నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ వల్ల నష్టపోతున్న కీలక రంగాలకు అందజేయాల్సిన రెండో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు పలువురు మంత్రులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ప్రస్తుత ఆర్థిక రంగం స్థితిగతులపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో తొలి విడతగా రూ.1.7 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు, వంట గ్యాస్ పంపిణీ, పేద మహిళలకు, వృద్ధులకు నగదు పంపిణీ వంటివి ఈ ప్యాకేజీలో ఉన్నాయి. రెండో విడత ప్యాకేజీపై కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో కొద్దిరోజులుగా వరుసగా సమావేశమవుతున్నారు. ప్యాకేజీ ఎలా ఉండాలనే దానిపై వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. త్వరలోనే ఈ ప్యాకేజీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
వ్యవసాయ రంగంలో సంస్కరణలపై చర్చలు
లాక్‌డౌన్ వల్ల వ్యవసాయ పనులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. వ్యవసాయ రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, రైతులకు సంస్థాగత రుణ పరపతి, నిబంధనల సడలింపు వంటి వాటిపై ప్రధానంగా చర్చించారు. భారత్‌స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) వ్యవసాయ రంగం వాటా 15 శాతం. దేశ జనాభాలో సగానికిపైగా ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. వ్యవసాయంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, ఉత్పత్తిని పెంచడంపై ప్రధాని సంప్రదింపులు జరిపారు. మన రైతులు అంతర్జాతీయ పోటీలో ముందంజలో నిలవాలంటే సాగులో సాంకేతిక పరిజ్ఞానానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని నరేంద్ర మోదీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment