
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఉద్దేశించిన లాక్‌డౌన్ 4.0 గడువు ముగియనున్న నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రధాని మోదీని కలిశారు. లాక్‌డౌన్‌పై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం జరిపిన టెలిఫోన్ సమావేశాల సమాచారాన్ని హోం మంత్రి ప్రధానికి వివరించారని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ప్రధాని మోదీ మార్చి 24న మూడు వారాల లాక్‌డౌన్ విధించగా.. ఆ తరువాత దాన్ని మే 3వ తేదీ వరకు, అనంతరం 17వ తేదీ వరకు, తాజాగా ఈ నెలాఖరు దాకా పొడిగించిన విషయం తెలిసిందే.
సీఎంలతో చర్చల సందర్భంగా అమిత్ షా ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితిని, వారి ఆందోళనలను, జూన్ ఒకటో తేదీ తరువాత ఏ ఏ రంగాల్లో మరిన్ని సడలింపులు అవసరం అన్న విషయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు అధికారులు తెలిపారు. చాలామంది సీఎంలు లాక్‌డౌన్‌ను ఏదో ఒక విధంగా కొనసాగించాలని అభిప్రాయపడినట్లు సమాచారం. అదేసమయంలో ఆర్థిక కార్యకలాపాలను నెమ్మదిగానైనా సాధారణ స్థితికి తీసుకు రావాలని వారు కోరినట్లు తెలుస్తోంది. తాజా లాక్‌డౌన్ పొడిగింపు, సడలింపులపై ప్రభుత్వం శని, ఆదివారాల్లో ప్రకటన చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment