న్యూఢిల్లీ: కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పథకానికి రూపకల్పన చేసింది. భారత ఆర్థిక వ్యవస్థలోని అన్ని వర్గాలను ఆదుకునే ప్రణాళికతో ఒక భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు రూ.20 లక్షల కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రారంభించారు. భారీ, మధ్య తరహా, చిన్నతరహా పరిశ్రమలవారు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, రైతులు, కూలీలు.. వ్యవస్థలోని అందరినీ ఆదుకునేలా రూపొందించిన ఈ భారీ ప్రత్యేక ప్యాకేజీ దేశ జీడీపీలో దాదాపు 10% అని ప్రధాని వెల్లడించారు.
ఆర్బీఐ, ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలతో కలిపి ఇది రూ. 20 లక్షల కోట్లుగా ఉంటుందన్నారు. ల్యాండ్, లేబర్, లిక్విడిటీ, లా (చట్టం).. వీటిపై ప్రధానంగా ఈ ప్యాకేజీలో దృష్టి పెడతామన్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజ్ పూర్తి వివరాలను రానున్న రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడిస్తారని చెప్పారాయన. ఆత్మబలం, ఆత్మ విశ్వాసం నిండుగా ఉన్న ‘ఆత్మ నిర్భర్ భారత్’ దేశ ప్రజల నినాదం కావాలన్నారు. కరోనా సంక్షోభం కారణంగా అనుకోకుండానే స్వయం సమృద్ధి దిశగా ముందడుగు వేశామన్నారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 8 గంటల నుంచి దాదాపు 35 నిమిషాల పాటు ప్రసంగించారు.
కరోనాతో ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా మారిన పరిస్థితులను, కరోనా సంక్షోభాన్ని భారత్ సమర్ధంగా ఎదుర్కొన్న తీరును ప్రధాని తన ప్రసంగంలో వివరించారు. కరోనా చికిత్సకు అవసరమైన ఔషధాలను భారత్ అనేక ప్రపంచదేశాలకు సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్వయం సమృద్ధి సాధించడానికి, ప్రపంచంలోనే అత్యుత్తమంగా రూపొందడానికి భారత్‌కు కరోనా సంక్షోభం ద్వారా అవకాశం లభించిందన్నారు. కరోనా నేపథ్యంలో దేశప్రజలనుద్దేశించి టీవీ మాధ్యమం ద్వారా ప్రధాని ప్రసంగించడం ఇది మూడో సారి.
ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
► కరోనా వైరస్ కారణంగా మునుపెన్నడూ చూడనటువంటి సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. దాదాపు 2.75 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లోనూ ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపింది.
► కరోనా సమస్య చుట్టూనే తిరుగుతూ ఇతర కీలక కార్యక్రమాలను విస్మరించలేం.
స్వయం సమృద్ధి నేటి నినాదం
► స్వయం సమృద్ధి సాధించడం ఇప్పుడు అత్యావశ్యకం. స్వయం సమృద్ధ భారత్ ఇప్పుడు అత్యంత అవసరం. అంతర్జాతీయంగా స్వయం సమృద్ధి అంటే ఇప్పుడు అర్థం మారింది. భారత సంస్కృతి, సంప్రదాయం చెప్పేది ‘వసుధైక కుటుంబం’ అనే అర్థంలోనే.
► విశ్వమానవాళి సంక్షేమమే భారత స్వయం సమృద్ధికి విస్తృతార్థం.
► బహిరంగ మల విసర్జన, పోలియో, పౌష్టికాహార లోపంపై.. ఇలా భారత్ సాధించిన ప్రతీ విజయం ప్రపంచంపై ప్రభావం చూపింది. గ్లోబల్ వార్మింగ్‌పై పోరులో అంతర్జాతీయ సౌర కూటమి అనేది ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతి. భారత్ ఇప్పుడు ఏదైనా సాధించగలదు అని ప్రపంచం నమ్ముతోంది.
► ఇప్పుడు మన వద్ద వనరులున్నాయి. శక్తి, సామర్థ్యాలున్నాయి. అత్యుత్తమ వస్తువులను ఉత్పత్తి చేయాలి. మన సప్లై చెయిన్‌ను ఆధునీకరించుకోవాలి. ఇవి మనం చేయగలం. చేస్తాం.
దేశీయానికి ప్రచారం: హా మనమంతా దేశీయ ఉత్పత్తులను కొనడమే కాదు. వాటికి ప్రచారం కూడా చేయాలి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సంస్థలన్నీ ఒకప్పుడు స్థానికంగా ఏర్పడినవే. కృషి, పట్టుదల, నాణ్యత, ప్రచారం.. మొదలైన వాటితో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయి. దేశీయ సంస్థలు ఆ దిశగా ముందుకు వెళ్లాలి. అందుకు మనమంతా ప్రోత్సహించాలి.
► మంచి ప్రోత్సాహం అందించడంతో ఖాదీ, చేనేతలకు భారీ డిమాండ్ ఏర్పడింది. అవి బ్రాండ్‌ల స్థాయికి వెళ్లాయి.
► 1999లో వై2కే సమస్య వచ్చింది. అంతర్జాతీయంగా భయభ్రాంతులను సృష్టించింది. అయితే, భారతీయ సాంకేతిక నిపుణులు ఆ సమస్యను సునాయాసంగా పరిష్కరించారు.
► కచ్ భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. కచ్ అంతా మృత్యువనే దుప్పటి కప్పుకుందా? అనేలా కనిపించింది. మళ్లీ సాధారణ స్థితి సాధ్యమా? అని అంతా అనుమానించారు. కానీ కచ్ మళ్లీ నిలబడింది. త్వరలోనే సగర్వంగా సాధారణ స్థితికి చేరుకుంది. అదే భారత్ ప్రత్యేకత.
లాక్‌డౌన్ 4.0
లాక్‌డౌన్‌ను మే 17 తరువాత కూడా పొడిగించనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. అయితే, ఈ నాలుగో దశ గత మూడు దశల తీరులో ఉండబోదని, మారిన నిబంధనలతో కొత్త తరహాలో ఉంటుందని తెలిపారు. లాక్‌డౌన్ 4.0 కు సంబంధించిన పూర్తి నిబంధనలు, ఇతర వివరాలను మే 18 లోపు వెల్లడిస్తామన్నారు. కరోనాతో మరి కొన్నాళ్లు కలిసి జీవించక తప్పని పరిస్థితుల్లో.. ఒకవైపు, ఆ మహమ్మారితో పోరాడుతూనే, అభివృద్ధి దిశగా ముందడుగు వేయాల్సి ఉందని తేల్చిచెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాకేజీ: బీజేపీ
ప్రధాని మోదీ ప్రకటించిన ప్యాకేజీ ప్రపంచంలోనే అతిపెద్దదని బీజేపీ పేర్కొంది. ఈ ప్యాకేజీ దేశ జీడీపీలో 10 శాతంతో సమానమని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశం స్వావలంబన సాధించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి నడ్డా కృతజ్ఞతలు తెలిపారు.
వలస జీవుల కష్టాలను ప్రధాని పట్టించుకోలేదు: కాంగ్రెస్
వలస కార్మికుల కష్టాలు తీరుస్తారని భావించిన దేశ ప్రజలు ప్రధాని మోదీ ప్రసంగంతో నిరుత్సాహానికి గురయ్యారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ‘వేలాది మంది వలస కార్మికులు కాలినడకన సొంతూళ్లకు పయనం కావడం అతిపెద్ద మానవ విషాదం. వారి పట్ల కనీస సానుభూతి, కనికరం చూపలేకపోయారు. దీనిపై దేశ ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు’ అని కాంగ్రెస్ పేర్కొంది. (కోయంబేడు కొంపముంచిందా?)
Comments
Please login to add a commentAdd a comment