బ్యాంకింగ్ వ్యవస్థలోకి 99.74 శాతం కుటుంబాలు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన ధన యోజన కింద ఇప్పటికి దాదాపు 11.5 కోట్ల బ్యాంక్ ఖాతాలు ప్రారంభమైనట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం తెలిపారు. లక్ష్యం 10 కోట్లకన్నా ఇది అధికమన్న విషయాన్ని ఆర్థికమంత్రి గుర్తుచేసారు. పాత ఖాతాలతో సహా తాజా జనధన ఖాతాలతో 99.74 శాతం కుటుంబాలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లు ప్రారంభమైనట్లయ్యిందని ఆయన సూచనాప్రాయంగా తెలిపారు.
భారత్ యావత్తూ దాదాపు బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించినట్లయ్యిందని కూడా పేర్కొన్నారు. జన ధన అకౌంట్లలో రూ.9,000 కోట్లకు పైగా డిపాజిట్ అయినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. దేశంలో ప్రజలందరినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడం లక్ష్యంగా జన ధన పథకాన్ని గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవంనాడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 2015 జనవరి 26 నాటికి పేదల చేత 7.5 కోట్ల అకౌంట్లను ప్రారంభించాలన్నది ఆగస్టు 28న ప్రారంభమైన ఈ పథకం లక్ష్యం. ఆ తర్వాత లక్ష్యాన్ని 10 కోట్లకు పెంచారు.
గిన్నిస్ రికార్డు...
ఇదిలావుండగా ప్రధాని జనధన యోజన కింద ఒకేవారంలో అత్యధిక బ్యాంకు అకౌంట్లు ప్రారంభం కావడం గిన్నిస్ రికార్డుల్లో కూడా నమోదయ్యిందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హాస్‌ముఖ్ అధియా తెలిపారు. 2014 ఆగస్టు 23 నుంచి 29వ తేదీల మధ్య 1,80,96,130 అకౌంట్లు ప్రారంభమయ్యాయని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల శాఖకు వరల్డ్ గిన్నిస్ రికార్డుల్లో స్థానం లభించిందన్నారు.
గొప్ప మార్పు: ప్రధాని
జన్‌ధన్ యోజన మంచి ఫలితాలను సాధించిందని ప్రధాని నరేంద్రమోదీ కూడా ట్వీట్ చేశారు. కేవలం నాలుగు నెలల్లో ఈ విజయాన్ని సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆర్థిక వ్యవస్థలో ప్రజలందరి భాగస్వామ్యం దేశ ఆర్థిక విజయానికి దోహదపడే అంశమని పేర్కొన్నారు.