ఆర్‌బీఐ పాలసీ సమీక్ష, అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..! | RBI may cut rates again to support growth | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ పాలసీ సమీక్ష, అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!

Published Mon, Dec 2 2019 5:51 AM | Last Updated on Mon, Dec 2 2019 6:08 AM

RBI may cut rates again to support growth - Sakshi

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేవలం 4.5 శాతం వృద్ధి రేటుకే పరిమితమైంది. గడచిన ఆరేళ్లలో వృద్ధి వేగం ఇంతటి తక్కువ స్థాయిని నమోదుచేయడం ఇదే తొలిసారి కాగా, శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత వెల్లడైన జీడీపీ గణాంకాలు.. సోమవారం ట్రేడింగ్‌పై ప్రభావం చూపనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వారం మొదటి రోజు ట్రేడింగ్‌పైనే తాజా డేటా ప్రభావం ఉండనుండగా.. మీడియం టెర్మ్‌లో మార్కెట్‌ పథంలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చని రెలిగేర్‌ బ్రోకింగ్‌ వీపీ రీసెర్చ్‌ అజిత్‌ మిశ్రా అన్నారు.

ఇక వృద్ధి రేటు కనిష్ట స్థాయిలకు పడిపోయిన నేపథ్యంలో లిక్విడిటీ పెంపు చర్యల్లో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించ వచ్చనే అంచనాలు సూచీలను నిలబెట్టే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీíసీ) సమావేశం 3న (మంగళవారం) ప్రారంభమై, 5న (గురువారం) ముగియనుంది. ఈ సమావేశంలో కీలకమైన రెపో రేటుపై ఎంపీసీ నిర్ణయం తీసుకోనుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రేటు 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గవచ్చని ఎమ్‌కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ రీసెర్చ్‌ విశ్లేషకులు రాహుల్‌ గుప్తా అంచనావేశారు. వినియోగదారుల నుంచి డిమాండ్‌ తగ్గిన కారణంగా తయారీ, పారిశ్రామిక రంగాలు మందగమనంలో ఉన్నందున మళ్లీ వృద్ధి రేటును గాడిలో పెట్టడం కోసం వడ్డీ రేట్లను తగ్గించవచ్చని విశ్లేషించారు. ఇక్రా ప్రిన్సిపల్‌ ఎకనామిస్ట్‌ అదితి నాయర్,  ప్రభుదాస్‌ లిల్లాధర్‌ కూడా పావు శాతం తగ్గింపును అంచనావేస్తున్నట్లు చెప్పారు.

ఆటో సేల్స్, ఆర్థికాంశాల ప్రభావం..
ఈ వారంలో ఆటో, టెలికం రంగాల షేర్లు మార్కెట్‌ దృష్టిని ఆకర్షించనున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ విశ్లేషించారు. దేశీ ఆటో రంగ నవంబర్‌ నెల అమ్మకాలు ఆదివారం వెల్లడికాగా.. మారుతీ సుజుకీ విక్రయాలు 1.9%, టాటా మోటార్స్‌ అమ్మకాలు 25% క్షీణతకే పరిమితం అయ్యాయి. అంతక్రితం నెలల్లో వరుసగా భారీ తగ్గుదలను నమోదుచేసిన ఆటో రంగ కంపెనీలు.. ఇక నుంచి గాడిన పడవచ్చనే సంకేతాలను ఇస్తున్నాయి. మరోవైపు, ట్యారిఫ్‌లను పెంచుతూ టెలికం రంగాలు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రంగాల్లో కొనుగోళ్లకు అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు.

కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ...
భారత్‌ కాపిటల్‌ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. వరుసగా 3వ నెల్లోనూ వీరు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. నవంబర్‌ నెల్లో రూ. 22,872 కోట్లు వెచ్చించారు. ఈక్విటీ మార్కెట్లో రూ.25,230 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా.. డెట్‌ మార్కె ట్‌ నుంచి రూ. 2,358 కోట్లు వెనక్కితీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement