లాక్‌డౌన్‌ తర్వాత వ్యూహం ఏంటి? | PM Modi discusses post lockdown strategy with Amit Shah and other ministers | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ తర్వాత వ్యూహం ఏంటి?

Published Sat, May 2 2020 4:16 AM | Last Updated on Sat, May 2 2020 11:48 AM

PM Modi discusses post lockdown strategy with Amit Shah and other ministers - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు వారాలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ఈ నెల 3తో ముగియనుండగా.. తదుపరి అనుసరించాల్సిన మార్గాలపై ప్రధాని నరేంద్ర మోదీ.. హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, రైల్వే శాఖల మంత్రి పీయూష్‌గోయల్‌తో శుక్రవారం కీలక సమావేశం నిర్వహించారు. సమావేశ వివరాలపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. గత కొన్ని రోజులుగా ప్రధాని అనేక అంశాలపై సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ప్రభు త్వ వర్గాలు పేర్కొన్నాయి. 3వ తేదీ తర్వాత పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను రెడ్‌జోన్‌ ప్రాంతాలకే పరిమితం చేయవచ్చని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, స్థానికంగా తయారీని ప్రోత్సహించడం, ఆర్థిక రంగ వృద్ధి ప్రేరణ కోసం అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై ప్రధాని గురువారం కూడా ఒక సమావేశం నిర్వహించడం గమనార్హం. రక్షణ రంగం, మైనింగ్, మినరల్స్‌ శాఖపైనా ఆయన సమీక్షలు జరిపారు. లాక్‌డౌన్‌తో ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకు కేంద్రం తొలి విడతగా రూ.1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించగా, వివిధ రంగాలకు ప్రోత్సాహకాలతో మరో ప్యాకేజీని త్వరలో ప్రకటించనుందని తెలుస్తోంది.  

పౌర విమానయాన రంగం పటిష్టతపై దృష్టి
దేశీయంగా పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగానూ ప్రధాని మోదీ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భారత గగనతలాన్ని మరింత ప్రభావవంతంగా వినియోగించుకోవాలని, ప్రయాణ సమయాన్ని తగ్గించాలని నిర్ణయించారు. ఇది ఎయిర్‌లైన్స్‌ సంస్థల వ్యయాలను తగ్గించేందుకు తోడ్పడనుంది. సైనిక వ్యవహారాల విభాగంతో కలసి సన్నిహిత సహకారం ద్వారా దీన్ని చేపట్టనున్నట్టు అధికారిక ప్రకటన ద్వారా ప్రభుత్వం తెలిపింది. మరింత ఆదాయం రాబట్టడం, విమానాశ్రయాల్లో సమర్థతను తీసుకొచ్చే లక్ష్యంతో.. పౌర విమానాయాన శాఖ 3 నెలల్లో మరో 6 విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో అప్పగించేం దుకు టెండర్‌ ప్రక్రియ ఆరంభించాలని కోరింది.   

బ్యాంకర్లతో నేడు ఆర్‌బీఐ గవర్నర్‌ భేటీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక రంగ స్థితిగతులు తెలుసుకునేందుకు, పరిశ్రమకు ఊతమిచ్చే చర్యలపై చర్చించేందుకు బ్యాంకుల చీఫ్‌లతో రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శనివారం సమావేశం కానున్నారు. వడ్డీ రేట్ల కోత ప్రయోజనాల బదలాయింపు, పరిశ్రమకు నిధులపరమైన తోడ్పాటు అందించడం సహా రిజర్వ్‌ బ్యాంక్‌ ఇటీవల ప్రకటించిన పలు చర్యల అమలుపై కూడా చర్చించవచ్చని సమాచారం. అలాగే, చిన్న, మధ్యతరహా సంస్థలు.. గ్రామీణ రంగం కోసం ప్రకటించిన విధానాలను సమీక్షించనున్నారు. ఎకానమీపై ఒత్తిడి తగ్గించేందుకు తీసుకోతగిన చర్యల గురించి బ్యాంకర్లు కూడా ఈ సమావేశంలో తగు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
కేంద్ర మంత్రులతో మోదీ భేటీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement