భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గురువారం రెండు ప్రముఖ సంస్థలు- ఐక్యరాజ్యసమితి, ఇండియా రేటింగ్స్ వెలువరించిన అంచనాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి.
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గురువారం రెండు ప్రముఖ సంస్థలు- ఐక్యరాజ్యసమితి, ఇండియా రేటింగ్స్ వెలువరించిన అంచనాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.8 శాతం వద్ద కట్టడి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం కష్టం కావచ్చని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి పేర్కొంది.
ప్రభుత్వానికి వచ్చే ఆదాయంకన్నా, చేసే వ్యయం అధికంగా ఉండే పరిస్థితిని ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. తక్కువ వృద్ధిరేటు, సబ్సిడీల భారం తీవ్రంగా ఉండడం, పన్నుల ఆదాయం తగ్గే అవకాశాలు వంటి అంశాలు తమ అంచనాలకు కారణమని ఐక్యరాజ్యసమితిని నివేదిక పేర్కొంది. ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2014’ పేరుతో రూపొందించిన నివేదికలో సమితి ఈ వ్యాఖ్యలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4.9 శాతం. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 4.8 శాతంగా ఉంటుందని, 2014-15లో ఇది 5.3 శాతానికి పెరగవచ్చని కూడా తెలిపింది. రూపాయి విలువ తగ్గడం వల్ల ఎగుమతులు రానున్న నెలల్లో పెరగవచ్చని వివరించింది.
ఇండియా రేటింగ్స్ ఇలా..: కాగా 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత మౌలిక రంగం ఔట్‌లుక్‌ను ‘ప్రతికూలత’ గ్రేడింగ్‌లో ఉంచుతున్నట్లు ఫిచ్ గ్రూప్ కంపెనీ ఇండియా రేటింగ్స్ గురువారం పేర్కొంది. పలు కంపెనీల ప్రాజెక్టులకు బలహీన రుణ పరిస్థితులు దీనికి కారణమని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.