నేడు ఆర్‌బీఐ పాలసీ సమీక్ష
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) త్రైమాసిక ద్రవ్య, పరపతి సమీక్ష మంగళవారం జరగనుంది. గవర్నర్ రఘురామ్ రాజన్ పాలసీ రేట్లకు సంబంధించి తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటు-రెపో 8 శాతంగా ఉంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మందగమనంలో ఉండడం, ఆర్‌బీఐ లక్ష్యాలకన్నా తక్కువగా కనిష్ట స్థాయిల్లో తిరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల తగ్గుదల వంటి అంశాల నేపథ్యంలో వృద్ధికి ఊతం అందించడానికి రేట్ల కోతకు ఇది సరైన సమయమని ప్రభుత్వ వర్గాలుసహా పలువురు వాదిస్తున్నారు.
ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం కూడా ఈ విషయంలో రాజన్‌ను ఒప్పించాలని ఇప్పటికే కేంద్రానికి సూచించారు. అయితే ఖరీఫ్ దిగుబడులు తగ్గే అవకాశం, ద్రవ్యోల్బణం తగ్గుదలలో బేస్ ఎఫెక్ట్ ప్రభావం, చమురు రంగానికి సంబంధించి అనిశ్చితి వాతావరణం తదితర అంతర్జాతీయ అంశాల నేపథ్యంలో ప్రస్తుతానికి రేట్ల కోత ఉండదని ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్యసహా పలువురు నిపుణులు అంచనావేస్తున్నారు.