క్లిష్ట పరిస్థితులను తట్టుకుంటున్న ఎకానమీ | Indian economy presents a picture of resilience amid global shocks | Sakshi
Sakshi News home page

క్లిష్ట పరిస్థితులను తట్టుకుంటున్న ఎకానమీ

Published Fri, Dec 30 2022 6:15 AM | Last Updated on Fri, Dec 30 2022 6:15 AM

Indian economy presents a picture of resilience amid global shocks - Sakshi

ముంబై: అంతర్జాతీయంగా ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితులు, సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకుని నిలబడగలుగుతోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకుగాను తగిన చర్యలు తీసుకోవడానికి నియంత్రణ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని  కూడా ఆయన అన్నారు. 26వ ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్‌) నివేదికలో ఆయన ఈ మేరకు ముందుమాట రాశారు. ఇంకా ఆయన పేర్కొన్న అంశాలు ఏమిటంటే..

► అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సవాళ్లలో ఉంది. ప్రపంచంలోని పలు దేశాలు అనుసరిస్తున్న కఠిన  ద్రవ్య విధానాల కారణంగా ఆర్థిక మార్కెట్లు గందరగోళంలో ఉన్నాయి. ఆహారం, ఇంధన సరఫరాలు ధరలు ఒత్తిడికి లోనవుతున్నాయి.  అనేక అభివృద్ధి చెందుతున్న దేశా లు, ఎకానమీలు రుణ సమస్యల్లో ఉన్నాయి. ప్ర తి ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లతో పోరాడుతోంది.  
► ఇటువంటి ప్రపంచ సవాళ్ల మధ్య భారత ఎకానమీ స్థిర ఆర్థిక ముఖచిత్రాన్ని కలిగిఉంది. దేశీయ ఆర్థిక మార్కెట్లు స్థిరంగా, పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పని చేస్తున్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థ తగిన మూలధనంతో పటిష్టంగా ఉంది. ఫారెక్స్‌ నిల్వలు, కరెంట్‌ అకౌంట్‌ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం), వాణిజ్యలోటు వంటి అంతర్జాతీయ ఆర్థిక అంశాల విషయంలో దేశానికి పూర్తి సానుకూల పరిస్థితి ఉంది.  
► కొన్ని సవాళ్లను చెప్పుకోవాలంటే అందులో వాతావరణ మార్పులు–నిర్వహణ ఒకటి. అలాగే ఊహించని సవాళ్లు ఎదురయినప్పుడు వాటిని ఎదుర్కొనడం, ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టత, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కొత్త ఆవిష్కరణలు, అందరికీ ఆర్థిక ప్రయోజనాలు అందేలా చూడ్డం వంటి అంశాలపై మరింత దృష్టి అవసరం. రెగ్యులేటర్లు, విధాన నిర్ణేతల ప్రాధాన్యత ఆయా అంశాలపై కొనసాగుతుంది.  
► ఇక ద్రవ్యోల్బణం కట్టడికి తగిన అన్ని చర్యలనూ సెంట్రల్‌ బ్యాంక్‌ తీసుకుంటుంది. ఈ విషయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది.  
► భారతీయ ఆర్థిక వ్యవస్థ తన పటిష్ట స్థూల ఆర్థిక మూలాధారాల నుండి ప్రయోజనం పొందుతున్నప్పటికీ, ప్రపంచ పరిణామాలను ఎదుర్కొనడంపై ఆర్‌బీఐ నిరంతరం దృష్టి సారిస్తుంది.  
► రిజర్వ్‌ బ్యాంక్‌తో పాటు ఇతర ఆర్థిక నియంత్రణ సంస్థలు కూడా భారత ఆర్థిక వ్యవస్థ అత్యున్నత స్థాయి ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తాయి.  అవసరమైనప్పుడు తగిన జోక్యాల ద్వారా మన ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, పటిష్టతను పరిరక్షించడానికి, సంసిద్ధతతో ఉన్నాయి.  
► 2023లో భారతదేశం జీ20 దేశాల ప్రెసిడెన్సీలో భాగంగా ప్రపంచ వేదికపై ప్రముఖ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది. ఒక సమూహంగా జీ20 దేశాల ముందు ఉన్న అతిపెద్ద సవాలు.. ప్రపంచ సర్వతోముఖాభివృద్ధికి తగిన నిర్ణయాలను సమిష్టిగా తీసుకోవడం.  
► ఆర్థిక స్థిరత్వానికి సవాళ్లను పరిష్కరించడానికి, పెట్టుబడిదారులను రక్షించడానికి క్రిప్టో కరెన్సీ విషయంలో అన్ని స్థాయిల్లో ఏకాభిప్రాయ సాధ­న చాలా ముఖ్యం. ఈ విషయంలో తగిన ప్రయ త్నాలు జరగాలి.   


బ్యాంకింగ్‌ రంగం పటిష్టం...
భారత్‌ బ్యాంకింగ్‌ రంగం తగిప మూలధనంతో పటిష్టంగా ఉందని 26వ ఫైనాన్షియల్‌ స్థిరత్వ నివేదిక  పేర్కొంది.  భారత్‌ బ్యాంకింగ్‌ స్థూల మొండిబకాయిలు (జీఎన్‌పీఏ) సెప్టెంబర్‌ 2022 నాటికి ఏడేళ్ల కనిష్ట స్థాయి 5 శాతానికి తగ్గాయని తెలిపింది. నివేదిక ప్రకారం,  017–18 ఆర్థిక సంవత్సరంలో గరిష్ట స్థాయికి చేరిన స్థూల మొండిబకాయిలు అటు తర్వాత క్రమంగా దిగివచ్చాయి. 2022 మా ర్చిలో ఇది 5.8 శాతానికి తగ్గింది. చెల్లింపుల్లో వైఫల్యాలు తగ్గడం, రికవరీలు  మెరుగుపడ్డం, బకా యిల మాఫీ వంటి అంశాలు స్థూల మొండిబకా యిలు తగ్గడానికి కారణం. ప్రస్తుతం బ్యాంకింగ్‌ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడుతోంది. రుణ నాణ్య త పెరిగింది. మూలధన నిల్వలు పటిష్టంగా ఉన్నా యి. అయితే వడ్డీరేట్ల పెరుగుదల, ఆర్థిక మందగమనం వంటి అంశాలు బ్యాంకింగ్‌ రంగంపై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.  

క్యూ2లో క్యాడ్‌ తీవ్రత
కాగా, భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.4 శాతంగా నమోదయ్యిందని ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి. గణాంకాల ప్రకారం, విలువలో ఇది 36.4 బిలియన్‌ డాలర్లు. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) క్యాడ్‌ అప్పటి జీడీపీ విలువలో  2.2 శాతం ఉంటే, విలువలో 18.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2021–22) క్యూ2లో జీడీపీలో క్యాడ్‌ 1.3 శాతం అయితే, విలువలో 9.7 బిలియన్‌ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌)మధ్య క్యాడ్‌ 3.3 శాతంకాగా (జీడీపీ)లో 2021–22 ఇదే కాలంలో కేవలం 0.2 శాతంగా ఉంది.

ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారీగా పెరగడం క్యాడ్‌ తీవ్రతకు  దారిస్తోందని గణాంకాలు వెల్లడించాయి. కాగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో నిధులు క్రమంగా పెరుగుతున్నందున, క్యాడ్‌ను భారత్‌ సమర్థవంతంగా నిర్వహించగలిగిన స్థితిలోనే ఉందని ఆర్‌బీఐ ఫైనాన్షియల్‌ స్థిరత్వ నివేదిక పేర్కొంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) ముగిసే సరికి భారత్‌ కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌) 2 నుండి 3 శాతం (జీడీపీ విలువతో పోల్చి) మధ్య ఉండవచ్చని అంచనా.  ఈ స్థాయి క్యాడ్‌తో స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎటువంటి ముప్పు ఉండబోదన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే క్యూ2లో భారీగా క్యాడ్‌ నమోదుకావడం తాజా ఆందోళనకు కారణం అవుతోంది. కరోనా తీవ్రత, ఆర్థిక మందగమనం నేపథ్యంలో 2020–21లో భారతదేశం జీడీపీలో 0.9 శాతం కరెంట్‌–ఖాతా మిగులు నమోదయ్యింది. కాగా, 2021–22లో 1.2 శాతం కరెంట్‌–ఖాతా లోటు ఏర్పడింది.

క్యాడ్‌ అంటే...
ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్‌ అకౌంట్‌’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్‌ అకౌంట్‌ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్‌ అకౌంట్‌ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement