‘తయారీ’ బూస్ట్‌ 2 లక్షల కోట్లు | Government approves Rs 2 lakh crore PLI scheme for 10 sectors | Sakshi
Sakshi News home page

‘తయారీ’ బూస్ట్‌ 2 లక్షల కోట్లు

Published Thu, Nov 12 2020 5:15 AM | Last Updated on Thu, Nov 12 2020 7:49 AM

Government approves Rs 2 lakh crore PLI scheme for 10 sectors - Sakshi

న్యూఢిల్లీ: తయారీ రంగంలో భారత్‌ స్వావలంబన సాధించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మరో పథకానికి తెరతీసింది. దేశంలో టెలికం, ఆటోమొబైల్, ఫార్మాసూటికల్స్‌ వంటి మరో 10 కీలక తయారీ పరిశ్రమలకు మరింత చేయూతనిచ్చేందుకు ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని అమలు చేయనుంది.

ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ స్కీమ్‌ అమలుకు ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం ఐదేళ్ల వ్యవధిలో మొత్తం రూ. 2 లక్షల కోట్ల మేర రాయితీలు ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలకు లభించనున్నాయి. కాగా, సామాజిక మౌలికసదుపాయాల కల్పన రంగాలకు కూడా వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) స్కీమ్‌ను విస్తరించేందుకు కేబినెట్‌ ఓకే చెప్పింది. ప్రస్తుతం ఆర్థిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులకు మాత్రమే ఈ స్కీమ్‌ అమలవుతోంది.

దేశీ తయారీకి దన్ను...
ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పుంజుకునేలా చేయడం, అలాగే దిగుమతులను తగ్గించి తద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించాలనేది ప్రభుత్వ సంకల్పం. ఈ దిశగా దేశీ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ స్కీమ్‌ తోడ్పాటును అందించనుంది. ఈ కొత్త పథకం కింద రూ.1,45,980 కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని ప్రభుత్వం కేటాయించనుంది. కాగా, ఇప్పటికే రూ.51,311 కోట్ల వ్యయానికి కేంద్రం ఆమోదం తెలిపిందని అధికారిక ప్రకటన వెల్లడించింది.

‘భారతీయ తయారీ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మరింత పోటీపడేలా చేయడమే లక్ష్యంగా ఈ ఐదేళ్ల పీఎల్‌ఐ స్కీమ్‌ను రూపొందించాం. దీనికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది’ అని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాలు ఈ స్కీమ్‌ను అమలు చేస్తాయి. విడివిడిగా ఆయా రంగాలకు సంబంధించిన తుది ప్రతిపాదనలను వ్యయ ఆర్థిక కమిటీ (ఈఎఫ్‌సీ) మదింపు చేసిన తర్వాత, కేబినెట్‌ ఆమోదిస్తుంది.

షిప్పింగ్‌ శాఖ పేరు మార్పు...
కేంద్ర షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ పేరును పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్‌ మంత్రిత్వ శాఖగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ ప్రతిపాదనను ప్రధాన మంత్రి మోదీ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ దిశగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

‘స్వావలంబన భారత్‌’ సాకారం: నిర్మలా సీతారామన్‌
పీఎల్‌ఐ స్కీమ్‌కు ఆమోదం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ, తయారీ రంగానికి ఇది అద్భుతమైన ప్రోత్సాహకాలను అందిస్తుందని చెప్పారు. తద్వారా ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ (స్వావలంబన భారత్‌) లక్ష్యం సాకారం దిశగా దేశాన్ని నడిపించడంలో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ‘రెండు స్కీమ్‌లకు సంబంధించి కేబినెట్‌ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఇది కచ్చితంగా సరైన దన్నును అందిస్తుంది.

ఎందుకంటే మేము స్వావలంబన కోసం ప్రయత్నిస్తున్నాం. ప్రపంచ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో భారత్‌ను భాగంగా చేసేందుకు ఇవి దోహదం చేస్తాయి’ అని సీతారామన్‌ వివరించారు. దీనిద్వారా ఉద్యోగాలను సృష్టించడంతో పాటు ప్రపంచ సరఫరా వ్యవస్థకు భారత్‌ను అనుసంధానం చేస్తుందని చెప్పారు. భారత్‌ను ప్రపంచ తయారీ గమ్యస్థానంగా మార్చేందుకు ఈ ప్రోత్సాహకాలు తోడ్పడతాయని పేర్కొన్నారు.

 సమయానుకూల నిర్ణయం: కార్పొరేట్‌ ఇండియా
పీఎల్‌ఐ స్కీమ్‌ను మరో 10 కీలక రంగాలకు వర్తింపజేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల భారత పారిశ్రామిక దిగ్గజాలు, నిపుణులు ప్రశంసలు కురిపింటటచారు. ఎవరేమన్నారంటే...

కొత్త పీఎల్‌ఐ పాలసీ సమయానుకూలమైనది అలాగే తయారీ రంగంలో సమూల మార్పులను తీసుకొస్తుంది. తద్వారా ప్రపంచ తయారీ రంగ కేంద్రంగా భారత్‌ ఎదిగేందుకు దోహదం చేస్తుంది.
– ఉదయ్‌ కోటక్, సీఐఐ ప్రెసిడెంట్‌

తయారీ రంగంలో భారత్‌ స్వావలంబన సాధించేందుకు ఉద్దేశించిన ఈ ఫ్లాగ్‌షిప్‌ పథకానికి సుమారు రూ.2 లక్షల కోట్లను వెచ్చించనున్నారు. ఆర్థిక కార్యకలాపాలపై ఇది భారీ ప్రభావాన్నే చూపుతుంది. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, తదితర విభిన్న రంగాల వ్యాప్తంగా గణనీయంగా ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుంది.
– దీపక్‌ సూద్, అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌

పీఎల్‌ఐ స్కీమ్‌ పరిధిలోకి మరిన్ని రంగాలను తీసుకురావడం వల్ల తయారీ రంగానికి భారీ బూస్ట్‌ లభించనుంది. ఈ చర్యలు వ్యూహాత్మకం అలాగే సాంకేతికతతో ముడిపడినవి, దీనివల్ల దేశంలో ఉద్యోగాల కల్పన కూడా జోరందుకుంటుంది. దేశీ మార్కెట్‌ కోణంలోనే కాకుండా ఆయా రంగాలకు చెందిన ఉత్పత్తులకు భారత్‌ను ఎగుమతి కేంద్రంగా మార్చేందుకు భారీ అవకాశాన్ని భారత ఆర్థిక వ్యవస్థ అందిస్తుంది.                             
– సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement