సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్, లాక్‌డౌన్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రభుత్వం మరో ఉద్దీపన్ ప్యాకేజీ సిద్ధపడుతోందా? వరుస సమావేశాలతో, సమీక్షలతో బిజీగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థికమంత్రి, హోం మంత్రులతో తాజా భేటీ ఈ అంచనాలకు బలాన్నిస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం నాటి నెలవారీ జీఎస్టీ వసూళ్ల గణాంకాల విడుదలను ఆర్థికమంత్రిత్వ శాఖ వాయిదా వేసింది. అంతేకాదు ఆర్థిక వ్యవస్థ స్థితి, స్టిములస్ ప్యాకేజీ అంశాలపై ఒక వివరణాత్మక ప్రజెంటేషన్ ను కూడా ప్రధాని ఇవ్వనున్నారని సమాచారం. (కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం)
ఆర్థిక ప్రతిష్టంభనకు ప్రభావితమైన రంగాలకు ఊతమిచ్చేందుకు రెండవ ఉద్దీపన ప్యాకేజీని ఏర్పాటుకు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాతో ప్రధాని సుదీర్ఘ చర్చలు జరిపారు. దీంతోపాటు ఇతర ఆర్థిక మంత్రిత్వ శాఖల అధికారులతో కూడా ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. అలాగే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఇ) వంటి కీలక ఆర్థిక మంత్రిత్వ శాఖల మంత్రులతో భేటీ అయ్యారు. (లాక్‌డౌన్ 3.0 : ఈ కామర్స్ కంపెనీలకు ఊరట)
మరోవైపు ఇప్పటికే పౌర విమానయాన, కార్మిక, విద్యుత్తు సహా వివిధ మంత్రిత్వ శాఖలతో ప్రధాని శుక్రవారం సమావేశమయ్యారు. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, దేశంలో చిన్న వ్యాపారాల పునరుజ్జీవనంపై దృష్టి సారించి ప్రధాని మోదీ వాణిజ్య , ఎంఎస్‌ఎంఇ మంత్రిత్వ శాఖలతో గురువారం వివరణాత్మక చర్చలు నిర్వహించారు. ఈ సమావేశాలలకు హోంమంత్రి, ఆర్థికమంత్రి ఇద్దరూ హాజరు కావడం గమనార్హం. కాగా ప్రభుత్వం మార్చి చివరిలో 1.7 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. కొన్ని మినహాయింపులు, సడలింపులతో దేశవ్యాప్తంగా మే 4వ తేదీనుంచి మే 17 వరకు మూడవ దశ లాక్‌డౌన్ అమలు కానున్న సంగతి తెలిసిందే. (హెచ్-1బీ వీసాదారులకు భారీ ఊరట) (మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ)
Comments
Please login to add a commentAdd a comment