 49 శాతం పెరిగి రూ.14.10 లక్షల కోట్లకు చేరాయి. పరోక్ష పన్నుల వసూళ్లు 20 శాతం పెరిగి 12.90 లక్షల కోట్లకు ఎగశాయి.
► పన్ను వసూళ్ల బేస్ పెంపు, తక్కువ వడ్డీరేట్లు, మినహాయింపులు లేని కొత్త సరళీకృత పన్ను విధానం, కార్పొరేట్ రంగానికి వ్యాపారాన్ని సులభతరం చేయడం, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడం, పన్ను ఎగవేతలకు చర్యలు వంటి పలు సంస్కరణాత్మక చర్యలు పన్నుల రాబడిని పెంచడానికి, తద్వారా ఎకానమీ పురోగతికి దోహదపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment