
మార్కెట్లకు జీడీపీ జోష్...
స్టాక్ మార్కెట్లపై నిపుణుల విశ్లేషణ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై దృష్టి
ఎన్నికల ఫలితాలపై ఇన్వెస్టర్లలో అప్రమత్తత
విదేశీ సంకేతాలు, ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ఎఫెక్ట్
న్యూఢిల్లీ: వారాంతంలో వెల్లడైన ఆర్థిక వృద్ధి(జీడీపీ) గణాంకాలు సోమవారంనాడు సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయని స్టాక్ నిపుణులు అంచనా వేశారు. ఆపై పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మార్కెట్ దృష్టిసారిస్తుందని విశ్లేషించారు. గడిచిన శుక్రవారం జీడీపీపై అంచనాలతో మార్కెట్లు పుంజుకున్న విషయం విదితమే. సెన్సెక్స్ 257 పాయింట్లు పురోగమించడంతో వారం మొత్తానికి 574 పాయింట్లు జమ చేసుకోగలిగింది. వెరసి వరుసగా మూడు వారాలపాటు నమోదైన నష్టాలకు చెక్ పెట్టింది. క్యూ2(జూలై-సెప్టెంబర్)లో ఆర్థిక వృద్ధి అంచనాలను మించుతూ తొలి క్వార్టర్‌కంటే అధికంగా 4.8% నమోదుకావడం సానుకూల అంశమని నిపుణులు విశ్లేషించారు. క్యూ1 (ఏప్రిల్-జూన్)లో జీడీపీ వృద్ధి 4.4% మాత్రమే. కాగా ఈ నెల 5 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లలో అప్రమత్తత కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఐదు రాష్ట్రాల విధానసభలకు జరుగుతున్న ఎన్నికలు పూర్తికానున్నాయి. ఆపై ఫలితాలు వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు కొంతమేర జాగ్రత్తగా వ్యవహరించే అవకాశమున్నదని తెలిపారు.
ఆటోపై ఫోకస్
నవంబర్ నెలకు అమ్మకాల వివరాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఆటో రంగ షేర్లు ఈ వారం వెలుగులో నిలుస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో రూపాయి మారకపు విలువ, అంతర్జాతీయ అంశాలు కూడా సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపుతాయని వివరించారు. జీడీపీ గణాంకాల జోష్ సోమవారం ట్రేడింగ్‌లో కనిపిస్తుందని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అంచనా వేశారు. శుక్రవారంనాటి జోరు కొనసాగుతుందని, ప్రైవేట్ బ్యాంకింగ్‌తోపాటు, ఎంపిక చేసిన మిడ్ క్యాప్ షేర్లను పెట్టుబడులకు పరిగణించవచ్చునని పేర్కొన్నారు. నిఫ్టీ 6,200ను అధిగమిస్తే మార్కెట్లు మరింత పురోగమిస్తాయని అభిప్రాయపడ్డారు. అంచనాలను మించిన జీడీపీ కారణంగా రూపాయి బలపడటమేకాకుండా ఈక్విటీ మార్కెట్లు కూడా ఊపందుకుంటాయని ఆర్‌కేఎస్‌వీ సహవ్యవస్థాపకుడు రఘు కుమార్ చెప్పారు.
పెట్టుబడులు ఓకే
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఈ బాటలో గత నెల(నవంబర్)లో రూ. 8,000 కోట్లను(1.3 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్‌చేశారు. దీంతో ఈ ఏడాది(2013)లో ఇప్పటి వరకూ ఎఫ్‌ఐఐల పెట్టుబడులు రూ. 97,050 కోట్లకు(17.5 బిలియన్ డాలర్లు) చేరుకున్నాయి. సెబీ విడుదల చేసిన తాజా గణాంకాలివి. ఎఫ్‌ఐఐలు నవంబర్ నెలలో రూ. 8,000 కోట్లను(130 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్‌చేయడం గమనార్హం.