
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి ఇక ఈ ఏడాది ఉండబోదని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీపీఎం) సభ్యుడు నీలేష్ షా సూచించారు. మార్చి త్రైమాసికం (2021 జనవరి–మార్చి) లేదా జూన్ త్రైమాసికం (2021 ఏప్రిల్–జూన్)లోనే భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలోకి వస్తుందని ఆయన అంచనావేశారు. సంక్షోభ స్థితి నుంచి అవకాశాల బాటకు భారత్ మళ్లాల్సి ఉంటుందని కూడా ఆయన అన్నారు. ఇందుకు సంస్కరణలే మార్గమని బుధవారం స్పష్టం చేశారు.
నీలేష్ షా ప్రస్తుతం కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లు పెరుగుదలకు ఆశావాదమే కారణమవుతోందని కూడా ఆయన విశ్లేషించారు. మార్కెట్లు గత గణాంకాలను కాకుండా, భవిష్యత్‌వైపు దృష్టి సారిస్తున్నాయని అన్నారు. ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ నిర్వహించిన ఒక వెబ్‌నార్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సంక్షోభ పరిస్థితుల నుంచి అవకాశాలవైపు వెళ్లడం అంశాన్ని ఆయన విశ్లేషిస్తూ, ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో చైనా నుంచి కంపెనీలు బయటకు వచ్చేయాలనుకుంటున్నాయి. దీనిని భారత్ అవకాశంగా తీసుకోవాలి.
కంపెనీలు భారత్‌లోకి రావడానికి తగిన ప్రయత్నాలు జరగాలి. ఈ దిశలో పాలనా, ఆర్థిక సంస్కరణలను చేపట్టాలి’’ అని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, విద్యుత్ వ్యయాలు తగ్గడం వంటి చర్యలను భారత్ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు, చమురు ధరలు తక్కువగా ఉండడం, సానుకూల వ్యవసాయం వంటి అంశాలు భారత్‌కు ప్రస్తుతం సానుకూలంగా ఉన్నాయని అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు మంచి వ్యాపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. నాలుగు రెట్ల వృద్ధి లక్ష్యంగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం వీటిలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య 2.5 కోట్లయితే వచ్చే ఐదారేళ్లలో ఈ సంఖ్యను 10 కోట్లకు పెంచాలన్నది పరిశ్రమ లక్ష్యంగా ఉందని వివరించారు.