సాక్షి, న్యూఢిల్లీ: రూపాయి వేగంగా క్షీణిస్తుండటంపై లోక్‌సభలో వాడి వేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా అసహనం, ఓ దశలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సభలో రూపాయి విలువ క్షీణత, దాని కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై రేవంత్ ప్రశ్నలు వేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..రూపాయి విలువ ఐసీయూలో ఉందని, అధికారాన్ని కాపాడుకోవాలన్న యావ తప్ప, రూపాయి పతనంపై ప్రధాని మోదీకి ప్రణాళిక లేదని విమ ర్శించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని, 8 ఏళ్ల పాలనలో భారత కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పడిపోయిందని విమర్శించారు.
డాలర్ తోపోల్చితే రూపాయి పతనాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలపాలన్నారు. గతంలో రూపాయి విలువ రూ.66కి పడిపోయినప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ రూపాయి ఐసీయూలో ఉందని అన్నారని, కానీ ఇప్పుడు రూపాయి విలువ రూ.83.20ను దాటిపోయిందని తెలిపారు. 2014 ముందు వరకు దేశ అప్పులు రూ. 55,87,149 కోట్లుగా ఉంటే తర్వాతి ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.80,00,744 కోట్లుగా ఉందని ధ్వజమెత్తారు.
జోక్యం చేసుకోవడం నా అధికారం: స్పీకర్
అంతకుముందు రేవంత్ ప్రశ్నలు వేస్తున్న సమ యంలో స్పీకర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నలు మాత్రమే వేయాలంటూ రేవంత్‌ను అడ్డుకు నే ప్రయత్నం చేశారు. మీకు సంబంధించిన ప్రశ్నలే వేయాలని సూచించారు. ఈ సమయంలో రేవంత్.. ‘మీరు మధ్యలో జోక్యం చేసుకోలేరు’అన్నారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ మైక్ కట్ చేశారు. అనంతరం కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేతను ఉద్దేశించి ‘సభ్యుడు స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం సరికాదు. స్పీకర్ మధ్యలో జోక్యం చేసుకోరాదన్న వ్యాఖ్యలు సరికాదు. సభలో జోక్యం చేసుకోవడం నా అధికారం’అని స్పష్టం చేశారు. అనంతరం స్పీకర్ సూచన మేరకు నిర్మల మాట్లాడారు. రేవంత్ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించారు.
అంతంతమాత్రపు హిందీలోనే సమాధానం చెబుతా
‘రేవంత్ తెలంగాణ నుంచి వచ్చారు. ఆయన హిందీ అంతంతమాత్రంగా ఉంది. నా హిందీ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆయన అంతంత మాత్రం హిందీకి తగ్గట్టుగా నా సమాధానం కూడా అంతంతమాత్రం హిందీలోనే చెబుతా..’ అంటూ నిర్మలా ఎద్దేవా చేశారు. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూపాయి పతనంపై చేసిన వ్యాఖ్యలే కాకుండా అప్పటి ఆర్థిక గణాంకాలను కూడా రేవంత్ చెప్పి ఉంటే బాగుండేదన్నారు.
అప్పట్లో ఆర్థిక రంగం మొత్తం ఐసీయూలోనే ఉందని అన్నారు. ఇప్పుడు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పటికీ, కరోనా తర్వాత కూడా మన ఆర్ధిక వ్యవస్థ వేగంగా ముందుకు వెళుతోందని తెలిపారు. విదేశీ శత్రువుల మాదిరిగానే మన ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుంటే అసూయ పడేవాళ్లు మన దేశంలోనూ ఉన్నారని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
శూద్రుడినన్న రేవంత్.. స్పీకర్ ఆగ్రహం
ఆర్థికమంత్రి మాట్లాడిన తర్వాత సప్లిమెంటరీ ప్రశ్నలు వేసేందుకు స్పీకర్ మరోమారు రేవంత్‌కు అవకాశం ఇచ్చారు. దీంతో రేవంత్ మాట్లాడుతూ.. ‘ఆర్థిక శాఖ మంత్రి నా భాషపై వ్యాఖ్యలు చేయడం సరికాదు. నేను శూద్రుణ్ణి. నాకు స్వచ్ఛమైన హిందీ రాదు. ఆమె బ్రాహ్మణవాది అయ్యుండొచ్చు. ఆమెకు భాషపై పట్టుండొచ్చు. అందులో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు’అని అన్నారు.
దీనిపై బీజేపీ సభ్యులు సహా, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ అభ్యంతరం తెలిపారు. స్పీకర్ ఓంబిర్లా సైతం రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘సభకు ఎన్నికైన వారెవరూ జాతి, ధర్మం మీద ఆధారపడి రారు. దేశ ప్రజలు వారిని ఎన్నుకొని పంపిస్తారు. ఎన్నడూ అలాంటి పదాలను ఎవరూ వాడరాదు..’అని హెచ్చరించారు. మరోసారి మాట్లాడినప్పుడు ధర్మం, జాతి అనే పదాలు రానీయొద్దు అని సూచించారు. రేవంత్‌కు మద్దతుగా మాట్లాడేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ సభ్యుల్ని సభనుంచి బయటకు పంపిస్తానంటూ హెచ్చరించారు. రేవంత్ పద్ధతి ఏమాత్రం సరిగాలేదని, ఆయనకు సర్ది చెప్పాలని కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment